ఉద్యోగాలు చేయడమే కాదు.. వ్యాపారం, రాజకీయం, వినోదం.. ఇలా ఏ రంగంలోనైనా రాణించగలం.. మా శక్తి సామర్థ్యాలతో అద్భుతాలు సృష్టించగలం..’ అని నిరూపిస్తున్నారు చాలామంది మహిళలు. ఇలా అటు తమ తమ రంగాల్లో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతూనే.. ఇటు మనందరికీ స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్నారు. తమ శక్తి సామర్థ్యాలను ప్రపంచం గుర్తించేంత స్థాయికి చేరుకుంటున్నారు. అలాంటి మహిళల్ని ఒక్క చోట చేర్చి ‘అత్యంత శక్తిమంతమైన మహిళలు’గా ఏటా గుర్తిస్తుంది ఫోర్బ్స్ పత్రిక. అలా ఈ ఏడాది విడుదల చేసిన వందమందితో కూడిన ఈ జాబితాలో నలుగురు భారతీయ వనితలు చోటు దక్కించుకున్నారు. మన దేశంలో పూర్తి స్థాయి తొలి మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించిన నిర్మలా సీతారామన్ వరుసగా రెండోసారి అత్యంత శక్తిమంతమైన మహిళగా నిలవడం విశేషం.

కమలా హ్యారిస్
అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు ఇండో-అమెరికన్ కమలాదేవి హ్యారిస్. ఇటీవలే ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవి చేజిక్కించుకొని.. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మహిళగా, తొలి నల్ల జాతీయురాలిగా, తొలి ప్రవాస భారతీయురాలిగా ఎన్నెన్నో ప్రత్యేకతల్ని సొంతం చేసుకున్నారామె. చెన్నైకి చెందిన శ్యామలా గోపాలన్ - జమైకాకు చెందిన డొనాల్డ్ హ్యారిస్ దంపతులకు జన్మించిన కమల.. సందర్భం వచ్చినప్పుడల్లా తన భారతీయ మూలాలను నెమరు వేసుకుంటూ మురిసిపోతుంటారు.
చదువుకునే రోజుల్లోనే విద్యార్థి నాయకురాలిగా పోటి చేసిన ఈ ఇండో అమెరికన్.. చదువు పూర్తి చేసిన తర్వాత క్యాలిఫోర్నియాలోని అలమెడా కౌంటీకి డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా పని చేశారు. శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో కెరీర్ క్రిమినల్ యూనిట్లో మేనేజింగ్ అటార్నీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై శాన్ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీ జనరల్‌గా రెండు పర్యాయాలు ఎన్నికై సమర్థంగా తన బాధ్యతలు నిర్వహించారు కమల. 2003లో ఆ పదవి చేపట్టిన కమల 2011 వరకు అందులోనే కొనసాగారు. ఆపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు. ఈ సమయంలో ఆమె చిన్నారుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. ఇక 2017లో క్యాలిఫోర్నియా సెనేటర్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. తద్వారా కరోల్ మోస్లే తర్వాత అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో అడుగుపెట్టిన తొలి నల్ల జాతీయురాలిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన ‘వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల’ జాబితాలో ముచ్చటగా మూడో స్థానం దక్కించుకొని తన శక్తిని మరోసారి ప్రపంచానికి చాటారు కమల.

నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
ఇందిరా గాంధీ తర్వాత దేశ ఆర్థిక మంత్రిగా పదవి చేపట్టిన తొలి మహిళగా సరికొత్త చరిత్రను లిఖించారు నిర్మలా సీతారామన్. అంతేకాదు.. దేశానికి పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న తొలి మహిళ కూడా నిర్మలమ్మే! 2019లో ఈ పదవి చేపట్టిన ఆమె.. ప్రస్తుతం కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగానూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత రెండేళ్లుగా తాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో దాదాపు అన్ని వర్గాల వారికి పెద్ద పీట వేసిన ఆమె.. ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పడేసే దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక గతంలో తొలి మహిళా రక్షణ మంత్రిగా సేవలందించిన కీర్తిని తన సొంతం చేసుకున్న నిర్మలమ్మ.. చదువుకునే రోజుల్లోనే ఓ గృహోపకరణాల స్టోర్‌లో సేల్స్ గర్ల్‌గా చేరారు. ఆ తర్వాత యూకేలోని ‘అగ్రికల్చరల్ ఇంజినీర్స్ అసోసియేషన్’లో ఒక ఆర్థికవేత్తకు అసిస్టెంట్‌గా వ్యవహరించారు.. ‘బీబీసీ వరల్డ్ సర్వీసెస్’లోనూ తనదైన ముద్ర వేశారు.. ‘నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్’లో సభ్యురాలిగా కూడా కొనసాగారీ లేడీ ఎకనమిస్ట్. ఇలా భారత ఆర్థికమంత్రిగా తనదైన ముద్ర వేస్తోన్న నిర్మలమ్మ తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన ‘వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల’ జాబితాలో 41వ స్థానంలో నిలిచారు. గతేడాది కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారీ మహిళా ఆర్థిక మంత్రి.

రోష్నీ నాడార్, హెచ్‌సీఎల్ ఛైర్పర్సన్
కొన్ని నెలల క్రితమే తన తండ్రి శివ్‌నాడార్ నుంచి హెచ్‌సీఎల్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు రోష్నీ నాడార్. టెక్నాలజీ రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకుంటూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తోన్న ఆమె రూ.54,850 కోట్ల సంపదతో ఇటీవలే ‘కోటక్ వెల్త్ హురున్ - లీడింగ్ వెల్దీ ఉమెన్ 2020’ జాబితాలో దేశంలోనే అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. కెరీర్ ప్రారంభంలో లండన్‌లోని స్కై న్యూస్ ఛానల్, సీఎన్‌బీసీ, సీఎన్ఎన్ తదితర ఇంగ్లిష్ న్యూస్ ఛానళ్లలో న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారామె. ఆ తర్వాత హెచ్‌సీఎల్‌లో ఓ సాధారణ ఉద్యోగినిగా చేరి ఏడాదిలోనే సీఈఓ/ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఈ ఏడాది జులైలో కంపెనీ ఛైర్‌పర్సన్‌గా పూర్తిస్థాయి పగ్గాలు స్వీకరించారు రోష్నీ. దీంతో పాటు ప్రస్తుతం ‘శివ్ నాడార్ ఫౌండేషన్’ ట్రస్టీగా కూడా కొనసాగుతున్నారామె. దీని ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రమాణాలను అందిస్తున్నారు. ఇక తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో 55వ స్థానంలో కొనసాగుతున్నారీ బిజినెస్ ఉమన్.

కిరణ్ మజుందార్-షా, బయోకాన్ సీఎండీ
భారత బయోటెక్ క్వీన్‌గా పేరుపొందారు బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్-షా. 70 దశకంలో చిన్న సంస్థగా ప్రారంభమైన బయోకాన్ నేడు భారత్‌లోనే అతి పెద్ద బయో ఫార్మా కంపెనీగా రూపుదిద్దుకుందంటే.. అందుకు కిరణ్ వ్యాపార దక్షత, పట్టుదలే కారణం. ప్రస్తుతం ఆ సంస్థ ఛైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్న ఆమె.. దేశంలోనే అత్యంత సంపన్నమైన మహిళల్లో ఒకరిగా కొనసాగుతున్నారు.
రూ.36,600 కోట్లతో ఇటీవలే ‘కోటక్ వెల్త్ హురున్ - లీడింగ్ వెల్దీ ఉమెన్ 2020’ జాబితాలో రెండో స్థానం సొంతం చేసుకున్నారీ బయో క్వీన్. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌కు విరుగుడుగా ఈ సంస్థ తయారుచేసిన ‘ఇటోలీజుమాబ్’ వ్యాక్సిన్ నాలుగో దశ ప్రయోగాలకు ఇటీవలే అనుమతులు లభించడం విశేషం. ఇక తన సేవా కార్యక్రమాల్లో భాగంగా బెంగళూరులో నెలకొల్పిన ‘కిరణ్ మజుందార్-షా మెడికల్ సెంటర్’ వేదికగా క్యాన్సర్ చికిత్సను అందుబాటు ధరల్లో అందరికీ చేరువ చేస్తున్నారు కిరణ్. తాజాగా ఫోర్బ్స్ ప్రకటించిన వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో 68వ స్థానాన్ని ఆక్రమించారామె.
ఇక ప్రతిసారిలాగే ఈసారి కూడా జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవగా, న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ 32వ స్థానం దక్కించుకున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో విజయం సాధించిన దేశ సారథిగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఆమె పేరు మార్మోగిందని చెప్పచ్చు. కాగా, బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 46వ స్థానంలో, ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ 85వ స్థానంలో కొనసాగుతున్నారు. తన దేశం కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో సనా కూడా సఫలీకృతురాలయ్యారు.
Photo: Instagram