Photo: Twitter
అపర కోటీశ్వరురాలైన ఆమెది ప్రపంచంలోని ధనిక మహిళల్లో అగ్రస్థానం. ప్రపంచ సంపన్ను్ల్లో పద్దెనిమిదో స్థానం. సాధారణంగా ఇలాంటి స్థానంలో ఉన్న చాలామంది తమ సంపదను మరింత పెంచుకునేందుకు కృషి చేస్తారు. కానీ మంచి మనసున్న ఆమె తన కోసం కాకుండా నలుగురి కోసం ఆలోచించింది. అందుకే నాలుగు నెలల్లో ఏకంగా రూ.29,440కోట్లను విరాళాలుగా అందించింది. తన దాతృత్వంతో కరోనా కారణంగా దెబ్బతిన్న కోట్లాది మందిని ఆదుకుంది. ఆమె ఎవరో కాదు....అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ స్కాట్.
అత్యంత ధనిక మహిళగా!
పాతికేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ గతేడాదే విడాకులు తీసుకున్నారు జెఫ్ బెజోస్-మెకంజీ స్కాట్. భార్యాభర్తలుగా విడిపోయినా తమ మధ్య స్నేహం కొనసాగుతుందని ఈ జంట స్పష్టం చేసింది. ఈక్రమంలో భరణం కింద అమెజాన్‌లో స్కాట్‌కు 4 శాతం వాటాలు లభించాయి. ఇక విడాకుల సమయంలోనే తన సంపదలో అత్యధిక భాగాన్ని వితరణకు వెచ్చించేందుకు వీలుగా రూపొందించిన వీలునామాపై సంతకం కూడా చేసింది మెకంజీ. ఇక లాక్డౌన్ కాలంలో అమెజాన్ షేర్ల ధర భారీగా పెరగడంతో మెకంజీ సంపద కూడా మూడింతలు పెరిగి 60.7 బిలియన్లకు చేరుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ విడుదల చేసిన నివేదికలో ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళగా గుర్తింపు పొందిందీ రిచెస్ట్ వుమన్.
4నెలల్లో 4.1 బిలియన్ డాలర్లు!
కరోనా కారణంగా అమెరికాతో పాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. ఈక్రమంలో నష్టపోయిన రంగాలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు సైతం పలు చర్యలు తీసుకుంటున్నాయి. అదేవిధంగా పెద్ద మనసున్న కొందరు సెలబ్రిటీలు తమవంతు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈనేపథ్యంలో కొవిడ్ కారణంగా నష్టపోయిన అమెరికన్ మహిళలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది మెకంజీ. ఇందులో భాగంగా గత 4 నెలల్లో ఫుడ్ బ్యాంకులు, ఎమర్జెన్సీ రిలీఫ్ ఫండ్స్‌కు సుమారు 4.1 బిలియన్ డాలర్లను విరాళంగా అందించింది. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.29,440 కోట్లను ఆమె దానం చేసిందన్నమాట! అంతకుముందు జులైలో ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సమానత్వం.. తదితర అంశాలకు మద్దతుగా 1.7 బిలియన్ డాలర్లను వెచ్చించింది.
‘కరోనా మహమ్మారి కారణంగా అమెరికన్ల జీవితాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు మహిళల జీవితాన్ని మరింత దుర్భరంగా మార్చాయి. అదే సమయంలో బిలియనీర్ల సంపద మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. ఈక్రమంలో పేదవారికి ఆహార భద్రత కల్పించే దిశగా, జాతి వివక్షను పారద్రోలేందుకు కృషి చేస్తున్న సుమారు 6,500 ఆర్గనైజేషన్లను పరిగణనలోకి తీసుకున్నాం. వాటిలో 383 గ్రూపులకు విరాళాలు అందజేశాం. అందులో ఉన్నత విద్యా సంస్థలు, ట్రైబల్ కాలేజీలు, యూనివర్సిటీలు, ఫుడ్ బ్యాంకులతో పాటు చిన్న చిన్న స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి..’ అని ఈ సందర్భంగా తన బ్లాగులో రాసుకొచ్చారు మెకంజీ.
ఇదే మొదటిసారి!
పెద్ద మనసున్న మెకంజీ ఈ ఏడాదిలో 6 బిలియన్ డాలర్ల మేర విరాళాలు ఇచ్చినట్లు రాక్ఫెల్లర్ ఫిలాంత్రపీ అడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెలిసా బెర్మన్ తెలిపారు. ‘ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తం 6 బిలియన్ డాలర్లను విరాళమిచ్చారు మెకంజీ. ఓ వ్యక్తి ఒకే ఏడాదిలో ఇంత సంపదను దానం చేయడం ఇదే మొదటిసారి. ఆహారం, జాతి, వివక్ష, పేదరికం.. తదితర అంశాలకు ప్రాధాన్యమిస్తూ ఆమె నిధులను విడుదల చేస్తున్నారు. అంతేకాదు, తన సంపదని మరింత వేగంగా విరాళాల రూపంలో ఇవ్వడానికి సరైన ప్రణాళికలు రూపొందించమని తన సిబ్బందిని కోరుతున్నారు’ అని చెప్పుకొచ్చారు మెలిసా బెర్మన్.
అపర కోటీశ్వురురాలయిన మెకంజీ తన కోసం కాకుండా నలుగురి కోసం అలోచించారు. అందుకే కరోనాతో అల్లాడుతోన్న ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో అవసరార్థులకు వేలాది కోట్ల సంపదను విరాళంగా ఇస్తున్నారు. ఇలా తన పెద్ద మనసును చాటుకుంటూ అందరి మన్ననలు అందుకుంటున్నారు.