Image for Representation
‘ఆకాశంలో సగం... అవకాశాల్లో సగం’ అంటూ ఇప్పుడు ఏ రంగంలోనైనా స్త్రీలు పురుషులతో సమానంగా పని చేసేందుకు పోటీ పడుతున్నారు. ఎంత కష్టమైనా సరే... సవాలుగా తీసుకుని మరీ ఆ రంగంలో తమ సామర్థ్యాన్ని చాటుకుంటున్నారు. శారీరక శ్రమతో కూడిన బాధ్యతలను సైతం చక్కగా నిర్వర్తిస్తున్నారీ తరం మహిళలు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే స్త్రీలపై ఎక్కువ ఆంక్షలుండే జమ్మూ కశ్మీర్లో తొలిసారిగా ఓ మహిళ బస్సు స్టీరింగ్ పట్టుకుంది. కుటుంబ అవసరాల కోసం తన కుమారుడిని వెంట పెట్టుకుని మరీ బస్సు నడిపింది. మరి ఇంతకీ ఎవరా మహిళ? ఎందుకు బస్సు డ్రైవర్‌గా మారిందో తెలుసుకుందాం రండి...
తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా!
జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాకు చెందిన పూజాదేవికి వివాహమై ముగ్గురు పిల్లలున్నారు. రోజువారీ కూలీ అయిన తన భర్త సంపాదన ముగ్గురు పిల్లల పోషణకు ఏ మాత్రం సరిపోలేదు. దీంతో ఆమె కూడా ఏదో ఒక పని చేసి కుటుంబ పరిస్థితులను చక్కదిద్దాలనుకుంది. అయితే తను పెద్దగా చదువుకోలేదు. దీంతో చిన్నప్పటి నుంచి తను నేర్చుకున్న డ్రైవింగ్‌తోనే తన కుటుంబాన్ని నడపాలనుకుంది. అయితే ‘ఆడవాళ్లు డ్రైవర్‌గా మారడమేంటి’? అని భర్త, కుటుంబ సభ్యులంతా పూజ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అయితే ముగ్గురు పిల్లల పోషణ కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పి వారందరినీ ఒప్పించింది. తాజాగా ఏడేళ్ల తన బిడ్డను పక్కన కూర్చోబెట్టుకుని జమ్మూ నుంచి కథువా వరకు ప్రయాణికుల బస్సు నడిపింది పూజ. ఈ సందర్భంగా తన కలను నెరవేర్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డానంటూ తన ఆవేదనను పంచుకుంది.
నా నిర్ణయాన్ని వ్యతిరేకించారు!
‘మాది జమ్మూ కశ్మీర్‌లోని కథువా ప్రాంతం. చాలా పేద కుటుంబంలో జన్మించాను. మా నాన్న సన్నకారు రైతు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నన్ను చదివించలేకపోయారు. అయితే నాకు చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే అందులోనే నా కెరీర్‌ను ఎంచుకోవాలనుకున్నాను. అలా మొదట్లో కారు నడపడం అలవాటు చేసుకున్నాను. నాకున్న నైపుణ్యంతో కొన్ని రోజులు ఓ డ్రైవింగ్ స్కూల్లో ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేశాను. అయితే నాకు ప్రొఫెషనల్ డ్రైవర్‌గా మారి బస్సు లేదా ట్రక్కు నడపాలనే కోరిక ఉండేది. అయితే అది అంత సులభమైన పని కాదని నాకూ తెలుసు. ఇక బస్సు డ్రైవర్‌గా వెళతానని చెప్పినప్పుడు నా భర్త, కుటుంబ సభ్యులందరూ వ్యతిరేకించారు. ఆడవాళ్లకి డ్రైవింగ్ సరైన వృత్తి కాదన్నారు. అయితే నేను చదువుకోలేదు కాబట్టి నాకు ఎక్కడా ఉద్యోగం రాదు. పైగా నా భర్త కూలీ. ముగ్గురు పిల్లల పోషణ కూడా భారంగా మారింది. అందుకే నేను తీసుకున్న నిర్ణయాన్ని కాదనలేకపోయారు’..
‘ఇక నేను ఏ పనైనా చేయగలను’ అనిపించింది!
‘మొదట నా మేనమామ రాజిందర్ సింగ్ సాయంతో ట్రక్కు నడపడం అలవాటు చేసుకున్నాను. ఆ తర్వాత భారీ వాహనాలు నడిపేందుకు అవసరమైన లైసెన్స్ తీసుకున్నాను. ఈ క్రమంలో బస్సు డ్రైవర్‌గా చేరదామని చాలా చోట్ల ప్రయత్నించాను. ‘పురుషులు చేయాల్సిన పని స్త్రీలు చేయడమేంటి?’ అని చెప్పి నన్ను తిరస్కరించారు. చివరకు జమ్ము-కథువా మార్గంలో బస్సు డ్రైవర్‌గా బస్ యూనియన్‌లో దరఖాస్తు చేసుకున్నాను. వాళ్లు నా మీద నమ్మకం ఉంచి డ్రైవర్‌గా చేర్చుకున్నారు. అలా తొలిసారి జమ్మూ-కథువా మార్గంలో ప్రయాణికుల బస్సును నడిపాను. నాకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి పదో తరగతి చదువుతోంది. రెండో అబ్బాయి ఏడో తరగతి చదువుతున్నాడు. కానీ ఏడేళ్ల వయసున్న నా చిన్న కుమారుడు నన్ను వదిలి ఇంట్లో ఉండలేడు. అందుకే తనని కూడా బస్సులో వెంట తీసుకెళ్తున్నాను. మొదటి సారి నేను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు బస్సు ఎక్కిన ప్రయాణికులు నన్ను, నా కుమారుడిని చూసి ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత నన్ను ఎంతో మెచ్చుకున్నారు. ఈ ప్రయాణం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఇక నేను ఏ పనైనా చేయగలనన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ సూపర్ వుమన్.
మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది!
ఈ క్రమంలో ‘ఎన్నో పనులుండగా డ్రైవర్‌గానే ఎందుకు మారారు’ అని పూజా దేవిని అడిగితే ‘నేటి ఆడవాళ్లు పైలట్లుగా యుద్ధ విమానాలే నడుపుతున్నారు. ప్రొఫెషనల్ డ్రైవర్‌గా మారి బస్సు నడిపితే తప్పేంటి’ అని చిరునవ్వుతో సమాధానం చెప్పింది. ఈ క్రమంలో కుమారుడిని పక్కన కూర్చోబెట్టుకుని పూజాదేవి బస్సు నడుపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పలువురు ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆమె ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ ‘జమ్మూ కశ్మీర్ తొలి మహిళా బస్సు డ్రైవర్ పూజా దేవి. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది’ అని రాసుకొచ్చారు. ఆయనతో పాటు పలువురు నేతలు, స్థానికులు, తోటి డ్రైవర్లు ఆమెను అభినందిస్తున్నారు.