Image for Representation
ఆసక్తి ఉంటే ఏ పని చేయడానికైనా వయసుతో నిమిత్తం లేదని ఇప్పటికే చాలామంది మహిళలు నిరూపించారు. కొందరు మహిళలు తమ పిల్లలతో కలిసి పైచదువులు చదువుతుంటే మరికొందరు వృద్ధాప్యంలో తమ మనవళ్లు, మనవరాళ్లతో కలిసి డిగ్రీ పట్టాలు అందుకున్నవారూ ఉన్నారు. సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది కేరళకు చెందిన జయశ్రీ. పేదరికం అడ్డొచ్చినా పాతికేళ్ల క్రితమే పీజీ పూర్తి చేసిన ఆమె పెళ్లి, పిల్లల బాధ్యత కోసం తన కలల కెరీర్‌ను త్యాగం చేయాల్సి వచ్చింది. కానీ లాయర్ కావాలన్న కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. ఈక్రమంలో పిల్లలిద్దరూ పెరిగి పెద్దవడంతో మళ్లీ తన లక్ష్యాన్ని పట్టాలెక్కించింది. భర్త ప్రోత్సాహంతో 50 ఏళ్ల వయసులో ఎల్ఎల్బీ పట్టాను అందుకుని నల్లకోటు ధరించాలన్న తన కలను సాకారం చేసుకుంది. మరి, ఇదంతా ఆమెకు ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం రండి...
భర్తకు తోడుగా ఉండడం కోసం..!
ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో సాధించాలన్న తపన, కోరిక ఉంటాయి. అయితే వివిధ కారణాల వల్ల వాటిని వదులుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళల విషయానికొస్తే...పేదరికం, పెళ్లి, పిల్లలు తదితర బాధ్యతల వల్ల తమ చదువులకు ఫుల్స్టాప్ పెట్టేస్తుంటారు. ఈ క్రమంలో కేరళలోని కుట్టిచల్కు చెందిన జయశ్రీ పాతికేళ్ల క్రితమే పీజీ పూర్తి చేసింది. దీంతో పాటు టైప్ రైటింగ్, ట్యాలీ కోర్సులు కూడా పూర్తి చేసింది. ఆ తర్వాత పెళ్లి కావడంతో తన భర్తకు తోడుగా నిలబడేందుకు ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్‌గా చేరింది. అయినా తన మనసులో ఏదో మూలన లాయర్ కావాలన్న తపన మాత్రం అలాగే ఉండిపోయింది.
ఉద్యోగం చేస్తూనే క్లాసులకు వెళ్లా..
జయశ్రీ పిల్లలిద్దరూ పెరిగి ప్రస్తుతం పెద్దవారయ్యారు. ఆమె కుమారుడు గోకుల్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తుండగా, కూతురు గోపిక బీఎస్సీ చదువుతోంది. ఈక్రమంలోనే నల్లకోటు వేసుకోవాలనుకున్న తన లక్ష్యాన్ని మళ్లీ పట్టాలెక్కించింది జయశ్రీ. తన భర్త ప్రోత్సాహంతో తిరువనంతపురంలోని కేరళ లా అకాడమీ కాలేజీలో ఎల్ఎల్బీ ఈవెనింగ్ కోర్సులో చేరింది. అలా ఓ వైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు క్లాసులకు హాజరవుతూ తను కోరుకున్న కలను సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కేరళ యూనివర్సిటీ విడుదల చేసిన ఎల్ఎల్బీ పరీక్షా ఫలితాల్లో మూడో ర్యాంకు సొంతం చేసుకుంది జయశ్రీ.
క్లాసు పూర్తయ్యేంత వరకూ వేచి ఉండేవారు..
‘నాకు చిన్నప్పటి నుంచి లాయర్ అవ్వాలన్న కోరిక బలంగా ఉండేది. కానీ పెళ్లయ్యాక మా ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్‌గా చేరాను. అయితే నా ఇద్దరు పిల్లలు క్రమంగా పెరిగి పెద్దవారై కాలేజీకి వెళుతున్నారు. ఇంట్లో కూడా వారి పనులు వారే చూసుకుంటున్నారు. దీంతో నాకు కొద్దిగా ఖాళీ సమయం దొరికినట్లయింది. అదే సమయంలో కేరళ లా అకాడమీ నుంచి ఎల్ఎల్బీ నోటిఫికేషన్ వెలువడంతో నా ఆక్షాంక్షను భర్తతో పంచుకున్నాను. ఆయన నా నిర్ణయం విని ఎంతో సంతోషించారు. అంతేకాదు అడుగడుగునా నాకు అండగా ఉండి వెన్నుతట్టి ప్రోత్సహించారు. ముఖ్యంగా మా ఇల్లు, లా కాలేజీ మధ్య ఎలాంటి కనెక్టింగ్ బస్సులు ఉండేవి కావు. దీంతో ఆయనే రోజూ నన్ను పికప్ చేసుకునేవారు. ఈక్రమంలో నా క్లాసు పూర్తయ్యేవరకు కాలేజీ ఆవరణలోనే నా కోసం ఓపికగా వేచి చూసేవారు. మా కుటుంబ సభ్యులు, స్నేహితులు, అధ్యాపకులు కూడా నాకు బాగా సహకరించారు. వీరందరి సహకారంతోనే ఎల్ఎల్బీ ఫలితాల్లో నాకు యూనివర్సిటీ పరిధిలో మూడో ర్యాంకు వచ్చింది’.
క్రిమినల్ లాయర్ కావాలనుకుంటున్నా!
‘నేను ఏ పని ప్రారంభించినా నిజాయతీతో పూర్తి చేయాలనుకుంటాను. అందుకోసం వంద శాతం కష్టపడతాను. నేను 50 ఏళ్ల వయసులో ఎల్ఎల్బీ పట్టా అందుకోవడానికి ఇవే కారణం. కోర్సు పూర్తయిన వెంటనే నేను వంచియూర్ జిల్లా కోర్టులో జూనియర్ లాయర్‌గా ప్రాక్టీసు ప్రారంభించాను. భవిష్యత్‌లో క్రిమినల్ లాయర్‌గా స్థిరపడాలన్నది నా కోరిక’ అంటోందీ సూపర్ వుమన్. ఈక్రమంలో జయశ్రీ గురించి తెలుసుకున్న లా అకాడమీ ప్రతినిధులు ప్రత్యేకంగా ఇంటికెళ్లి ఆమెను అభినందించారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా ‘మహిళలందరికీ జయశ్రీ స్ఫూర్తిదాయకమని’ ప్రత్యేకంగా ప్రశంసించారు.