Photo: Twitter
అమెరికా నూతన అధ్యక్షుడిగా ఇటీవల జో బైడెన్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అగ్రరాజ్యపు తొలి ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక తన ప్రభుత్వంలో పలువురు భారతీయ అమెరికన్లకు పెద్దపీట వేసిన బైడెన్ మహిళలకు కూడా సముచిత స్థానం కల్పిస్తున్నారు. ప్రమాణస్వీకారానికి ముందే 13 మంది భారతీయ అమెరికన్ మహిళలకు తన పాలక వర్గంలో చోటు కల్పించిన ఆయన తాజాగా మరో ఇండో అమెరికన్ మహిళకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా ప్రతిష్ఠాత్మక అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా(నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్)కు ‘యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్’గా భవ్యాలాల్ను నియమించారు.
గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో ఎంతోమంది భారతీయులు ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారు. తాజాగా అమెరికాలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ, అంతరిక్ష పరిశోధనా కేంద్రమైన నాసాకు యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమితులయ్యారు భవ్యాలాల్. ఆమె ఇప్పటివరకు అధ్యక్ష అధికార బదలాయింపు వ్యవహారాలు నిర్వహించిన ‘బైడెన్ ప్రెసిడెన్షియల్ ట్రాన్సిషన్ ఏజెన్సీ రివ్యూ టీం’లో సభ్యురాలిగా ఉన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న భవ్యాలాల్ సేవలు తమకు ఎంతో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా నాసా ఒక ప్రకటన విడుదల చేసింది.
ఉన్నత చదువుల కోసం అమెరికాకు!
దిల్లీలో పుట్టి పెరిగిన భవ్య నర్సరీ నుంచి పదో తరగతి వరకు అక్కడే చదువుకుంది. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆమె అక్కడే స్థిరపడింది. ఈక్రమంలోనే భవ్యాలాల్ ‘మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ నుంచి న్యూక్లియర్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. టెక్నాలజీ అండ్ పాలసీ విభాగంలో కూడా మాస్టర్స్ పట్టాను అందుకున్న ఆమె ‘జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం’ నుంచి పబ్లిక్ పాలసీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో డాక్టరేట్ అందుకున్నారు. న్యూక్లియర్ ఇంజినీరింగ్ సొసైటీ, పబ్లిక్ పాలసీ సొసైటీ.. రెండింటిలోనూ ఆమెకు గౌరవ సభ్యత్వం ఉండడం విశేషం.
సీనియర్ మహిళా సైంటిస్టుగా!
శాస్త్ర, సాంకేతిక రంగ పరిశోధనల్లో ఎంతో అనుభవం సంపాదించిన ఆమె గతంలో పలు అమెరికా ప్రభుత్వ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇందులో భాగంగా 2005 నుంచి 2020 మధ్యకాలంలో వాషింగ్టన్‌లోని ప్రఖ్యాత ఎస్టీపీఐ (సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఇన్స్టిట్యూట్)లో సభ్యురాలిగా సేవలందించారు. నాసా సమన్వయంతో అమెరికాలో పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎస్టీపీఐ కూడా ఒకటి. అంతకుముందు మసాచ్యుసెట్స్‌లోని కేంబ్రిడ్జిలో ఉండే ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ స్టడీస్’ సంస్థ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక అంతరిక్ష పరిశోధనల్లోనూ అనుభవం సంపాదించిన ఆమె అమెరికా స్పేస్ టెక్నాలజీ స్ట్రాటజీ సలహాదారుగా కూడా వ్యవహరించారు. వీటితో పాటు అమెరికా స్పేస్ సెక్టార్ పరిశోధనలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటుచేసిన పలు కమిటీలకు సభ్యురాలిగా, అధ్యక్షురాలిగా కీలక బాధ్యతలు నెరవేర్చారు. అంతరిక్ష రంగంలో అందించిన విశిష్ఠ సేవలకు గానూ ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ గౌరవ సభ్యురాలిగా భవ్య ఎన్నికయ్యారు.
కాలమిస్టుగా!
ఇక తన అధ్యయన, పరిశోధనల సారాంశాన్ని విశదీకరిస్తూ ‘ది ఎకనమిస్ట్’, ‘నేషనల్ జియోగ్రాఫిక్’, ‘స్పేస్’ వంటి ప్రఖ్యాత పత్రికలకు వ్యాసాలు రాస్తుంటారీ సూపర్ వుమన్. ఇలా అంతరిక్ష రంగంలో అపార అనుభవం ఉన్నందు వల్లే భవ్యను యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించినట్లు నాసా తెలిపింది. ఈ బాధ్యతలతో పాటు నాసా ‘బడ్జెట్ అండ్ ఫైనాన్స్’ విభాగానికి సీనియర్ సలహాదారుగా కూడా వ్యవహరించనున్నారామె. ఈ సందర్భంగా నాసాలో కీలక పదవికి ఎంపికైన భవ్యపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు ప్రముఖులు, నెటిజన్లు ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు షేర్ చేస్తున్నారు.