Photos: Instagram, Twitter
అర్ధాంగి అంటే భర్త జీవితంలో అర్ధ భాగం కావడమే కాదు.. వారి ప్రతి అడుగులోనూ తోడుండాలంటారు. ఈ మాటలు అమెరికా మొదటి మహిళ జిల్ బైడెన్‌కు అచ్చు గుద్దినట్లు సరిపోతాయి. జోతో ఏడడుగులు నడిచిన క్షణం నుంచి ఆయన మొదటి భార్య పిల్లలకు తల్లయ్యారు జిల్.. ఆపై అటు తన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే.. ఇటు అమెరికా రెండో మహిళగా తన బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భర్తకు ప్రతి అడుగులోనూ తోడుంటూ జీవిత భాగస్వామికి అసలు సిసలైన అర్థం చెప్పారామె. ఎన్నికల్లో భర్త విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ‘ఆయన మనందరి కుటుంబాలకు కాబోయే అధ్యక్షులు’ అంటూ ట్వీట్ చేసిన జిల్.. జో ప్రేమ ప్రతిపాదనను ఆరోసారి అంగీకరించారన్న విషయం మనలో చాలామందికి తెలియదు. అంతేనా.. ఇటు కుటుంబాన్ని, అటు వృత్తినీ బ్యాలన్స్ చేసుకుంటూనే.. మరోవైపు ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో సైతం భాగమయ్యారామె. మరి, అమెరికా మొదటి మహిళగా శ్వేత సౌధంలోకి అడుగుపెట్టే సందర్భంలో ఈ పవర్ఫుల్ లేడీ గురించి, జో-జిల్ అందమైన ప్రేమకథ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..
సాధారణంగా భర్త ఉన్నత పదవిలో ఉన్నప్పుడు భార్య కూడా ఆ హోదాను అందుకుంటూ నలుగురి దృష్టిలో పడాలనుకుంటుంది. కానీ జో బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా కొనసాగినంత కాలం తెరవెనుకే ఉంటూ భర్తకు వెన్నుదన్నుగా నిలిచారు జిల్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నట్లుగా ఇటు దేశ రెండో మహిళగా కొనసాగుతూనే.. అటు తన సింప్లిసిటీని చాటుకున్నారామె. ఇక మరోవైపు తనకెంతో ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తిని కూడా కొనసాగించారామె. అంతేనా.. ఈ క్రమంలోనే రొమ్ముక్యాన్సర్‌పై అవగాహన పెంచుతూ, దాని నివారణ కోసం ఎంతగానో కృషి చేశారీ గ్రేట్ టీచర్.
ఇంగ్లిష్ అంటే పడి చచ్చిపోయేదాన్ని!
1951లో న్యూజెర్సీలో జన్మించిన జిల్ బైడెన్ పూర్తి పేరు జిల్ ట్రాసీ జాకబ్స్ బైడెన్. ఆమె తండ్రి డొనాల్డ్ కార్ల్ జాకబ్స్.. బ్యాంక్ టెల్లర్గా, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూఎస్ నేవీ సిగ్నల్ మ్యాన్‌గా సేవలందించారు. తల్లి బోన్నీ జీన్.. గృహిణి. జిల్ చిన్నతనమంతా పెన్సిల్వేనియాలోనే సాగింది. తన తల్లిదండ్రులకు పుట్టిన ఐదుగురు అమ్మాయిల్లో జిల్ పెద్దవారు. చదువుకునే రోజుల్లో ఇంగ్లిష్ క్లాసంటే పడి చచ్చిపోయేదాన్నని చాలా సందర్భాల్లో గుర్తు చేసుకున్న జిల్.. అదే సబ్జెక్టులో డెలావర్ యూనివర్సిటీ నుంచి బీఏ పూర్తి చేశారు. ఆపై వెస్ట్ చెస్టర్ యూనివర్సిటీ నుంచి ఎం.ఎడ్, విలానోవా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా అందుకున్నారు. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే కాస్త విరామం తీసుకొని విల్మింగ్టన్లోని ఓ స్థానిక సంస్థలో మోడలింగ్ కూడా చేశారు జిల్. అయితే చిన్నతనం నుంచి ఉపాధ్యాయ వృత్తిని ఇష్టపడే ఆమె.. అంతిమంగా తన కెరీర్‌ను అటువైపుగా మళ్లించారు. ఈ క్రమంలోనే విల్మింగ్టన్ పబ్లిక్ స్కూల్స్‌లో సబ్‌స్టిట్యూట్ టీచర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఆపై అక్కడి సెయింట్ మార్క్స్ హైస్కూల్లో పూర్తిస్థాయి టీచర్‌గా సేవలందించారు. అది కూడా ఆమెకు ఎంతో ఇష్టమైన ఇంగ్లిష్ సబ్జెక్టులోనే!
లవ్ - బ్రేకప్ - లవ్!
తాను చదువుకునే రోజుల్లోనే తన కాలేజీలో చదివే ఫుట్‌బాల్ క్రీడాకారుడు బిల్ స్టివెన్సన్ను 1970లో ప్రేమ వివాహం చేసుకున్నారు జిల్. ఎప్పుడైతే జిల్ విల్మింగ్టన్లోని ఓ స్థానిక సంస్థకు మోడలింగ్ చేయడం మొదలుపెట్టారో అప్పుడు వీరిద్దరి మధ్య స్నేహం, ప్రేమ క్రమంగా తగ్గసాగాయి. దీంతో కలిసి ఉండలేమంటూ 1975లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆపై జో సోదరుడు ఫ్రాంక్ ద్వారా జో-జిల్లకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరికి మధ్య వయసులో 9 ఏళ్ల వ్యత్యాసం ఉంది. అంటే.. జో కంటే జిల్ 9 ఏళ్లు చిన్నవారు. అప్పటికే జో సెనేటర్‌గా కొనసాగుతున్నారు కూడా! ఈ క్రమంలోనే ఫ్రాంక్ ఏర్పాటుచేసిన బ్లైండ్ డేట్లో జోను కలిసిన జిల్.. ఆయన ఆహార్యానికి ఫిదా అయిపోయారట! ఆ వెంటనే ఇంటికెళ్లి అమ్మతో ‘నాకు తగ్గ జెంటిల్మన్ దొరికాడమ్మా!’ అని చెబుతూ తెగ సంతోషపడిపోయారట జిల్. అయితే జో చేసిన ప్రేమ ప్రతిపాదనను ఆరోసారికి గానీ అంగీకరించలేదంటారు జిల్. ఇలా తమ ప్రేమ బంధాన్ని 1977లో పెళ్లి పీటలెక్కించారు జో-జిల్.. వీరి అన్యోన్యతకు గుర్తుగా ఆష్లే అనే కూతురు పుట్టింది.
సవతి పిల్లలకు అమ్మ ప్రేమను పంచింది!
అయితే జిల్‌తో ప్రేమ, పెళ్లికి ముందే జో బైడెన్‌కు నైలియా హంటర్‌తో వివాహమైంది. వీరిద్దరికి జోసెఫ్ బైడెన్ 3, రాబర్ట్ హంటర్ బైడెన్, నవోమీ క్రిష్టియానా హంటర్.. అనే ముగ్గురు పిల్లలు పుట్టారు. కూతురు నవోమీ ఏడాది వయసున్నప్పుడు జరిగిన కారు ప్రమాదంలో నవోమీతో పాటు నైలియా కూడా చనిపోయారు. అయితే జో ప్రేమ ప్రతిపాదనను అంగీకరించే క్రమంలో ‘జోసెఫ్, రాబర్ట్‌లకు (జో మొదటి భార్య పిల్లలకు) మరోసారి అమ్మను దూరం కానివ్వను..’ అని ప్రమాణం చేసి అమ్మ మనసును చాటుకున్నారు జిల్. ఈ క్రమంలో తన కూతురు ఆష్లేతో సమానంగా జో మొదటి భార్య పిల్లలకు కూడా అమ్మ ప్రేమను పంచారు జిల్. అయితే జోసెఫ్ బైడెన్ బ్రెయిన్ క్యాన్సర్ కారణంగా 2015లో మరణించారు.
అది నేనేంటో ప్రపంచానికి చూపింది!
టీచింగ్ రంగమంటే ప్రాణమిచ్చే జిల్.. 1970 నుంచి అదే వృత్తిలో కొనసాగుతున్నారు. ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసిన ఆమె.. ప్రస్తుతం నార్తర్న్ వర్జీనియా కమ్యూనిటీ కాలేజీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. జో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన రెండు పర్యాయాల్లో రెండో మహిళగా హోదాను అందుకుంటూ ఓవైపు అధికారిక బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు తన వృత్తినీ కొనసాగించారామె. ఉపాధ్యాయ వృత్తి అంటే ప్రాణం పెట్టే జిల్.. ‘టీచింగ్ నన్ను నన్నుగానే కాదు.. నాలోని ఓ ప్రత్యేకమైన కోణాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసింది’ అంటారామె.
ఇక అమెరికా రెండో మహిళగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న కాలంలోనే పలు సామాజిక కార్యక్రమాల్లోనూ భాగమయ్యారు జిల్. ఈ క్రమంలో బాలికలకు రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన తీసుకొచ్చేందుకు పలు కార్యక్రమాలు సైతం నిర్వహించారామె. అంతేకాదు.. అప్పటి మొదటి మహిళ మిషెల్ ఒబామాతో కలిసి ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జిల్. ఇందులో భాగంగా సైనిక కుటుంబాలకు అండగా ఉంటూనే వారి పిల్లలకు చదువు, ఉద్యోగం వంటి విషయాల దిశగా కృషి చేశారు.
రచయిత్రిగానూ..!
ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తన భర్త వెన్నంటే ఉండి అనునిత్యం ఆయనకు అండగా నిలబడ్డారు జిల్. ప్రచారంలో భాగంగా ఓసారి బైడెన్ పైకి నిరసనకారులు దూసుకొచ్చిన సమయంలోనూ తన భర్తకు రక్షణగా నిలబడి ప్రేమను చాటుకున్నారు. అలా మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించారు జిల్. బహుముఖ ప్రజ్ఞ కలిగిన ఈ అమెరికన్ ఫస్ట్ లేడీలో ఓ గొప్ప రచయిత్రి కూడా దాగుంది. 2012లో ‘డోంట్ ఫర్గెట్, గాడ్ బ్లెస్ అవర్ ట్రూప్స్’ అనే పుస్తకాన్ని ప్రచురించారు జిల్. ఒక మిలిటరీ కుటుంబానికి చెందిన తన మనవరాలి అనుభవాలను రంగరించి ఇలా పుస్తకంగా విడుదల చేశారీ గ్రేట్ ఉమన్.
|
వ్యాయామం మానను!
మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచే ముఖ్యోద్దేశంతో ‘బైడెన్ బ్రెస్ట్ హెల్త్ ఇనీషియేటివ్’ అనే సంస్థను స్థాపించిన జో.. తానెంత బిజీగా ఉన్నా ఆరోగ్యం విషయంలో అస్సలు అశ్రద్ధ చేయనంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ‘నేనెంత బిజీగా ఉన్నా నాకంటూ కాస్త సమయం కేటాయించుకుంటా. ఇందుకోసం ముందుగానే ప్రణాళిక తయారుచేసి పెట్టుకుంటా. ఇక రోజూ వ్యాయామం చేయడం మాత్రం మానను. ఉదయం 6.30 గంటలకు లేదా సాయంత్రం 6.30 గంటలకు ఇలా ఏదో ఒక సమయంలో కచ్చితంగా వ్యాయామం చేస్తాను. ఈ క్రమంలో పరుగు, బరువులెత్తడం, బ్యారే (Barre) వ్యాయామాలకు ప్రాధాన్యమిస్తా. ఎక్సర్సైజ్ మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. మన జీవితాన్ని కూడా బ్యాలన్స్ చేస్తుందని నమ్ముతా. అందుకే మీరు కూడా మీకు సౌకర్యవంతంగా ఉండే వర్కవుట్స్‌ని రోజూ చేయండి..’ అంటూ తన మాటల చాతుర్యంతో తోటి మహిళల్ని ఆరోగ్యం దిశగా అడుగులేయిస్తున్నారు జో. 69 ఏళ్ల వయసులోనూ జో ఇంత ఉత్సాహంగా, చురుగ్గా ఉన్నారంటే అది తన ఆరోగ్యకరమైన జీవన విధానం వల్లేనేమో అనడంలో సందేహం లేదు.
|
పెట్ లవర్!
తమ తమ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా పెంపుడు జంతువులంటే ప్రాణం పెట్టే జో-జిల్ తమ పెంపుడు శునకాలు ఛాంప్, మేజర్లతో దిగిన ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయం సాధించిన తర్వాత వారికి సంబంధించిన వార్తలే కాదు.. వారి పెంపుడు శునకాలకు సంబంధించిన ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలయ్యాయి. ఇదిలా ఉంటే అధ్యక్షుల పెట్స్ శ్వేత సౌధంలో రాజభోగాలు అనుభవించడం అమెరికాలో సాధారణమే! కానీ ట్రంప్‌కు ఎలాంటి పెంపుడు కుక్కలు లేకపోవడంతో.. మళ్లీ నాలుగేళ్ల తర్వాత వైట్‌హౌస్‌లో ఛాంప్, మేజర్ సందడి చేయనున్నాయి.
|
ఓ భార్యగా, ఇల్లాలిగా, తల్లిగా.. విభిన్న కోణాల్లో తనలోని పరిపూర్ణ మహిళను ఈ ప్రపంచానికి పరిచయం చేస్తూనే.. ఓ సామాజిక కార్యకర్తగా, ఓ నాయకురాలిగా తనదైన ముద్ర వేశారు జిల్. అంతేనా.. ఇటు ఇంటినీ, మరోవైపు తనకు ప్రాణప్రదమైన వృత్తినీ సమన్వయం చేస్తూ మహిళలందరికీ వర్క్-లైఫ్ బ్యాలన్స్ పాఠాలు నేర్పుతున్నారీ ఫస్ట్ లేడీ. మరి, ప్రథమ మహిళ హోదాలో శ్వేత సౌధంలోకి అడుగుపెడుతున్న జిల్ బైడెన్‌కు మనమూ హృదయపూర్వక అభినందనలు చెప్పేద్దాం..!