సాధారణంగా వయసు పైబడుతున్న వారికి ఒంట్లో సత్తువ తగ్గిపోతూ ఉంటుంది. ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవడానికే చాలామంది మొగ్గు చూపుతుంటారు. మరికొందరు ఇంట్లో ఉన్న మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. అయితే 68 ఏళ్ల ఓ మహిళ మాత్రం తనకున్న వ్యవసాయ భూమిని ఏకంగా ఓ దీవిగా మార్చేసి పలు రకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఏడాదికి రూ.25 లక్షలకు పైగా ఆదాయం సంపాదిస్తున్నారు. గూగుల్ సైతం ఆమె విభిన్న వ్యాపార స్ఫూర్తికి ముగ్ధురాలైంది. ఇంతకీ ఎవరా మహిళ? ఎక్కడుందా దీవి? తదితర విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఏడాదికి రూ.25 లక్షల ఆదాయం!
‘ఉన్నత చదువులు అభ్యసించి సూటు బూటు వేసుకుని తిరిగే సంపన్నులే వ్యాపారాలు చేయగలరు’, ‘సామాన్యులు వ్యాపారాలు చేసినా పెద్దగా సక్సెస్ కాలేరు’.. అని చాలామంది అనుకుంటుంటారు. అయితే ఈ మాటలు ఒట్టి అపోహలేనని నిరూపిస్తున్నారు ఉత్తర ప్రదేశ్‌లోని కన్నౌజ్‌కు చెందిన కిరణ్ రాజ్‌పుత్. పదో తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పిన ఆమె తనకున్న 25 బిగాల వ్యవసాయ భూమిని ఏకంగా ఒక పర్యాటక దీవిగా మార్చేశారు. చుట్టూ నీటి సవ్వడులు, పక్షుల కిలకిలా రావాలతో ప్రస్తుతం ఆ ప్రాంతమంతా పర్యాటకులతో కిటకిటలాడుతోంది. చూడ్డానికి అచ్చం సహజ దీవిలా కనిపించే ఈ ప్రాంతంలో బోటింగ్ చేసేందుకు యువత పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుతం ఈ పర్యాటక దీవి ద్వారా ఏడాదికి కనీసం రూ.25 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నారు కిరణ్ రాజ్‌పుత్. ఇక చెరువుల్లో పెంచుతున్న చేపలు, తోటల్లో పండిస్తున్న పండ్లు, కూరగాయలు ఆమెకు అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో తన వ్యాపార స్ఫూర్తిని ఇతర ఔత్సాహికులకు కూడా పంచుతున్న ఆమెను గూగుల్ సైతం ప్రశంసించింది.

డబ్బు కోసం ఎన్నో కష్టాలు పడ్డాం!
ఈ సందర్భంగా ఈటీవీ భారత్‌తో కిరణ్ రాజ్‌పుత్, ఆమె కుమారుడు శైలేందర్ మాట్లాడారు. తమ వ్యాపారం ఎలా విజయవంతమైందో అందరితో పంచుకున్నారు. ‘ఇక్కడ చుట్టూ నీరు ఉండడం వల్ల వ్యవసాయం చాలా కష్టంగా మారింది. చాలా నష్టపోయేవాళ్లం. అయితే నాలుగేళ్ల క్రితం చేపల పెంపకం చేపట్టాలని నిర్ణయించుకున్నాం. అయితే ఓ కొత్త వ్యాపార ఆలోచనను ఆచరణలో పెట్టడం అంత సులభమేమీ కాదు. డబ్బు సమకూర్చుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డాం. ప్రభుత్వం నుంచి రుణంగా కేవలం రూ. 2 లక్షలు మాత్రమే వచ్చాయి. దీంతో దాచుకున్న డబ్బుతో పాటు, బంధువుల సాయంతో మొత్తం 11 లక్షలు సమకూర్చుకుని చేపల చెరువు పెంపకం ప్రారంభించాం. ఇప్పుడు అదే పెద్ద వ్యాపారంగా మారింది. ప్రస్తుతం మేం అన్ని రకాల చేపలను పెంచుతున్నాం. ఈ చేపల చెరువుల నుంచే రూ.5 నుంచి 7 లక్షల వరకు లాభం వస్తోంది’..

ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నాం!
‘ఇక దీవిలో ఓ చెరువును తవ్వి మామిడి, అరటి, జామ, బొప్పాయి, పూల చెట్లను నాటాం. ఇక్కడికి రోజుకు కనీసం 20 నుంచి 50 మంది పర్యాటకులు వస్తుంటారు. వారందరికీ మేమే భోజన ఏర్పాట్లు చేస్తాం. పర్యాటకులు ఇక్కడ ఎంతో సరదాగా గడుపుతారు. మా తోటలో పండే పండ్లను తింటూ ఎంతో ఆహ్లాదంగా ఆటలాడుకుంటారు. మొత్తంగా ఈ దీవి నుంచి ఏడాదికి రూ.20 నుంచి రూ.25 లక్షల వ్యాపారం జరుగుతోంది. ఇక మమ్మల్ని చూసి ఎంతోమంది ఔత్సాహికులు ఇక్కడకు వస్తున్నారు. వారికి కూడా వ్యాపారంలో శిక్షణ ఇస్తున్నాం’ అని చెప్పుకొచ్చారీ సూపర్ వుమన్.