‘పద్మ’ పురస్కారాలు... ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించే ఈ అవార్డులను దేశంలోనే అత్యున్నతమైన పురస్కారాలుగా పరిగణిస్తారు. వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తూ, కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచిన వారికి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఈక్రమంలో 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2021 సంవత్సరానికి గానూ పద్మ అవార్డుల జాబితాను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఏడుగురికి పద్మవిభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. అలా ఈ ఏడాది మొత్తం 119 మంది ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలకు ఎంపిక కాగా, అందులో 29 మంది మహిళలు ఉండడం విశేషం. మరి, ఆ మహిళామణులు, వారు అందించిన సేవల గురించి మనమూ తెలుసుకుందాం రండి..
కేఎస్ చిత్ర- కళలు
తేనెలొలికే తన గాత్రంతో సంగీతాభిమానుల్ని ఓలలాడించారు కృష్ణన్ నాయర్ శాంతాకుమారి చిత్ర. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, ఉర్దూ.. లాంటి భారతీయ భాషలతో పాటు లాటిన్, అరబిక్, ఇంగ్లిష్...లాంటి అంతర్జాతీయ భాషల్లోనూ పాటలు పాడిన ఘనత ఈ సంగీత సరస్వతి సొంతం. ఇప్పటిదాకా 20కి పైగా భాషల్లో 25 వేలకు పైగా పాటలు పాడిన చిత్ర.. ఆరు జాతీయ పురస్కారాలు, ఎనిమిది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, విభిన్న రాష్ట్రాల చలనచిత్ర పురస్కారాలతో పాటు భారత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ని కూడా అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రూపొందించిన ‘జీవితంలో ప్రతి ఒక్కరూ వినాల్సిన వెయ్యి పాటలు’ పట్టికలో చిత్ర పాట కూడా ఉండడం విశేషం. సంగీతాభిమానులతో ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’, ‘మెలోడీ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అని పిలిపించుకునే చిత్ర తాజాగా ‘పద్మభూషణ్’ పురస్కారానికి ఎంపికయ్యారు. ‘42 ఏళ్ల నా సంగీత ప్రస్థానానికి దక్కిన పురస్కారం ‘పద్మభూషణ్’. భగవంతుడికి, భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. దేశానికి, ప్రజలకు తలవంచి నమస్కరిస్తున్నాను. జైహింద్’ అంటూ ఈ సందర్భంగా ట్విట్టర్లో తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారీ లవ్లీ సింగర్.
సుమిత్రా మహాజన్- రాజకీయాలు
మీరాకుమార్ తర్వాత లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన రెండో మహిళ సుమిత్రా మహాజన్. మహారాష్ట్రలో జన్మించిన ఆమె ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టారు. ఇండోర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 8సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మృదు స్వభావంతో రాజకీయాల్లో నెగ్గుకురాలేమని చాలామంది అంటుంటారు. కానీ సుమిత్రను చూస్తే ఈ మాటలు వట్టి అపోహేనని అర్థమవుతుంది. మితభాషిణి అయినప్పటికీ తనకిచ్చిన బాధ్యతలను ఎంతో క్రమశిక్షణ, నిక్కచ్చితో నిర్వర్తించడం ఆమెను ఉన్నత స్థానానికి చేర్చాయి. ఇండోర్ ప్రజలు ఆమెను ‘తాయి’ (పెద్దక్క) అని పిలుస్తుంటారు. ఈక్రమంలో తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి గుర్తింపుగా తాజాగా ‘పద్మభూషణ్’ పురస్కారానికి ఎంపికయ్యారు సుమిత్రా మహాజన్.
శాంతి దేవి-సామాజిక సేవ
ఏడు దశాబ్దాలుగా సమాజ సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు సేవా సమాజ్ వ్యవస్థాపకురాలు శాంతి దేవి. ఒడిశాలోని బాలేశ్వర్‌లో పుట్టి పెరిగిన ఆమె.. చిన్నతనంలో కుష్ఠు రోగులకు సపర్యలు చేశారు. ఆ తర్వాత సామాజిక సేవా కార్యకర్త రతన్‌దాస్‌ను పెళ్లి చేసుకుని తన సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేశారు. ఈక్రమంలో అనాథ బాలికలకు విద్యను అందించాలనే తలంపుతో సేవా సమాజ్ ఆశ్రమాన్ని స్థాపించారు. ఏడుగురు విద్యార్థులతో మొదలైన ఈ సేవా సమాజ్‌లో ప్రస్తుతం 350 మంది అనాథ బాలికలు చదువుకుంటున్నారు. ఇక్కడ వారికి చదువుతో పాటు వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు. వారికి పెళ్లిళ్లు చేస్తారు. గతంలో ఆచార్య వినోభా బావేతో కలిసి భూదాన్ ఉద్యమంలో పాల్గొన్న శాంతి దేవి తాజాగా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.
దండమూడి సుమతి-కళలు
తన పట్టుదలకు తోడు నాన్న ఇచ్చిన ప్రోత్సాహంతో దేశంలోనే తొలి మృదంగ విద్వాంసురాలిగా పేరు తెచ్చుకున్నారు దండమూడి సుమతీ రామ్మోహన్రావు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన రాఘవయ్య, వెంకటరత్నమ్మ దంపతులకు ఆమె జన్మించారు. సుమతికి మొత్తం 14 మంది తోబుట్టువులు. తండ్రి గుర్తింపు పొందిన మృదంగ విద్వాంసుడు కావడంతో ఆమె కూడా దానిపై ఆసక్తి పెంచుకున్నారు. ఇది గమనించిన రాఘవయ్య తన కూతురుకు మృదంగ వాద్యంలో మెలకువలు నేర్పారు. తన 10వ ఏటనే తొలి మృదంగ ప్రదర్శన ఇచ్చిన సుమతి ఆ తర్వాత అందులోనే డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. ఆ తర్వాత దండమూడి రామ్మోహన్రావు దగ్గర శిష్యురాలిగా చేరారు. ఇద్దరూ కలిసి దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. తర్వాత ఆయననే వివాహం చేసుకున్నారు. ఇలా మగవాళ్లకే సొంతమనుకునే మృదంగం వాద్యంలో తనదైన ప్రతిభను చాటుతున్న సుమతి.. 2009లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. తాజాగా తన కళా సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది.
లఖిమీ బారువా-సామాజిక సేవ
మహిళా సాధికారతకు మారుపేరుగా నిలుస్తారు అసోంకు చెందిన లఖిమీ బారువా. 80వ దశకంలోనే పీజీ పూర్తి చేసిన ఆమె బ్యాంకు ఉద్యోగినిగా పనిచేశారు. అయితే ఓ మహిళగా సాటి మహిళలకు ఏదైనా చేయాలన్న తలంపుతో తనకున్న ఉద్యోగాన్ని వదిలేశారు. అనంతరం అసోంలోని జొర్హట్ పట్టణంలో 250 మంది మహిళా సభ్యులతో ఓ కో-ఆపరేటివ్ బ్యాంక్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఆ బ్యాంకులో ఖాతాదారుల సంఖ్య సుమారు 45వేలకు పైగానే! అందులోనూ అందరూ మహిళలే. ఈక్రమంలో విద్యార్థినులు, ఒంటరి మహిళలు, భర్తను కోల్పోయిన వితంతువులకు రుణాలిచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు లఖిమి. గతంలో రోడ్లపైనే జీవనం గడిపే ఎందరో మహిళలు ఆమె ఆపన్న హస్తం అందుకొని నేడు ఆర్థిక స్వాతంత్రంతో తలెత్తుకుని జీవిస్తున్నారు. ఇలా మహిళల అభివృద్ధికి చేయూతనిస్తోన్న లఖిమి.. 2016లో రాష్ర్టపతి చేతుల మీదుగా ‘నారీశక్తి పురస్కారం’ అందుకున్నారు. తన సేవలకు మరింత గుర్తింపునిస్తూ భారత ప్రభుత్వం ఆమెను తాజాగా ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపిక చేసింది.
రజనీ బెక్టార్-వ్యాపారం
‘మిసెస్ బెక్టార్-క్రీమికా’... దక్షిణాది వాసులకు పెద్దగా పరిచయం లేకపోయినా ఉత్తరాదిన మాత్రం ఈ బ్రాండ్ ప్రతి ఇంటికీ సుపరిచితమే! బిస్కట్లు, బన్నులు, ఐస్‌క్రీమ్స్ తయారీలో అగ్రగామిగా దూసుకుపోతోన్న ఈ సంస్థ ఈ మధ్య స్టాక్ మార్కెట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. కేవలం రూ.20 వేల పెట్టుబడితో ప్రారంభమైన ఈ సంస్థ.. నేడు వెయ్యి కోట్ల దాకా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుందంటే అందుకు కారణం ఆ సంస్థ వ్యవస్థాపకురాలు రజనీ బెక్టార్. తన వ్యాపార దక్షతే తాజాగా ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. లాహోర్‌లో పుట్టి పెరిగిన ఆమె దేశ విభజన తర్వాత కుటుంబంతో సహా దిల్లీలో స్థిరపడ్డారు. 17 ఏళ్లకే పెళ్లయినప్పటికీ భర్త ప్రోత్సాహంతో డిగ్రీ పూర్తి చేశారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. వారు కాస్త పెద్దయ్యాక సమయం దొరకడంతో సరదాగా వంటకాల తయారీలో శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత కుకీస్, ఐస్‌క్రీమ్‌లు తయారుచేసి తన కుటుంబ సభ్యులకు రుచి చూపించేవారు. అందరూ బాగున్నాయని ప్రశంసించడంతో 1978లో ఒవెన్, ఐస్‌క్రీం తయారీ యంత్రం కొనుగోలు చేసి ఆర్డర్లు తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మెక్‌డొనాల్డ్స్, క్యాడ్బరీ, ఐటీసీ, సన్‌ఫీస్ట్.. వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని బాగా విస్తరించారు. ఈక్రమంలో 2006నాటికే వందల కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన ఈ సంస్థ ప్రస్తుతం వేల కోట్ల టర్నోవర్‌ను అందుకుంటోంది.
చుత్నీ దేవి-సామాజిక సేవ
మూఢ నమ్మకాలు ఎలాంటి మారణ హోమానికి దారి తీస్తాయో ఇటీవల మదనపల్లెలో జరిగిన సంఘటనే ప్రత్యక్ష నిదర్శనం. ఇలాంటి అంధ విశ్వాసాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు ఝార్ఖండ్‌కు చెందిన 63 ఏళ్ల చుత్నీ దేవి. ఆ రాష్ర్టంలోని సరైకల్ జిల్లాలోని ఓ కుగ్రామానికి చెందిన ఆమె అక్కడి మంత్రగాళ్లు, దొంగ బాబాలకు సింహస్వప్నం. చిన్నప్పటి నుంచి చేతబడి, బాణామతి.. వంటి మూఢాచారాలను చూస్తూ పెరిగిన చుత్నీ దేవి కొంచెం పెద్దయ్యాక అందులోని మోసాన్ని గ్రహించారు. వాటిపై ప్రజల్లో చైతన్యం పెంచారు. అంతేకాదు తన గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అమాయక ప్రజలను మోసగిస్తూ పొట్టనింపుకొంటున్న వందలమంది మంత్రగాళ్లను పోలీసులకు పట్టించారు. ఈ క్రమంలోనే తన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారీ సూపర్ వుమన్.
సింధూ తాయి-సామాజిక సేవ
40 ఏళ్ల క్రితం తొమ్మిది నెలల నిండు గర్భంతో ఉన్న ఆమెను భర్త నిర్ధాక్షిణ్యంగా ఇంట్లోంచి గెంటేశాడు. దీంతో దిక్కూ మొక్కూ లేని ఓ అనాథలా పశువుల కొట్టంలో పురుడు పోసుకుందామె. తన బొడ్డుతాడుని తానే తెంచుకుని పసిబిడ్డతో పాటలు పాడుకుంటూ ఊరురా బిచ్చమెత్తుకుంది. అప్పుడు కేవలం ఒకే బిడ్డకు తల్లయిన ఆమె నేడు మరో వెయ్యి మంది అనాథలకు అమ్మలా మారింది. ఈ క్రమంలో వారిని పోషించడంతో పాటు వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. ఈక్రమంలో ఆమె సమాజానికి చేస్తున్న నిస్వార్థ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. వీరితో పాటు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన మహిళలు ఎవరంటే...!
* బిరుబాలా రభా (సామాజిక సేవ)-అసోం
* అనిత (క్రీడా రంగం)-తమిళనాడు
* భూరి బాయి (కళలు)- మధ్యప్రదేశ్
* సంఖుమి బువాల్చువాక్ (సామాజిక సేవ) - మిజోరాం
* బిజోయా చక్రవర్తి (రాజకీయాలు)- అసోం
* మౌమాదాస్ (క్రీడారంగం)- పశ్చిమ బంగ
* దులారి దేవి (కళలు) -బిహార్
* రాధే దేవి (కళలు)-మణిపూర్
* అన్షు జంప్సేనా (క్రీడా రంగం)- అరుణాచల్ ప్రదేశ్
* పూర్ణమాసి జాని (కళలు)-ఒడిశా
* ప్రకాశ్ కౌర్ (సామాజిక సేవ)- పంజాబ్
* సంజిదా ఖాతున్ (కళలు)-బంగ్లాదేశ్
* నిరూ కుమార్ (సామాజిక సేవ)-దిల్లీ
* లజ్వంతి (కళలు)-పంజాబ్
* పాపమ్మల్ (వ్యవసాయం)-తమిళనాడు
* జస్వంతిబెన్ జామ్నాదాస్ పోపట్ (వ్యాపార రంగం)- మహారాష్ర్ట
* బొంబాయి జయశ్రీ రామ్‌నాథ్ (కళలు)-తమిళనాడు
* సుధా హరినారాయణ్ సింగ్ (క్రీడారంగం)-ఉత్తరప్రదేశ్
* మృదులా సిన్హా (మరణానంతరం - సాహిత్యం, విద్య)- బిహార్
* ఉషా యాదవ్ (సాహిత్యం, విద్య)- ఉత్తరప్రదేశ్
* మాతా బి. మంజమ్మ జోగతి (కళలు) - కర్ణాటక