చిన్నప్పటి నుంచి ఏ బొమ్మ గీసినా అందులో మువ్వన్నెల జెండా ఉండేలా చూసుకోవడం ఆమెకు అలవాటు. త్రివర్ణ పతాకంపై తనకున్న ప్రేమే ఆమెకు బోలెడన్ని బహుమతులు తెచ్చిపెట్టింది. జాతీయజెండాపై తనకున్న మమకారమే జీవితంలో ఎన్ని కఠిన సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలనిచ్చింది. అదే తనను భారత వైమానిక దళంలో ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా చేరేలా చేసి దేశానికి సేవలందించే సువర్ణావకాశం తెచ్చిపెట్టింది. తద్వారా దేశమంతా తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఆమే ఫ్లైట్ లెఫ్టినెంట్ స్వాతి రాథోడ్. ఇక ఇప్పుడు మరోసారి ఆమె గురించి దేశ ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. కారణం...గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనే అద్భుత అవకాశం ఆమె తలుపు తట్టడమే! ఈ వేడుకల్లో భాగంగా ఫైటర్ జెట్ విమానాలతో కనుల విందుగా సాగే ‘ఫ్లైపాస్ట్’ కవాతుకు స్వాతి నాయకత్వం వహించనుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించనుందీ డేరింగ్ లేడీ.
‘ఫ్లైపాస్ట్’ కవాతుకు కెప్టెన్‌గా!
రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించింది స్వాతి. తండ్రి డాక్టర్ భవానీ సింగ్ రాథోడ్.. వ్యవసాయ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. తల్లి రాజేశ్ కన్వార్.. గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అజ్మీర్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన స్వాతి చిన్నప్పటి నుంచే జాతీయ జెండాపై అమితమైన ప్రేమను పెంచుకుంది. అందుకే ఎక్కడ చిత్రలేఖన పోటీలు జరిగినా జాతీయ జెండా వచ్చేలా బొమ్మలు వేయడం అలవాటు చేసుకుంది. గ్రాడ్యుయేషన్ అనంతరం పైలట్ కావాలని కలలు కన్న ఆమె.. 2013లో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ రాసింది. 2014 మార్చిలో డెహ్రాడూన్‌లోని ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు ఆమెను ఇంటర్వ్యూకు పిలిచింది. దేశం నలుమూలల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు ఈ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. వారిలో 98 మందిని స్ర్కీనింగ్‌కు ఎంపిక చేశారు. తుదకు ఐదుగురిని మాత్రమే ఫ్లైయింగ్ బ్యాచ్‌కు ఎంపిక చేశారు. అందులో ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన స్వాతి కూడా ఒకరు. ఆమె సోదరుడు కూడా నేవీలో పనిచేస్తుండడం విశేషం.
గతంలోనూ!
‘జాతీయ వైమానిక దళ దినోత్సవం’ సందర్భంగా గతేడాది అక్టోబర్ 8న నిర్వహించిన ‘ఫ్లైపాస్ట్’కు కూడా స్వాతినే నాయకత్వం వహించింది. అంతకుముందు 2018లో కేరళలో వరదలు సంభవించినప్పుడు ఐఏఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్‌లో ఈమె కూడా సమర్థంగా విధులు నిర్వర్తించింది. ప్రస్తుతం రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా ఆకాశంలో ఫైటర్ జెట్ విమానాలతో జరిగే ‘ఫ్లైపాస్ట్’ పరేడ్‌కు సారథ్యం వహించే సువర్ణావకాశం దక్కించుకుంది స్వాతి.
వారి కన్నీళ్లు నా ఆనందాన్ని రెట్టింపు చేశాయి!
‘స్కూల్లో చిత్రలేఖన పోటీలు జరిగినప్పుడల్లా ఏదో ఒక విధంగా మువ్వన్నెల జెండా వచ్చేలా బొమ్మలు వేయడం నాకు అలవాటు. అలా వేసిన ప్రతిసారీ నేను విజేతగా నిలిచాను. నా తల్లిదండ్రులు నన్ను బాగా అర్థం చేసుకున్నారు. అందుకే కఠినమైన సవాళ్లతో కూడిన ఎయిర్‌ఫోర్స్‌లో అడుగుపెడతానంటే కాదనలేదు. పైగా ఆ దిశగా నన్నెంతో ప్రోత్సహించారు. తద్వారా 2013లో ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డుకు ఎంపికై ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా విధుల్లో చేరాను. పలు రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్నాను. అయితే ఇవన్నీ ఒకెత్తు. దిల్లోలోని రాజ్‌పథ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరగబోయే రిపబ్లిక్ డే కవాతుకు సారథ్యం వహించే అవకాశం రావడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. ఈ సందర్భంగా అమ్మానాన్నల కళ్లల్లో కనిపించిన ఆనందభాష్పాలు నా సంతోషాన్ని రెట్టింపు చేశాయి..’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ డేరింగ్ లేడీ.
‘నువ్వు మా గడ్డపై పుట్టిన వీర పుత్రికవి’!
రిపబ్లిక్ డే కవాతులో ‘ఫ్లైపాస్ట్’కు నాయకత్వం వహించనున్న స్వాతిపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సోషల్ మీడియా వేదికగా ‘నువ్వు మా గడ్డపై పుట్టిన వీర పుత్రికవి. ఫ్లైపాస్ట్‌కు నాయకత్వం వహిస్తున్న నిన్ను చూస్తుంటే మాకెంతో గర్వంగా ఉంది. భవిష్యత్‌లో నువ్వు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..’ అంటూ ఆమెకు అభినందనలు తెలిపారు.
సుఖోయ్-30 విమానంతో సిద్ధంగా!
ఇక భారతదేశపు తొలి యుద్ధ విమాన పైలట్‌గా గుర్తింపు పొందిన భావనా కాంత్ ఈ రిపబ్లిక్ పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో సుఖోయ్-30 యుద్ధ విమానంతో విన్యాసాలు చేసేందుకు సిద్ధమవుతోందీ డ్యాషింగ్ పైలట్. ఇలా ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న తొలి మహిళా యుద్ధ విమాన పైలట్‌గా చరిత్రకెక్కనుందామె. బిహార్‌కు చెందిన భావన 2014లో ఎలక్ర్టానిక్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఈక్రమంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఐటీ ఉద్యోగాన్ని వదులుకొని మరీ యుద్ధ విమాన పైలట్‌గా చేరి తన కలను సాకారం చేసుకుంది. 2018 మార్చిలో కొన్ని గంటల పాటు మిగ్-21 బైసన్ ఎయిర్‌క్రాఫ్ట్ నడిపి పలువురి ప్రశంసలు అందుకున్న ఆమె.. ఈసారి జరగబోయే రిపబ్లిక్ పరేడ్‌లో సుఖోయ్-30 యుద్ధ విమానంతో విన్యాసాలు చేయనుంది. ‘చిన్నప్పటి నుంచి గణతంత్ర వేడుకలు, పరేడ్‌ను టీవీలో చూడడం తప్ప నేరుగా చూసింది లేదు. అలాంటిది ఇప్పుడు ఈ వేడుకల్లో భాగమవడం నిజంగా నా అదృష్టం. ఇది నాకెంతో గర్వకారణం’ అంటూ మురిసిపోతోంది భావన.
ప్రధాన మంత్రి పక్కన కూర్చొని !!
కరోనా ఆంక్షల నేపథ్యంలో అతి తక్కువ మంది సందర్శకుల సమక్షంలో ఈసారి గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. అయితే ఈ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ పక్కన కూర్చొని రిపబ్లిక్ డే పరేడ్‌ను వీక్షించేందుకు 100 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర విద్యాశాఖ అవకాశం కల్పించింది. అలా పీఎం బాక్స్ నుంచి వేడుకలను వీక్షించే అవకాశం దక్కించుకున్న వారిలో 18 ఏళ్ల దివ్యాంగీ త్రిపాఠి కూడా ఒకరు. ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన ఆమె సీబీఎస్ఈ-2020 12 వ తరగతి పరీక్షల్లో 99.6 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. తద్వారా బయాలజీ విభాగానికి సంబంధించి జాతీయ స్థాయిలో రెండో ర్యాంకును సొంతం చేసుకుంది. దివ్యాంగి తండ్రి ఉమేశ్‌నాథ్ కెమిస్ర్టీ ప్రొఫెసర్. తల్లి ఉష గృహిణి.
నా కల నిజమైంది!
‘ప్రస్తుత రాజకీయ నేతల్లో ప్రధాని నరేంద్రమోదీ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయనను ఒక్కసారైనా కలుసుకోవాలనేది నా చిరకాల కోరిక. నాకల ఇప్పుడు నిజం కాబోతుంది. ఆయన పక్కన కూర్చొని రిపబ్లిక్ డే వేడుకలను వీక్షించే అద్భుతమైన అవకాశం వచ్చింది. ఈ ఆహ్వానం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ప్రస్తుతం నేను నీట్‌కు ప్రిపేర్ అవుతున్నాను. డాక్టర్‌గా దేశానికి సేవలందించాలనుకుంటున్నాను!’ అని అంటోంది దివ్యాంగి.
శ్యానిటరీ ప్యాడ్లపై పన్ను ఎత్తివేయాలని కోరతాను!
ఇలాంటి అవకాశమే దక్కించుకున్న మరో విద్యార్థిని గుర్వీన్ కౌర్. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన ఆమె.. సీబీఎస్ఈ-2020 పరీక్షా ఫలితాల్లో జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. గుర్వీన్ తండ్రి గురిందర్ పాల్ అడ్వొకేట్‌గా పనిచేస్తున్నారు. తల్లి బల్వీందర్ కౌర్ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ‘ఈ ఆహ్వానం అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వేడుకల్లో భాగంగా మోదీతో మాట్లాడే అవకాశం వస్తే శ్యానిటర్ న్యాప్కిన్స్పై ఉన్న ట్యాక్స్‌ను ఎత్తివేయాలని కోరతాను’ అని చెప్పుకొచ్చింది గుర్విన్.