Photos: Instagram
ఎవరైనా వయసు పైబడిన మహిళలు చీరలో కాకుండా కాస్త మోడ్రన్‌గా తయారై, మేకప్ వేసుకొని కనిపిస్తే.. ‘ఈ వయసులో ఈవిడకు ఇవన్నీ అవసరమా.. ఇంట్లో కృష్ణా, రామా అంటూ కూర్చోక!’ అనుకునే వారు చాలామందే! అలాంటిది ఏకంగా ఏడు పదుల వయసులో పూర్తి స్థాయి మోడ్రన్‌గా రడీ అయి ఫొటోషూట్ తీయించుకోవడమంటే అదో సాహసమే అని చెప్పాలి. అలాంటి సాహసమే చేశారు మలయాళ నటి రజనీ చాందీ. ఆరు పదుల వయసులో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఏడు పదుల వయసులో మోడ్రన్ ఫొటోషూట్‌లో మెరిసి మహిళలు తమ అభిరుచుల్ని నెరవేర్చుకోవడానికి వయసు అడ్డు కానే కాదని నిరూపించారు. ఎవరేమనుకున్నా, ఎలా కామెంట్ చేసినా నాకు నచ్చినట్లు నేనుంటానంటోన్న రజనీ.. వయసు మీరిన మహిళల్లో స్ఫూర్తి నింపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానంటున్నారు.
30 ఏళ్లొచ్చేదాకా చదువు, ఉద్యోగాలతోనే సరిపోతుంది.. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతల బిజీలో పడిపోయి కనీసం మనకంటూ కాస్త సమయం కేటాయించుకోవడానికి కూడా సమయం దొరకదు. ఇక పిల్లల బాధ్యత తీరే సరికి 60 ఏళ్లు నిండుతాయి. ఇక అప్పుడు మన అభిరుచుల్ని తీర్చుకుందామన్నా శరీరం సహకరించదు.. ఒకవేళ ధైర్యంగా అడుగు ముందుకేసినా నలుగురూ ఏమనుకుంటారోనన్న భయంతో వెనకడుగు వేస్తుంటారు చాలామంది. అయినా అభిరుచుల్ని నెరవేర్చుకోవడానికి, వయసుకు సంబంధమేముంది అంటున్నారు మలయాళ నటి రజనీ చాందీ. ఈ సందేశాన్ని చాటడానికే 69 ఏళ్ల వయసులో మోడ్రన్ దుస్తులు ధరించి ఫొటోషూట్ తీయించుకున్నానంటున్నారు. ఇలా నెట్టింట్లో వైరలైన తన ఫొటోషూట్‌ను చూసి కొంతమంది ప్రశంసించగా.. అంతకు రెట్టింపు మంది నెగెటివ్‌గా స్పందించారు. అయినా ఎవరెలా స్పందించినా తాను చేసిన ఈ పని చూసి నలుగురు మహిళలు స్ఫూర్తి పొందితే చాలంటున్నారామె.
కంప్లీట్ మోడ్రన్ లుక్‌లో!
తన 65 ఏళ్ల వయసులో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు రజని. ఈ క్రమంలో ‘ఒరు ముత్తాస్సీ గాథ’ అనే మలయాళ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మలయాళ బిగ్‌బాస్‌లోనూ పాల్గొన్నారామె. తన నటనతో తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించిన రజని.. ఈమధ్యే అథిరా జాయ్ అనే యంగ్ ఫొటోగ్రాఫర్ నిర్వహించిన మోడ్రన్ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో జీన్స్, షార్ట్ డెనిమ్ డ్రస్, లాంగ్ డ్రస్, జంప్‌సూట్.. వంటి మోడ్రన్ దుస్తులు ధరించి ఈ తరం అమ్మాయిలతో పోటీ పడుతూ మరీ కనిపించారామె. ఇలా మోడ్రన్ దుస్తుల్లో తాను తీయించుకున్న ఫొటోషూట్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. అవి చూసి పలువురు ప్రశంసిస్తే.. మరికొంతమంది ‘ఈ వయసులో మీకు ఇలాంటి దుస్తులు అవసరమా?’ అంటూ విమర్శించారు. అయితే ఇలాంటి విమర్శల్ని తనదైన రీతిలో తిప్పికొట్టడమే కాదు.. ఆడవారు ఏ వయసులోనైనా తమ అభిరుచుల్ని నెరవేర్చుకోవడానికి వెనకాడకూడదనే చక్కటి సందేశాన్ని చాటడానికే ఈ సాహసం చేశానంటున్నారామె.
ఇతరుల్ని ఇబ్బంది పెట్టకపోతే చాలు!
‘నేను కేరళలోని కొచ్చిలో పుట్టాను. వివాహం తర్వాత మా వారి ఉద్యోగరీత్యా దుబాయ్‌లో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇండియాకు తిరిగొచ్చా. బాధ్యతలన్నీ పూర్తయ్యే సరికి ఆరు పదులు దాటాయి. మోడల్ కావాలనేది నా చిన్ననాటి కల. కానీ అందుకు నాకు సమయమే దొరకలేదు. ఇలాగే చాలామంది పెళ్లి తర్వాత పిల్లల ఆలనా పాలనలో పడిపోయి తమ ఇష్టాయిష్టాల్ని మర్చిపోతుంటారు. వాటిపై దృష్టి సారించాలనుకునే సరికి వయసు మీరిపోతుంది. ఇక అప్పుడు సమాజాన్ని చూసి వెనక్కి తగ్గుతుంటారు. కానీ మహిళలు తమ అభిరుచుల్ని ఏ వయసులోనైనా నెరవేర్చుకోవచ్చన్నది నా భావన. అయితే మనం చేసే పని ఇతరుల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు! ప్రస్తుతం నేను కూడా అదే చేస్తున్నాను. నా మనసుకు ఏది సంతోషంగా అనిపిస్తే దానికే ఓటేస్తున్నా. ఫొటోషూట్ కూడా అలా చేసిందే!
అందుకే ఈ ఫొటోషూట్!
దీని గురించి అథిరా నన్ను కలిసినప్పుడు నేను మా వారిని, కుటుంబాన్ని సంప్రదించాను. వారి అంగీకారం మేరకే ఈ షూట్ చేశాం. అయితే ఈ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాక.. చాలామంది వీటిని పట్టించుకోరేమో అనుకున్నా.. కానీ వీటికి ఊహించని స్పందన వచ్చింది. నిజానికి వయసు మీరినా మహిళలు తమ అభిరుచుల్ని నెరవేర్చుకుంటూ జీవితాన్ని ఆస్వాదించచ్చు అని చాటడమే ఈ ఫొటోషూట్ ముఖ్యోద్దేశం. నాలానే తోటి మహిళలూ లేటు వయసులోనైనా తమ జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నా.. నా ఆలోచన నచ్చితే స్వీకరించండి లేదంటే పట్టించుకోకండి.
నా హెల్త్ సీక్రెట్ అదేనేమో!
ఇక నేను ఎంత బిజీగా ఉన్నా నాకోసమంటూ కాస్త సమయం కేటాయించుకునేదాన్ని. రోజువారీ అలవాట్లను అస్సలు మిస్ కాకపోయేదాన్ని. ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేవడం, ఆపై నడక, సంగీతం, ఆటలు, డ్రమ్స్ వాయించడం.. తదితర అంశాలపై దృష్టి సారించేదాన్ని. గార్డెనింగ్ అంటే నాకు ఆసక్తి. ఈ క్రమంలో మా కుటుంబ అవసరాలకు సరిపడా కాయగూరల్ని నేనే పండిచుకునేదాన్ని. రోజుకు మూడుసార్లు ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం నాకు అలవాటు. ఇవే ఈ వయసులోనూ నేను ఇంత ఉత్సాహంగా ఉండడానికి కారణం..’ అంటూ తన ఫొటోషూట్ విశేషాలు పంచుకున్నారామె.
ఏదేమైనా ఆడవారు తమ అభిరుచుల్ని నెరవేర్చుకోవడానికి, జీవితాన్ని ఆస్వాదించడానికి వయసుతో పనే లేదనే చక్కటి సందేశాన్ని చాటుతూ రజని చేసిన ఈ ఫొటోషూట్ మహిళలందరికీ స్ఫూర్తిదాయకం అని చెప్పడంలో సందేహం లేదు.