Photo: www.cremica.in
‘ఆడపిల్లలకు చదువెందుకు.. ఉద్యోగమెందుకు..? హాయిగా పెళ్లి చేసుకొని భర్తను, పిల్లల్ని, కుటుంబాన్ని చూసుకోక!’ అనే రోజులవి! అలాంటి ఆలోచనలతోనే ఆమెను 17 ఏళ్ల వయసులోనే ఓ అయ్య చేతిలో పెట్టారు ఆమె తల్లిదండ్రులు! కానీ ఆమెకేమో బాగా చదువుకోవాలి, ఏదైనా కొత్తగా చేయాలన్న తపన ఉండేది. ఇందుకు అత్తింటి వాళ్లు అడ్డు చెప్పినా.. భర్త మాత్రం తన పూర్తి సహకారం అందించారు. అలా నాడు బేకింగ్‌లో ప్రయోగాలు చేస్తూ తన పెరట్లోనే చిన్న బేకరీ షాపుగా ప్రారంభమైన ఆమె వ్యాపారం.. నేడు ఉత్తర భారతదేశంలోనే దిగ్గజ సంస్థగా ఎదిగింది. దేశంలో ఓ ట్రేడ్‌మార్క్‌గా ఎదగడమే కాదు.. మేటి అంతర్జాతీయ బ్రాండ్లకు ముడిసరుకుల్ని పంపిణీ చేసే స్థాయికి చేరుకుంది. ఇదంతా ఆమె కృషి, పట్టుదల వల్లే సాధ్యమైంది. కాబట్టే నేడు ఈ కంపెనీ షేర్లు స్టాక్మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. పబ్లిక్ ఇష్యూ నుంచి వందల కోట్లు సేకరించడమే కాదు.. ఈ ఏడాది అత్యధికంగా సబ్‌స్క్రైబ్ అయిన ఐపీవోల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది కూడా! ఆ దిగ్గజ సంస్థే ‘మిసెస్ బెక్టార్ - క్రీమికా’. విదేశీ బ్రాండ్ల పోటీని తట్టుకొని దేశీయ మార్కెట్లో ఈ సంస్థను అగ్రగామిగా నిలిపిన ఘనత ఈ సంస్థ అధినేత్రి రజనీ బెక్టార్దే!
‘మిసెస్ బెక్టార్ - క్రీమికా’.. దక్షిణాది వాసులకు పెద్దగా పరిచయం లేకపోయినా ఉత్తరాదిన మాత్రం ఈ బ్రాండ్ ప్రతి ఇంటికీ సుపరిచితమే! బిస్కట్లు, ఐస్‌క్రీమ్స్ తయారీలో అగ్రగామిగా దూసుకుపోతోన్న ఈ సంస్థను ఈ స్థాయికి చేర్చడం వెనుక ఈ కంపెనీ వ్యవస్థాపకురాలు రజనీ బెక్టార్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. అవిభక్త భారత్‌లోని కరాచీలో (నేటి పాకిస్థాన్) పుట్టి, కొన్నాళ్ల పాటు లాహోర్‌లోనే ఉన్న రజని.. ఇండో-పాక్ విభజన తర్వాత తన కుటుంబంతో కలిసి దిల్లీకి చేరుకుంది. ఇక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసింది. అయితే అప్పటి రోజుల్లో అమ్మాయిలు బడికెళ్తానంటేనే వింతగా చూసేవారు. అలాంటిది పైచదువులు చదువుతానంటే అదో తప్పుగా భావించేవారు. పైగా బాల్య వివాహాలు ఆ రోజుల్లో సర్వసాధారణంగా జరిగేవి. ఈ క్రమంలో రజనీ తల్లిదండ్రులు కూడా తన 17 ఏళ్ల వయసులోనే లూథియానాకు చెందిన ధర్మవీర్ బెక్టార్కిచ్చి ఆమె వివాహం చేశారు.
భర్త అండ తోడైంది!
అయితే రజనీకి మాత్రం పై చదువులు చదవాలి, ఏదైనా కొత్తగా చేయాలన్న తపన ఎప్పుడూ ఉండేది. పెళ్లి తర్వాత తను చదువుకుంటానంటే అత్తమామలు అడ్డు చెప్పినా భర్త మాత్రం ఆమెకు పూర్తి మద్దతు తెలిపాడు. ఆయన ప్రోత్సాహంతోనే పెళ్లి తర్వాత డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. ముగ్గురు పిల్లలు పుట్టాక పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. అలా కొన్నాళ్ల పాటు వారి ఆలనా పాలన, కుటుంబ బాధ్యతలతోనే రోజులు గడిచిపోయాయి. అయినా ఆమెలో ఉన్న ఆశ మాత్రం ఆమెను వదల్లేదు. పిల్లలు స్కూలుకెళ్లే సమయంలో కాస్త ఖాళీ సమయం దొరకడంతో తనకెంతో ఇష్టమైన బేకింగ్ పైనే దృష్టి సారించారు రజని. ఈ క్రమంలోనే పంజాబ్ అగ్రికల్చర్ యూనవర్సిటీలో ‘కుకింగ్ అండ్ బేకరీ’ కోర్సులో చేరారు. ఆ అనుభవంతోనే ఇంట్లో బిస్కట్లు, ఐస్‌క్రీమ్స్ తయారుచేసి తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు రుచి చూపించేవారామె. తిన్న వారు వాటి రుచి అమోఘమంటూ ప్రశంసించడమే కాదు.. ఈ నైపుణ్యంతోనే బేకరీ ఎందుకు పెట్టకూడదంటూ సలహా ఇవ్వడంతో తన అంతిమ లక్ష్యమేంటో ఆమెకు ఒక అవగాహన వచ్చింది.
ఆర్డర్లు వచ్చినా ఆదాయం రాలేదు!
ఈ క్రమంలోనే తన ఇంటి పెరట్లో ఓ బేకరీ షాపు తెరిచారు రజని. ఇక వీటి తయారీ కోసం రూ. 300 పెట్టుబడి పెట్టి ఒవెన్, ఐస్‌క్రీమ్ మేకింగ్ మెషీన్‌ని కొనుగోలు చేశారు. ఆర్డర్లైతే వచ్చేవి కానీ ఆదాయం రాకపోవడంతో ఒక దశలో నష్టాల్ని చవిచూశారామె. దీనికి తోడు ఇరుగుపొరుగు వారు ‘ఆడపిల్లవి.. ఇదేం పని’ అన్నా ఇవేమీ పట్టించుకోలేదామె. ఇక ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనే ఆమె భర్త రూ. 20 వేల పెట్టుబడితో ‘క్రీమికా’ పేరుతో లూథియానాలోనే ఓ ఐస్‌క్రీమ్ తయారీ యూనిట్‌ని రజనితో ప్రారంభింపజేశారు. అలాగే స్వతహాగా వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన ధర్మవీర్ వ్యాపారానికి సంబంధించి భార్యకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేవారు. దీంతో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదామెకు. అలా హిమక్రీములతో ప్రారంభమైన తన వ్యాపారం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా బిస్కట్లు, బ్రెడ్లు, బన్స్, సాస్‌ల దాకా విస్తరించింది. ‘మిసెస్ బెక్టార్’ పేరుతో దేశ ఆహార వ్యాపార సామ్రాజ్యంలో తక్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపును సొంతం చేసుకుంది. ఇలాంటి తరుణంలో మెక్‌డొనాల్డ్స్ సంస్థ మన దేశంలోకి ప్రవేశించడం, వారికి కావాల్సిన బన్స్ తయారీని తమ కంపెనీకి అప్పగించడం మరింత కలిసొచ్చిందని ఓ సందర్భంలో పంచుకున్నారు రజని.
వందల కోట్లకు పడగెత్తిన వైనం..!
1990లో అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్ మన దేశంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో తమ ఉత్పత్తుల్ని తయారుచేయడానికి కావాల్సిన బన్ తయారీ కోసం స్థానిక వ్యాపార సంస్థలపై అన్వేషణ సాగించింది. ఈ మహదవకాశం 1995లో క్రీమికాను వరించింది. మెక్‌డొనాల్డ్స్‌కి బన్, బ్రెడ్లను సరఫరా చేసే క్రమంలో ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న క్రీమికా ఆదాయం 2006 నాటికి వంద కోట్లను దాటేసింది. ఆపై 2011-12 నాటికి ఏడాదికి రూ. 650 కోట్లు ఆర్జించే స్థాయికి చేరుకుంది. ఆపై పిజా హట్, పాపా జాన్స్, డోమినోస్, బర్జర్ కింగ్.. వంటి విదేశీ సంస్థలకు కూడా బ్రెడ్, పిజా బేసెస్, సాస్‌లను సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాదు.. ‘ఇంగ్లిష్ ఒవెన్’ పేరుతో కేక్స్, బన్స్ తయారుచేయడం మొదలుపెట్టింది. ఇక ‘మాండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ భాగస్వామ్యంతో ఓరియో, చాకోబేక్స్.. వంటి ప్రముఖ బ్రాండ్ల బిస్కట్లను కూడా తయారుచేస్తోంది మిసెస్ బెక్టార్. ఇలా ఎన్నో అగ్రగామి సంస్థలకు ముడి ఆహార పదార్థాలు అందిస్తూ.. బిస్కట్స్ తయారుచేస్తూ దేశీయ ఆహార విపణిలో అగ్రగామిగా ఎదిగిన మిసెస్ బెక్టార్ సంస్థ ప్రస్తుత వార్షిక టర్నోవర్ వెయ్యి కోట్ల రూపాయలకు పైమాటే! ప్రస్తుతం దేశీయంగానే కాకుండా సుమారు 60 దేశాలకు తమ ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తోన్న మిసెస్ బెక్టార్ కంపెనీ 4 వేల మందికి పైగానే ఉపాధి కల్పిస్తోంది.
నాణ్యతలో రాజీ పడే సమస్యే లేదు!
వ్యాపార రంగంలో నిలదొక్కుకున్నాక, వయసు మీద పడుతున్న కొద్దీ ఆ కంపెనీ బాధ్యతల్ని వారసులకు అప్పగిస్తుంటారు చాలామంది! కానీ 77 ఏళ్ల వయసులోనూ మిసెస్ బెక్టార్ కంపెనీలో తయారయ్యే ప్రతి ఉత్పత్తి రజని రుచి చూడందే బయటికి వెళ్లదంటే ఆమె కార్య దక్షత, పని పట్ల అంకిత భావం ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. నాణ్యమైన ఉత్పత్తుల్ని అందిస్తామని చెప్పడమే కాదు.. ఆ నమ్మకాన్ని ప్రజల్లో కలిగించి, దాన్ని నిలబెట్టుకోవాలంటారీ బిజినెస్ ఉమన్. ఉత్పత్తుల కోసం ముడిసరుకుల్ని సేకరించడం దగ్గర్నుంచి సిబ్బంది పనిచేసే విధానాన్ని దగ్గరుండి చూసుకోవడానికి రోజూ 16 గంటలు శ్రమించే వారామె. ఇక ప్రస్తుతం ఈ కంపెనీ వ్యాపారాల్ని తన ముగ్గురు కొడుకులు అందిపుచ్చుకున్నా ఇప్పటికీ కంపెనీలో పలు బాధ్యతల్ని తనే నిర్వర్తిస్తున్నారీ మేటి బిజినెస్ ఉమన్. నాన్-గ్లూకోజ్ బిస్కట్లను ఉత్పత్తి చేయడంలో దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతోన్న మిసెస్ బెక్టార్ నాణ్యతలోనూ తనకెదురులేదని నిరూపిస్తోంది. ‘ఆహారమంటే నాకున్న ఇష్టం, రుచులపై నాకున్న మక్కువే నన్ను ఇంతదాకా నడిపించింది. అందుకే ఇప్పటికీ మా కంపెనీలో తయారయ్యే ప్రతి ఉత్పత్తినీ నేను రుచి చూసి, సెలక్ట్ చేసి, అప్రూవ్ చేస్తా..’ అంటారు రజని.
స్టాక్ మార్కెట్లో ‘షేర్’లా!
తనదైన రీతిలో దూసుకుపోతోన్న మిసెస్ బెక్టార్ ఇటీవలే స్టాక్మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్)కి వెళ్లి రెండు గంటల్లోనే దాదాపు 200 రెట్లు సబ్స్క్రిప్షన్ దక్కించుకుంది. ఇక తాజాగా ఐపీవోలో ఒక్కో షేరును రూ. 288 చొప్పున కేటాయించారు. రూ. 501 వద్ద లిస్ట్ అయిన షేరు ధర ఒక దశలో రూ. 601 కి చేరింది. ఈ ఇష్యూ నుంచి మిసెస్ బెక్టార్ సంస్థ రూ. 540 కోట్లు సేకరించింది. దీంతో ఈ ఏడాదిలో అత్యధికంగా సబ్‌స్క్రైబ్ అయిన ఐపీవోల్లో ఒకటిగా, ఇటీవలి కాలంలో మార్కెట్లో లిస్ట్ అయిన ఉత్తమ షేరుగా కూడా పేరు తెచ్చుకుంది. లిస్టింగ్ సమయంలో ఈ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ. 3,412 కోట్లకు చేరింది.
కృషి, పట్టుదల, సవాళ్లను ఎదుర్కొనే నైజం.. ఇవే వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే అసలు సిసలైన అస్త్రాలు అని నమ్మే రజని.. ఇదే వ్యాపార దక్షతతో తన కంపెనీని అగ్రగామిగా నిలిపారు. ఆమె నమ్మిన ఈ వ్యాపార సూత్రాలు ఔత్సాహిక వ్యాపారవేత్తలకు విజయ సోపానాలు అనడంలో ఏమాత్రం సందేహం లేదు!