Photos: Twitter
‘పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం అంత సులభం కాదు’...ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఏ రంగంలోనైనా మహిళలు పురుషులతో సమానంగా పనిచేసేందుకు పోటీ పడుతున్నారు. ఎంత కష్టంతో కూడిన రంగమైనా సరే...సవాళ్లకు ఎదురొడ్డి మరీ అందులో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఫుడ్ డెలివరీ, క్యాబ్ డ్రైవింగ్, లోకో పైలట్, పైలట్.. వంటి అధిక శారీరక శ్రమతో కూడిన రంగాల్లోనూ ఎందరో మహిళలు సమర్థంగా విధులు నిర్వర్తిస్తుండడమే ఇందుకు నిదర్శనం. ఈక్రమంలో మహిళల శక్తి సామర్థ్యాలేంటో మరోసారి ప్రపంచానికి చాటి చెబుతూ ఎయిర్ ఇండియా మహిళా పైలట్ల బృందం ఉత్తర ధ్రువం మీదుగా విమానం నడిపేందుకు సిద్ధపడింది. ఇక మరోవైపు పశ్చిమ రైల్వేకు చెందిన మహిళా సిబ్బంది తాజాగా గూడ్స్ రైలును నడిపి సరికొత్త అధ్యాయానికి తెరతీసింది.
ఉత్తర ధ్రువం మీదుగా..!
పురుషులతో సమానంగా అవకాశాలిస్తే రాకెట్లలో రివ్వున ఎగిరి ఆకాశాన్ని సైతం అందుకోగలమని ఇప్పటికే చాలామంది మహిళలు నిరూపించారు. ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియాకు చెందిన మహిళా పైలట్ల బృందం ఉత్తర ధ్రువం మీదుగా 16 వేల కిలోమీటర్ల అత్యంత సుదూర వైమానిక మార్గంలో విమానం నడిపి చరిత్ర సృష్టించేందుకు సిద్ధపడింది. సాధారణంగా ఉత్తర ధ్రువం మీదుగా విమానాన్ని నడపాలంటే ఎంతో సవాలుతో కూడుకున్న విషయం. ఈ మార్గంలో విమానాలు నడిపేటప్పుడు విమానయాన సంస్థలు సహజంగా ఎంతో అనుభవం ఉన్న అత్యుత్తమ పైలట్లనే ఎంచుకుంటాయి. అయితే ఈసారి ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఈ బాధ్యతలను తొలిసారిగా ఓ మహిళా పైలట్ల బృందానికి అప్పగించింది. ఈ బృందానికి ఎయిర్ ఇండియా మహిళా కెప్టెన్ జోయా అగర్వాల్ సారథ్యం వహించనుంది.
శాన్ఫ్రాన్సిస్కో టు బెంగళూరు! సిలికాన్ వ్యాలీగా పేరొందిన శాన్ఫ్రాన్సిస్కో, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన బెంగళూరు మధ్య ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన మొట్టమొదటి నాన్-స్టాప్ విమాన సర్వీస్ సేవలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలోని రెండు ప్రధాన గ్లోబల్ టెక్ హబ్‌లను అనుసంధానం చేస్తూ ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించే ఈ బోయింగ్ 777విమానానికి కెప్టెన్ జోయా అగర్వాల్ సారథ్యం వహించనుంది. ఆమెతో పాటు కెప్టెన్ తన్మయి పాపగరి, కెప్టెన్ ఆకాంక్ష సోనావారే, కెప్టెన్ శివానీ మన్హాస్ లాంటి అత్యంత అనుభవజ్ఞులైన పైలట్లు ఈ అరుదైన ప్రయాణంలో భాగం కానున్నారు. మొత్తం 238 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యముండే ఈ విమానం శనివారం (జనవరి 9న) శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయల్దేరి సోమవారం (జనవరి 11న) బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుంది. ఈ రెండు నగరాల మధ్య గాలి వేగాన్ని బట్టి ప్రయాణ సమయం 17 గంటలకుపైనే ఉంటుందట!
నా కల నెరవేరనుంది! గతంలో అత్యంత పిన్న వయసులో బోయింగ్ విమానాన్ని నడిపిన మహిళా కమాండర్‌గా చరిత్ర సృష్టించింది జోయా అగర్వాల్. ఇక ఇప్పుడు నార్త్‌పోల్ మీదుగా ప్రయాణించే విమానానికి నాయకత్వం వహించనున్న మొట్టమొదటి మహిళా కెప్టెన్‌గా మరో అరుదైన రికార్డును తన కీర్తి కిరీటంలో చేర్చుకుంది జోయా. ‘నేను గతంలో బోయింగ్ 777 విమానాన్ని నడిపాను. కానీ ధ్రువాల మీదుగా ఎప్పుడూ విమానం నడపలేదు. అందులోనూ ఉత్తర ధ్రువం మీదుగా విమానం నడపాలంటే అంత సులభమేమీ కాదు. కానీ పౌర విమానయాన శాఖ, ఎయిర్ ఇండియా నాపై ఎంతో నమ్మకం ఉంచి ఈ గొప్ప బాధ్యతను నాకు అప్పగించాయి. తద్వారా ఉత్తర ధ్రువం మీదుగా అత్యంత సుదూర మార్గంలో బోయింగ్ 777 విమానాన్ని నడిపే అద్భుత అవకాశం నాకు లభించింది. మహిళా పైలట్ల బృందం నాయకత్వంలో నార్త్‌పోల్ మీదుగా ఓ విమానం నడవనుండడం ఇదే మొదటిసారి. దీనితో ప్రొఫెషనల్ పైలట్‌గా నా కల నెరవేరనుంది’ అని తన సంతోషాన్ని పంచుకుంది జోయా.
|
గూడ్స్ రైలును పరుగులు పెట్టించారు!
సంఖ్యాపరంగా చూసుకుంటే ప్రపంచంలో అత్యధిక మహిళా సిబ్బంది కలిగిన రైల్వే వ్యవస్థల్లో భారతీయ రైల్వే మొదటి స్థానంలో ఉంది. రైల్వేలోని టికెట్ కలెక్టర్, స్టేషన్ మాస్టర్, టెక్నీషియన్స్, లోకో పైలట్, గార్డు, టీటీఈ, స్క్వాడ్, ఆర్ఫీఎఫ్ సిబ్బంది, పాయింట్ ఉమెన్.. తదితర విభాగాల్లో ఎంతోమంది ఆడవాళ్లు ఎన్నో ఏళ్లుగా ప్రయాణికులకు సేవలందిస్తున్నారు. ఈక్రమంలో పశ్చిమ రైల్వేకు చెందిన ముగ్గురు మహిళా సిబ్బంది మొదటిసారిగా ఓ గూడ్స్ రైలును నడిపారు. తద్వారా మహిళలు ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారన్న సందేశాన్ని సమాజానికి అందించారు. ఎందులోనూ తక్కువ కాదు! మహారాష్ట్రలోని వసాయ్ స్టేషన్ నుంచి గుజరాత్‌లోని వడోదరకు ప్రయాణించిన ఈ రైలులో లోకోపైలట్‌గా కుంకుమ్ సూరజ్ డోంగ్రే, అసిస్టెంట్ లోకోపైలట్‌గా ఉదితా వర్మ, గూడ్స్ గార్డ్‌గా ఆకాంక్ష రాయ్ విధులు నిర్వర్తించారు. మొత్తం 43 వ్యాగన్లలో సుమారు 3,686 టన్నుల సరుకుతో నిండిన ఈ రైలును గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టించి తాము పురుషులకేమీ తీసిపోమని నిరూపించారీ టీనేజర్లు.
ఇండోర్‌కు చెందిన ఆకాంక్ష రాయ్ ఎంబీఏ పూర్తి చేసింది. ఆ తర్వాత 2019, ఏప్రిల్ 4న పశ్చిమ రైల్వేకు చెందిన ముంబయి సెంట్రల్ డివిజన్ స్టేషన్లో గూడ్స్ గార్డ్‌గా చేరింది. కుంకుమ్ డోంగ్రే విషయానికి వస్తే.. 2013లో అసిస్టెంట్ లోకోపైలట్ ఉద్యోగంలో చేరింది. ప్రస్తుతం గూడ్స్ ట్రైన్ లోకోపైలట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఇక 2016లో అసిస్టెంట్ లోకోపైలట్‌గా చేరింది ఉదితా వర్మ. ఆమె ప్రస్తుతం ముంబయి సెంట్రల్ డివిజన్ స్టేషన్లో సీనియర్ అసిస్టెంట్ లోకోపైలట్‌గా సేవలు అందిస్తోంది. అలాంటి వాళ్లకు ఈ మహిళలు ఆదర్శం! ఈ సందర్భంగా పశ్చిమ రైల్వే ప్రజా సంబంధాల అధికారి సుమిత్ ఠాకూర్ ఓ ప్రకటన ద్వారా ఈ మహిళా త్రయంపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘సాధారణంగా గూడ్స్ రైళ్లను నడిపే వాళ్లు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ట్రైన్లలో టాయిలెట్స్, బాత్రూమ్స్ లాంటి వసతులుండవు. పైగా ఈ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి నైట్‌షిఫ్టులు ఉంటాయి. అన్ని్ంటికీ మించి ఎలాంటి రక్షణ ఉండని రూట్లలో వారు జర్నీ చేయాల్సి ఉంటుంది. అందుకే కొద్ది మంది మహిళలు మాత్రమే గూడ్స్ గార్డ్, లోకోపైలట్లుగా చేరుతున్నారు. అయితే సవాళ్లతో కూడిన ఇలాంటి ఉద్యోగాల్లో చేరాలనుకునే మహిళలకు కుంకుమ్, ఉదిత, ఆకాంక్షలు ఆదర్శంగా నిలుస్తారు’ అని ఆయన చెప్పుకొచ్చారు.
|
మహిళా సాధికారతకు ఉదాహరణగా నిలిచారు!
ఇక ఈ విషయం తెలుసుకున్న కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఈ ముగ్గురు మహిళలు మహారాష్ర్టలోని వసాయ్ స్టేషన్ నుంచి గుజరాత్‌లోని వడోదర వరకు గూడ్స్ రైలును సమర్థంగా నడిపారు. తద్వారా మహిళా సాధికారతకు ఉదాహరణగా నిలిచారు’ అని ప్రశంసించారు.