Photo: Instagram
చిన్నారి స్నేహితకు పదేళ్లు.. అభం శుభం తెలియని ఆ బాలికపై వరసకు అంకుల్ అయిన వ్యక్తి కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా ఒక్కసారి కాదు.. నాలుగైదు సార్లు! ఇదే విషయం ఒక రోజు ఆమె వాళ్లమ్మతో చెబితే.. ‘ష్.. ఈ విషయం బయటికి పొక్కితే మన పరువు పోతుంది..’ అంటూ ఆమె నోరు నొక్కేసింది.
రిధిమ తండ్రికి సుధీర్ మంచి స్నేహితుడు. ఈ నెపంతో రోజూ రిధిమ వాళ్లింటికి వచ్చి వెళ్తుంటాడు. చాక్లెట్లు, బిస్కట్లు ఇస్తానంటూ తన పక్కనే కూర్చోబెట్టుకొని ఆమెను అసభ్యంగా తాకడం, ముద్దుపెట్టుకోవడం.. వంటివి చేస్తుంటాడు. ఐదేళ్ల ఆ పాపకు అతనెందుకలా చేస్తున్నాడో అర్థం కాదు.
అభం శుభం తెలియని చిన్నారులపై జరిగే ఇలాంటి లైంగిక దాడులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొన్ని నిమిషాలకో చిన్నారి అత్యాచారానికి లేదంటే లైంగిక దాడికి గురవుతోందని ‘జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ కూడా చెబుతోంది. అయితే ఇందుకు లైంగిక విద్య పట్ల చిన్నారులకు అవగాహన లేకపోవడం, ధైర్యం చెప్పే తల్లిదండ్రులే బాధిత చిన్నారుల నోరు మూయించడమే ప్రధాన కారణాలని తెలుసుకుంది దిల్లీకి చెందిన మేఘా భాటియా. అంతటితో ఊరుకోకుండా ఈ అన్యాయాల నుంచి పిల్లల్ని కాపాడేందుకు యానిమేషన్‌ను అస్త్రంగా మలచుకుంది. మరి, తన డిజిటల్ స్కిల్స్‌తో చిన్నారుల్లో లైంగిక అంశాలపై అవగాహన పెంచుతోన్న ఈ యంగ్ లేడీ తన గురించి, తన ఆశయం గురించి ఏం చెబుతోందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..!
ఏదైనా మంచి పని చేస్తానంటే మనల్ని ప్రోత్సహించే వారి కంటే నిరుత్సాహ పరిచే వారే మన చుట్టూ ఎక్కువగా ఉంటారు. ‘ఇవన్నీ నీకెందుకు.. నీ చదువుకు తగ్గ ఉద్యోగం చేసుకుంటూ హాయిగా బతక్క’ అంటూ ఉచిత సలహాలిస్తుంటారు. నా విషయంలో కూడా అదే జరిగింది. దిల్లీలోని రాజేంద్రనగర్‌కు చెందిన నేను లండన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశాను. ఆ సమయంలో నా పరిశోధనలో భాగంగా మన దేశంలో చిన్నారులపై జరుగుతోన్న లైంగిక దాడుల గురించి నాకు తెలిసింది. అభం శుభం తెలియని పిల్లలపై అత్యాచారాలేంటని మరింత శోధించగా.. ఇలాంటి నేరాల్లో బయటికి వచ్చేవి కొన్నైతే.. చీకట్లోనే కనుమరుగవుతున్నవి ఎన్నో అన్న నిజం తెలుసుకున్నా.
‘ఇవన్నీ నీకెందుకు?’ అన్నారు!
కేవలం శారీరకంగానే కాదు.. ఓరల్‌గా కూడా ఎంతోమంది పిల్లలు ఇలాంటి వేధింపులకు గురవుతున్నారు. ఇక ఇలా వారిపై జరిగే అన్యాయాల గురించి పెద్దలకు చెప్పినా పరువు పోతుందనో లేదంటే మరే కారణంతోనో వారి నోరు నొక్కేస్తున్నారు. ఇవన్నీ తెలిశాక నా మనసు మనసులో లేదు. నా రీసెర్చ్ ప్రాజెక్ట్‌ని కాలేజ్‌లో సమర్పించి వెంటనే ఇండియా తిరిగొచ్చేద్దామనుకున్నా. ఇక్కడికొచ్చాక పిల్లలకు లైంగిక విద్య గురించి అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నా. ఇదే విషయం నా ఫ్రెండ్‌తో చెబితే.. ‘అయినా ఇవన్నీ నీకెందుకు.. హాయిగా ఏదైనా ఉద్యోగం చేసుకోక!’ అంటూ సమాధానమిచ్చింది. కానీ ఆ మరుసటి రోజు మరో వ్యక్తితో జరిగిన చర్చ ద్వారా నా మీద నాకే నమ్మకమొచ్చింది. ‘నువ్వు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునే దాకా అలసిపోకు.. ప్రయత్నిస్తూనే ఉండు..!’ అంటూ ఆ వ్యక్తి నాలో మరింత ప్రేరణ కలిగించారు. ఇలా రెట్టించిన ఉత్సాహంతో ఇండియాలో ల్యాండ్ అయ్యా!
యానిమేషనే ఎందుకంటే..!
ఇక్కడి పాఠశాలల్లో కూడా లైంగిక విద్యపై పిల్లల్లో సరైన అవగాహన కల్పించట్లేదని, కనీసం వారి వ్యక్తిగత అవయవాల పేర్లు కూడా వారికి తెలియట్లేదన్న విషయం నాకు అర్థమైంది. ఈ క్రమంలోనే దిల్లీలో ‘Our Voix’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించా. పిల్లలపై జరుగుతోన్న లైంగిక హింసకు అడ్డుకట్ట వేయడమే ఈ సంస్థ ప్రధానోద్దేశం. ఈ క్రమంలో నేను ఎంచుకున్నది రెండే రెండు మార్గాలు. ఒకటి ఆన్లైన్, రెండోది ఆఫ్‌లైన్. ఆన్లైన్లో భాగంగా యానిమేషన్‌ని అస్త్రంగా చేసుకున్నా. మరి, యానిమేషనే ఎందుకు అని మీకు సందేహం కలగొచ్చు.. పిల్లలకు కార్టూన్ క్యారక్టర్లన్నా, యానిమేషన్ చిత్రాలన్న ఎంతో మక్కువ. పైగా అలా చెబితే పిల్లలు మరింత త్వరగా గ్రహించగలుగుతారు. అందుకే డోరేమాన్, మోటూ పట్లు.. వంటి కొన్ని కార్టూన్ క్యారక్టర్లను తీసుకొని వాటి సహాయంతో పిల్లలపై జరిగే లైంగిక దాడులు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఇలాంటి వేధింపులు ఎదురవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?, లైంగిక హింసను ఎలా అడ్డుకోవాలి? తదితర విషయాలపై లఘుచిత్రాలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించా. ఇందులో భాగంగానే ‘హమారే సూపర్ బడ్డీస్ హమారే రక్షక్’ పేరుతో ఎన్నో చిత్రాలు పిల్లలకు చేరువయ్యాయి. అలాగే మూగ, చెవిటి పిల్లల కోసం సైగలతో కూడిన లఘు చిత్రాలు కూడా మా సంస్థ వేదికగా రూపొందుతున్నాయి.
ఆఫ్‌లైన్‌లో సవాళ్లెన్నో!
ఇలా మేము రూపొందించిన యానిమేషన్ చిత్రాలు సోషల్ మీడియాలోనే కాదు.. పిల్లల కోసం ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాల్లో సైతం ప్రదర్శిస్తుంటాం. అయితే ఇలా పిల్లల్ని నేరుగా కలవడం నిజంగా సవాలుతో కూడుకున్నదే! ఎందుకంటే పిల్లలపై జరిగే అత్యాచారాల గురించి మాట్లాడడమంటే అదేదో పెద్ద తప్పుగా భావిస్తుంటారు చాలామంది. వారికి తెలియనివి కూడా తెలియజెప్పడమెందుకు అన్నట్లుగా ఫీలవుతుంటారు. అందుకే స్కూళ్లలో పిల్లల్ని కలవడానికి, వారికి వర్క్‌షాప్స్ ఏర్పాటు చేయడానికి, ట్రైనింగ్ క్లాసులు నిర్వహించడానికి అనుమతి తీసుకోవడం ఎంతో గగనమయ్యేది. అయినా ఎలాగోలా ప్రయత్నించి చిన్నారులకు చేరువయ్యే వాళ్లం. ఈ క్రమంలో కొంతమంది పిల్లలు కూడా తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి నోరు విప్పేవాళ్లు. అలా ఒక రోజు ఓ తొమ్మిదేళ్ల బాలిక తనపై జరిగిన రేప్ గురించి చెప్పింది. గత ఏడాది కాలంగా తనను తన సోదరుడు అత్యాచారం చేస్తున్నాడని, ఈ విషయం అమ్మతో చెప్పినా ‘ష్’ అంటూ తన నోరు కట్టేసిందని ఆ చిన్నారి చెబుతున్నప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి.
9 రాష్ట్రాలు.. 16 వేల మంది పిల్లలు..!
ఇలా కేవలం అమ్మాయిలే కాదు.. అబ్బాయిలూ లైంగిక హింస బారిన పడుతున్నారు. ఇక ఇలాంటి అఘాయిత్యాల్లో వెలుగులోకి వచ్చేవి కొన్నైతే, చీకట్లోనే కనుమరుగయ్యే వాటికైతే లెక్కేలేదు. ప్రతి రాష్ట్రంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో పిల్లలు ఇలాంటి వేధింపులకు గురవుతున్నారు. ఇల్లు, స్కూలు అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ వారిని లొంగదీసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వీటిని నిర్మూలించడం, లైంగిక విద్యపై పిల్లలకు అవగాహన కల్పించడంలో భాగంగా ఇప్పటికే మా కార్యక్రమాలు తొమ్మిదికి పైగా రాష్ట్రాల్లోని సుమారు 16 వేల మందికి పైగా పిల్లలకు చేరువయ్యాయి. దీంతో పాటు కొన్ని పాఠశాల గ్రంథాలయాల్లో చిన్నారుల రక్షణకు సంబంధించి మేం విడుదల చేసిన పలు కామిక్ పుస్తకాలు సైతం అందుబాటులో ఉంచాం.
ఇక ఆఖరుగా నేను మీ అందరినీ కోరేది ఒక్కటే..! ఇటు ఇంట్లో తల్లిదండ్రులు, అటు స్కూళ్లలో టీచర్లు పిల్లలకు లైంగిక విద్య పట్ల అవగాహన పెంచాలి. అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చి తమకున్న వనరులతో పిల్లలకు లైంగిక విద్యను అందించాలి. ఇకపై ఏ చిన్నారీ ఇలాంటి హింసను ఎదుర్కోకూడదు.. అలా జరగకూడదంటే అందరూ గొంతూ గొంతూ కలిపి దీనికి వ్యతిరేకంగా పోరాడాలి.. పిల్లల భద్రతే నా అంతిమ ఆశయం!