Photos: Twitter
యుద్ధభూమిలో అడుగుపెట్టే తన భర్త నుదుటిపై వీరతిలకం దిద్ది ‘విజయీభవ’ అంటూ సాగనంపే మహిళలు నాటి చరిత్రలోనే కాదు.. నేటి ఆధునిక కాలంలోనూ ఉన్నారు. దేశ రక్షణే ధ్యేయంగా సరిహద్దులకు కదిలే తమ భర్తలు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కాంక్షిస్తూ వారి రాక కోసం కళ్లల్లో వత్తులేసుకొని ఎదురుచూసే భార్యామణులెందరో! అంతేకాదు.. విధుల్లో వారికేదైనా జరగరానిది జరిగి వీర మరణం పొందితే వారి ఆశయాన్ని తమ ఊపిరిగా భావించి యుద్ధ రంగంలోకి దిగే సతీమణులూ ఉన్నారు. గరిమా అబ్రోల్ కూడా ఆ కోవకు చెందిన వారే!
గతేడాది ఫిబ్రవరిలో ఓ యుద్ధ విమానాన్ని పరీక్షిస్తోన్న క్రమంలో జరిగిన ప్రమాదంలో వీరమరణం పొందిన సమీర్ అబ్రోల్ సతీమణి అయిన గరిమ.. తొలుత తన భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇలా బాధపడుతూ కూర్చోవడం కంటే ఆయన అడుగుజాడల్లో నడిచి తన ఆశయాన్ని నెరవేర్చాలని ఆ క్షణమే కంకణం కట్టుకున్నారు. అనుకున్న మాట ప్రకారమే తాజాగా శిక్షణ పూర్తి చేసుకున్న గరిమ.. త్వరలోనే ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా విధుల్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ వీర వనిత గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..
అది 2019, ఫిబ్రవరి 1. స్క్వాడ్రన్ లీడర్ సమీర్ అబ్రోల్ మరో స్క్వాడ్రన్ లీడర్ సిద్ధార్థ నేగితో కలిసి బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వేదికగా ‘మిరాజ్ 2000’ అనే ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ని పరీక్షించడానికి సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలో ఎయిర్‌క్రాఫ్ట్‌ని టేకాఫ్ చేస్తోన్న సమయంలో అది పేలిపోవడంతో ఈ ఇద్దరు ఆఫీసర్లు ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఎయిర్‌క్రాఫ్ట్ క్రాష్‌లో తన భర్త వీర మరణాన్ని భరించలేకపోయింది గరిమ. దేశ రక్షణ కోసం వెడుతున్నాడు.. ఏమవుతుందో అన్న భయం గుండెలో ఉన్నా.. ఉదయాన్నే ఓ కప్పు కాఫీ ఇచ్చి ధైర్యంగా విధులకు సాగనంపిన భర్త ఇక తిరిగి రాడని తెలిసి కన్నీరు మున్నీరైంది. అయినా ఓ వీర సైనికుడి భార్యగా తన బాధను దిగమింగుకుంది.. గుండెల నిండా ధైర్యాన్ని కూడగట్టుకుంది. తన భర్త అడుగుజాడల్లో నడవడమే ఆయనకిచ్చే అసలైన నివాళి అని నిర్ణయించుకుంది.
భర్త స్థానాన్ని భర్తీ చేయాలని..!
అయితే అప్పటిదాకా ఫిట్నెస్ ట్రైనర్‌గా, డ్యాన్స్ ట్రైనర్‌గా కొనసాగిన గరిమ.. తన భర్త మరణంతో తన ఆశయాన్ని మార్చుకుంది. ఈ క్రమంలో భారత వాయుసేనలో చేరాలని నిర్ణయించుకుందామె. అందుకోసం గతేడాది జులైలో సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) పరీక్ష రాసి అందులో ఉత్తీర్ణత సాధించింది. ఇక ఈ ఏడాది జనవరిలో దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణలో చేరిన గరిమ.. సుమారు 11 నెలల పాటు శిక్షణ తీసుకుంది. ఇటీవలే ప్రొఫెషనల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఈ వీర వనిత.. త్వరలోనే ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా విధుల్లో చేరనుంది.
ఇదే విషయాన్ని రక్షణ శాఖ తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. తన భర్తతో ఉన్న ఫొటోతో పాటు శిక్షణలో ఉన్న గరిమ ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసిన రక్షణ శాఖ.. ‘మిస్ గరిమా అబ్రోల్ ఇప్పుడు ఫ్లైయింగ్ ఆఫీసర్ గరిమా అబ్రోల్ అయ్యారు. విమాన ప్రమాదంలో మరణించిన దివంగత స్క్వాడ్రన్ లీడర్ సమీర్ అబ్రోల్ భార్య అయిన ఆమె ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్నారు. మనందరికీ ఆమె నిజమైన మార్గదర్శి!’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. తాజాగా శిక్షణ పూర్తి చేసుకున్న 114 మంది ఫ్లైట్ క్యాడెట్స్ లో గరిమ ఒకరు.
ఆ భయం ప్రతి సైనికుడి భార్యకూ ఉండేదే!
దేశ రక్షణ కోసం విధుల్లోకి వెళ్లే భర్తను చిరునవ్వుతో సాగనంపినా.. తనకెప్పుడు ఏమవుతుందోనని భార్య అనుక్షణం భయపడుతూనే ఉంటుందని.. తననీ ప్రతి క్షణం అదే భయం వెంటాడేదని అంటోంది గరిమ. తన భర్త మరణించిన తొలినాళ్లలో ఓ వీర సైనికుడి భార్యగా తీరని శోకంతో ఆమె పెట్టిన పోస్ట్ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘నా భర్త దేశం గర్వించదగ్గ వీర సైనికుడు.. రోజూ ఉదయాన్నే కప్పు కాఫీ ఇచ్చి.. గుండెల నిండా ధైర్యం నింపుకొని అతడిని విధుల్లోకి పంపేదాన్ని. ఈ క్రమంలో ఓవైపు సంతోషంగా, గర్వంగా ఉన్నా.. మరోవైపు మనసులో మాత్రం ఏదో తెలియని భయం వెంటాడేది! ఇలాంటి భయం ప్రతి సైనికుడి భార్యకూ ఉండేదే! నా భర్తకు ఏమీ కాకూడదని అనుక్షణం తలచుకుంటూనే నిద్రపోయేదాన్ని.. అయినా ఏవేవో పీడకలలతో రాత్రుళ్లు ఏడుస్తూ నిద్రలేచిన సందర్భాలు ఎన్నో! ఆ సమయంలో సమీర్ నన్ను ఓదార్చేవాడు. నాకు ధైర్యం చెప్పేవాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నేను ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలని కోరుకునేవాడు. ఆ ధైర్యంతోనే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలని, నా భర్త ఆశయాన్ని నెరవేర్చాలని నిర్ణయించుకున్నా..’ అంటూ తన మనసులోని ఆవేదనను పంచుకుంది గరిమ.
దేశ రక్షణ విధుల్లో భాగంగా వీర మరణం పొందిన తన భర్త ఆశయాన్ని నెరవేర్చడానికి పూనుకొని.. తర్వలోనే ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా విధుల్లో చేరనున్న గరిమ ధైర్యానికి, స్ఫూర్తికి సలామ్ చేయాల్సిందే!