Image for Representation
ఓ వైపు కరోనా, మరో వైపు ఎముకలు కొరికే చలి, ఇంకో వైపు అసువులు బాస్తున్న తోటి రైతులు... ఇవేవీ దేశ రాజధాని సరిహద్దుల్లో అకుంఠిత దీక్ష చేస్తున్న అన్నదాతలను భయపెట్టడం లేదు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాల రద్దే లక్ష్యంగా కర్షకులు ముందుకెళుతున్నారు. నెల రోజులు గడిచిపోయినా... వారిలో ఉద్యమ స్ఫూర్తి ఇనుమడిస్తూనే ఉంది కానీ వీసమంత కూడా తగ్గలేదు. అలాగని అక్కడ మిన్నంటే నిరసనలు కనిపించడం లేదు. ఉత్తేజిత ప్రసంగాలు వినిపించడం లేదు. దేశం ఇదివరకెన్నడూ చూడని కొత్త తరహా ఉద్యమం ఇది.

ఇలా ఓ వైపు అన్నదాతల ఆందోళనలు కొనసాగుతుండగానే డిసెంబర్ 23న యావత్ దేశం ‘కిసాన్ దివస్’ (రైతు దినోత్సవం) జరుపుకొంది. ఈ సందర్భంగా దిల్లీ వేదికగా తన గళం వినిపిస్తున్న సరబ్జీత్ అనే ఓ మహిళా రైతు ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ ద్వారా తన ఆవేదనను అందరితో షేర్ చేసుకుంది. మరి ఆమె ఏం చెప్పిందో మనమూ విందాం రండి.
పెళ్లయ్యాక వారానికే పొలానికెళ్లాను!
‘నా జీవితమంతా వ్యవసాయానికే అంకితం చేశాను. నాకు తెలిసింది ఇదొక్కటే. మేం మొత్తం నలుగురు పిల్లలం. అందులో నేను ఒక్కదాన్నే ఆడపిల్లను. దీంతో నన్ను కూడా చిన్నప్పటి నుంచి అబ్బాయిలానే పెంచారు. నాన్న రోజూ ఉదయం తనతో పాటు నన్ను పొలానికి తీసుకెళ్లేవారు. మళ్లీ సాయంత్రమైతే కానీ ఇంటికొచ్చేదాన్ని కాదు. పెద్దయ్యాక కూడా ఇంట్లో వంట పని చేయనివ్వకుండా నాన్న తనతో పొలానికి తీసుకెళ్లేవారు. దీంతో నాక్కూడా పొలం అంటే ఇష్టం ఏర్పడింది. కొన్నాళ్లకు నాకు పెళ్లి నిశ్చయమైంది. అప్పుడు నేను ఒకటే షరతు పెట్టాను. పెళ్లయ్యాక కూడా వ్యవసాయం చేసేందుకు ఒప్పుకుంటేనే ఈ పెళ్లి చేసుకుంటానన్నాను. అందుకు నా అత్తింటివాళ్లు ఎంతో సంతోషంగా అంగీకరించారు. నా భర్త బస్ కండక్టర్. అలా పెళ్లి చేసుకుని మెట్టినింట అడుగుపెట్టిన నేను వారానికే పలుగు, పార పట్టుకున్నాను. కొత్త పెళ్లికూతురిగా ఇంట్లో ఉండడానికి బదులు పొలంలో ప్రత్యక్షమయ్యాను’..
అయినా మేం వెనుకాడలేదు!
‘ఏటా భూమిపై వచ్చే ఆదాయంతోనే మా ఇంటి అవసరాలు గడిచేవి. ఉదయాన్నే ఇంట్లో వంట చేయడం.. పశువులకు మేత వేయడం.. పాలు పితకడం.. ఆ తర్వాత పొలానికి వెళ్లడం.. ప్రతిరోజూ ఇదే నా పని. విత్తనాలు నాటడం దగ్గర్నుంచి.. కోత కోయడం వరకూ అన్ని పనులు చేస్తాను. నాగలి కూడా దున్నేదాన్ని. ఆ తర్వాత నా భర్త ట్రాక్టర్ కొనిచ్చారు. దీంతో నేను కూడా ట్రాక్టర్‌పై మండీలకు వెళ్లడం మొదలుపెట్టాను. నేను పండించిన జొన్నలతో చేసిన రొట్టెలు నా కుటుంబ సభ్యులు తింటున్నప్పుడు నాకు ఎంతో ఆనందమేస్తుంది. అయితే వ్యవసాయం చేయడమంటే మామూలు విషయం కాదు. ఒక్కోసారి వర్షాలు పంటలను ముంచేస్తే... మరోసారి తెగుళ్లు, చీడపురుగులు తినేస్తాయి. అయినా ఆ కష్టాలకు మేం ఎప్పుడూ వెనుకాడలేదు’..
మా ఆవేదన వినాలనుకుంటున్నాం..!
‘రైతులతో చర్చించకుండానే కేంద్రం కొత్త సాగు చట్టాలను తీసుకొచ్చిందని తెలియగానే ఏం చేయాలో మాకు తెలియలేదు. నా తోటి సోదరులు, సోదరీమణులందరూ కలిసి దిల్లీలో ఆందోళనకు సిద్ధమయ్యారని తెలుసుకున్నాను. మరి అటువంటప్పుడు నేను ఇంట్లోనే కూర్చుని ఎలా ఉంటాను?. వెంటనే ‘నేను కూడా దిల్లీకి వెళ్తాను’ అని నా కొడుకుతో చెప్పాను. వాడు మొదట నాకు సర్దిచెప్పి ఆపే ప్రయత్నం చేశాడు. కానీ నేను వినలేదు. దుప్పటి, కొన్ని తిండిగింజలు పట్టుకుని వారం రోజుల తర్వాత నేను సింఘా సరిహద్దుకు చేరుకున్నాను. అలా ఆందోళనలో భాగమయ్యాను.

నిరసనలో భాగంగా ప్రతి సాయంత్రం రైతులంతా కలిసి పంజాబీ జానపద గేయాలు పాడతాం. కొన్నిచోట్ల పోలీసులు కూడా మాతో కలుస్తున్నారు. అందులో వారి తప్పు లేదు.. వారు కూడా రైతు బిడ్డలే. వారి కష్టం కూడా రోటీ కోసమే... మా పోరాటమూ రోటీ కోసమే. మేం ప్రభుత్వంతో పోట్లాడాలని అనుకోవడం లేదు. కేవలం మా ఆవేదన వినిపించాలనుకుంటున్నాం. మా కష్టాన్ని గుర్తించాలనుకుంటున్నాం. అందుకే ఇక్కడ కూర్చున్నాం. కొన్నిసార్లు చలికి నా మోకాళ్లు పట్టేస్తున్నాయి. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా అనిపిస్తోంది.. అయినా కూడా నేను ఇక్కడి నుంచి కదలను’..
సాధించేవరకు ఇక్కడి నుంచి కదలను!
‘మేం దేశ సరిహద్దుల్లో యుద్ధాలు చేయకపోవచ్చు. మా కష్టానికి తగిన ప్రచారం లేకపోవచ్చు. కానీ మేం చేస్తున్నదంతా మీ అందరి కోసమే. వ్యవసాయంలో మాకెలాంటి ఆదాయం రాకపోయినా ప్రతిరోజూ మీ పళ్లెంను ఆహారంతో నింపుతున్నాం. జీవితంలో డబ్బు ముఖ్యమే అని నాకు తెలుసు. అందరూ దానికోసమే పనిచేస్తారని కూడా తెలుసు. కానీ బేటా... డబ్బు మీ ఆకలిని తీర్చదు. మేం పండించే పంట మాత్రమే మీ కడుపులు నింపుతుంది. నా పేరు సరబ్జీత్... నేను ఒక భారత రైతును. నా పేరుకు అర్థం ‘గెలుపు’. అది సాధించేంతవరకు ఇక్కడి నుంచి కదలను. మా డిమాండ్లు నెరవేరిన తర్వాతే... మా వేదనను ప్రభుత్వం విన్న తర్వాతే ఇక్కడి నుంచి కదులుతాం’ అని ఆ మహిళా రైతు చెప్పుకొచ్చింది.
సరబ్జీత్ ఇంటర్వ్యూను హ్యూమన్స్ ఆఫ్ బాంబే తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేసింది. ఆమె ఫొటోను కూడా పంచుకుంది. దీంతో కొద్దిసేపట్లోనే ఈ పోస్ట్ ట్రెండింగ్‌లో నిలిచింది. ‘మీ సంకల్పానికి ధన్యవాదాలు’, ‘మా కోసం మీరు చేస్తున్న త్యాగాలకు మేం ఎప్పుడూ రుణపడి ఉంటాం’ అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.