Photo: Twitter
భారతగడ్డపై పుట్టి పెరిగి, విదేశాల్లో స్థిరపడి, అక్కడ వివిధ రంగాల్లో సత్తా చాటుతోన్న మహిళలు ఎందరో ఉన్నారు. ప్రవాస భారతీయులుగా శాస్ర్త, సాంకేతిక రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటూ ఉన్నత అవకాశాలను అందుకుంటున్నారు. అదేవిధంగా వివిధ దేశాల రాజకీయాల్లోనూ స్పష్టమైన ముద్ర వేసి అక్కడ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. ఇక ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అమెరికా రాజకీయాల్లో భారతీయులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి అగ్రరాజ్యంలో మరో భారతీయ సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. ఈ క్రమంలో అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా భారతీయ అమెరికన్ న్యాయవాది వనితా గుప్తా నామినేట్ అయ్యారు. వనిత నియామకాన్ని సెనేట్ ఆమోదిస్తే... అమెరికా చరిత్రలో ఈ ప్రతిష్ఠాత్మక స్థానాన్ని అధిరోహించిన తొలి శ్వేత జాతీయేతర మహిళగా అరుదైన చరిత్ర సృష్టించనుంది వనిత.
తొలి శ్వేత జాతీయేతర మహిళగా!
అమెరికాకు 46వ అధ్యక్షుడిగా జనవరి 20న జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అగ్రరాజ్యం చరిత్రలోనే తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరితో పాటు పలువురు భారతీయ సంతతి వ్యక్తులకు బైడెన్ బృందంలో కీలక పదవులు లభించిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్ పదవికి 45 ఏళ్ల వనితాగుప్తాను నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు బైడెన్. ఆమె నియామకాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉన్నా అది కేవలం లాంఛనప్రాయమే. ఈ క్రమంలో అమెరికా న్యాయవ్యవస్థ చరిత్రలో ఈ పదవిని అధిరోహించిన తొలి శ్వేత జాతీయేతర మహిళగా గుర్తింపు పొందనుందీ ఇండియన్ అమెరికన్. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.
అలా వెలుగులోకి!
వనిత తల్లిదండ్రులది ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్. తండ్రి పేరు రాజీవ్ గుప్తా. తల్లి కమలాగుప్తా. వ్యాపారవేత్తగా స్థిరపడిన రాజీవ్ అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఎంబీఏ పూర్తి చేయడంతో వారి కుటుంబమంతా అక్కడే స్థిరపడింది. 1974లో ఫిలడెల్ఫియాలో పుట్టిన వనిత యేల్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పుచ్చుకుంది. న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టర్ డిగ్రీ అందుకుంది. ఆ తర్వాత న్యూయార్క్ కేంద్రంగా ఉన్న NAACP లీగల్ డిఫెన్స్ ఫండ్‌లో లాయర్‌గా కెరీర్ ఆరంభించింది వనిత. అక్కడ పని చేస్తున్న సమయంలోనే మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఓ కేసులో అకారణంగా శిక్ష అనుభవిస్తున్న 38 మందిని విడిపించి తొలిసారిగా వెలుగులోకి వచ్చిందామె. అందులో ఎక్కువగా ఆఫ్రికన్-అమెరికన్లే ఉండడం గమనార్హం. వారిని విడిపించడమే కాదు 6 మిలియన్ల భారీ మొత్తాన్ని పరిహారం కింద అందించి వారి పౌర హక్కులను కాపాడిందీ ట్యాలెంటెడ్ వుమన్.
బాధితుల పక్షాన పోరాడుతూ!
ఆరేళ్ల పాటు NAACP లీగల్ డిఫెన్స్ ఫండ్‌లో పని చేసిన వనిత 2007లో అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్‌లో స్టాఫ్ అటార్నీగా నియమితురాలైంది. ఇది అమెరికాలోని అతి పెద్ద మానవ హక్కుల సంస్థ కావడం విశేషం. ఇక్కడ పని చేస్తున్న సమయంలోనే పౌర హక్కులకు విఘాతం కలిగించేలా ఉన్న అమెరికన్ వలస చట్టాల్లో మార్పులు తెచ్చేందుకు విశేష కృషి చేసింది. ఆ తర్వాత బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో న్యాయశాఖలోని పౌర హక్కుల విభాగానికి నాయకత్వం వహించింది. ఇదే సమయంలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ క్రమంలోనే విద్య, ఉపాధి రంగాల్లో వివక్ష, హ్యూమన్ ట్రాఫికింగ్, LGBTQ వ్యక్తుల హక్కులు, వలసదారులకు సంబంధించిన కేసుల్లో బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం దక్కేలా చేసింది.
భర్త సహకారంతో!
ఇలా సుమారు 17 ఏళ్లుగా వనిత వాదిస్తున్న కేసులు, విజయాలలో ఆమె భర్త చిన్ క్యు లి సహకారం కూడా ఉందని చెప్పవచ్చు. 2003లో పెళ్లిపీటలక్కిన ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. వనిత భర్త కూడా న్యాయరంగంలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన కొలంబియా డిస్ట్ర్టిక్ట్ ‘లీగల్ ఎయిడ్’ సంస్థకు లీగల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక వనితకు అమిత అనే సోదరి కూడా ఉంది. అక్క నల్లకోటు వేసుకుని కోర్టులో వాదిస్తుంటే చెల్లి తెల్లకోటు వేసుకుని హెచ్.ఐ.వి., టీ.బీ.లపై పరిశోధనలు చేస్తోంది.
అందుకే ఆమెను నామినేట్ చేస్తున్నాను!
ఈ సందర్భంగా వనితను అమెరికన్ అసోసియేట్ అటార్నీ జనరల్‌గా నామినేట్ చేసిన బైడెన్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘వనిత నాకు కొంత కాలంగా తెలుసు. స్వేచ్ఛ, సమానత్వం కోసం తన వంతు కృషి చేస్తోందామె. అమెరికాలో అత్యంత గౌరవనీయమైన పౌర హక్కుల న్యాయవాదుల్లో వనిత ఒకరు. ఆమె భారత దేశం నుంచి వలస వచ్చిన గర్వించదగ్గ కుమార్తె. ఈ క్రమంలో మన న్యాయ వ్యవస్థ మరింత సమర్థమైనదని నిరూపించడానికి మరోసారి ఆమె సేవలను వినియోగించుకోవాలనుకుంటున్నాం. అందుకే అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్ న్యాయశాఖలో కీలకమైన మూడో స్థానానికి వనితను ఎంపిక చేస్తున్నాను’ అని బైడెన్ చెప్పుకొచ్చారు.
స్వీట్లు పంచి సంబరాలు!
వనిత నియామకాన్ని పురస్కరించుకుని అలీఘర్‌లో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు సంబరాలు చేసుకున్నారు. ఆమెను చూస్తుంటే తమకెంతో గర్వకారణంగా ఉందని అందరికీ స్వీట్లు పంచి పెట్టారు. దీంతో పాటు సోషల్ మీడియాలోనూ ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలియజేస్తూ పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు.