Photo: Instagram
భవిష్యత్తుపై బోలెడు ఆశలు పెట్టుకున్న ఆమెను 22 ఏళ్లకే విధి వెక్కిరించింది. ఒంటికాలితో జీవితాన్ని అంధకారం చేయాలనుకుంది. అయితే కష్టాలు, కన్నీళ్లు ఆమెను మరింత కఠినంగా మార్చాయి. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని అందించాయి. అందుకే కృత్రిమ కాలితోనే బ్యాడ్మింటన్ రాకెట్ పట్టుకుని బరిలోకి దిగింది. మొండి పట్టుదలతో పతకాల జోరు కొనసాగించింది. ఆమే పారా అథ్లెట్ మానసి జోషి. ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు’ అన్న మాటలకు కచ్చితమైన ఉదాహరణగా నిలిచే మానసి.. సరిగ్గా నిల్చోవడానికి కాలు లేకపోయినా పారా బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. దేశానికి పతకాల పంట పండిస్తోంది. తన పోరాట స్ఫూర్తితో ఎంతోమంది అమ్మాయిలు, తనలాంటి దివ్యాంగుల్లో స్ఫూర్తి నింపుతోంది.
ఆరేళ్ల వయసులోనే రాకెట్ పట్టుకుంది!
మానసి తండ్రి గిరీష్ చంద్ర జోషి స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్. దీంతో ఆయనతో కలిసి ఆరేళ్ల వయసులోనే రాకెట్ పట్టుకుంది మానసి. ఉన్నత చదువులు చదువుతూనే క్రీడల్లోనూ రాణించింది. ముంబయిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ర్టానిక్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగినిగా కెరీర్ ఆరంభించింది. అయితే ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదానికి గురైంది మానసి. 2011 డిసెంబర్ 2న ద్విచక్రవాహనంపై ఆఫీసుకు వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఆమె కింద పడిపోవడం, ఎడమకాలిపై నుంచే లారీ వెళ్లడంతో ఆ కాలు పూర్తిగా ఛిద్రమైంది. ఆస్పత్రికి తీసుకెళ్లే సరికి మరింత ఆలస్యం కావడంతో వైద్యులు ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. మొత్తం 45 రోజుల పాటు ఎన్ని చికిత్సలు చేసినా ఎడమకాలిని మాత్రం తిరిగి పొందలేకపోయిందీ పారా అథ్లెట్.
కృత్రిమ కాలితో!
విధి ఆమె ఎడమకాలిని తీసుకెళ్లి తన బంగారు భవిష్యత్తుకు అడ్డుపుల్ల వేసింది. దీంతో చాలా రోజుల పాటు నాలుగ్గోడలకే పరిమితమైపోయింది మానసి. అయితే అలాగే ఉంటే లాభం లేదనుకుంది. ఆత్మవిశ్వాసంతో కఠిన పరిస్థితులను అధిగమించాలనుకుంది. ఓ ప్రోస్థెటిక్ కాలును అమర్చుకొని తనకు ఇష్టమైన బ్యాడ్మింటన్‌పై ఆసక్తి పెంచుకుంది. ఈ క్రమంలో మొదట తన తండ్రితో కలిసి సాధన చేసింది. ఆ తర్వాత ఓ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రోత్సాహంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. 2018లో హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేరి తన ఆటకు మరిన్ని మెరుగులు దిద్దుకుంది. పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నీతో పాటు ఎన్నో అంతర్జాతీయ పతకాలు సాధించింది. తన ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, పురస్కారాలు కూడా సొంతం చేసుకుంది.
2020ని మర్చిపోలేను!
తన ప్రతిభతో ఎంతోమంది అమ్మాయిలకు, తన లాంటి దివ్యాంగులకు ఆదర్శంగా నిలుస్తోంది మానసి. ఈక్రమంలో తన కాలితో పాటు తన కలలను చిదిమేసిన ఆ రోడ్డు ప్రమాదం జరిగి తొమ్మిదేళ్లు గడిచాయి. సరిగ్గా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి ముందు రోజే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా తన జీవితంలోని చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసింది మానసి. ‘తొమ్మిదేళ్ల క్రితం (డిసెంబర్ 2, 2011) జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నేను ఓ కాలు కోల్పోయాను. యాదృచ్ఛికంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి ముందు రోజే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరం. అప్పటి నుంచి నా జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయో తెలుసుకునేందుకు ఏటా ఈ రోజున నాకంటూ కొంచెం సమయం కేటాయించుకుంటాను. ఇక 2020 నా జీవితంలో మరిచిపోలేని సంవత్సరం. ఈ ఏడాది నాకెంతో గుర్తింపును తీసుకొచ్చింది. జీవితం, కుటుంబ బాంధవ్యాల దగ్గర్నుంచి కొవిడ్ వరకు ఎన్నో కొత్త విషయాల గురించి తెలుసుకున్నాను.’
లాక్డౌన్లో ఆ రెండూ బాగా నేర్చుకున్నాను!
‘ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు (డిసెంబర్ 3) రాష్ట్రపతి చేతుల మీదుగా ‘ఉత్తమ పారా అథ్లెట్’గా జాతీయ పురస్కారం అందుకున్నాను. ఈ ఏడాది ప్రారంభంలో పలు మీడియా సంస్థలు నన్ను ‘పారా అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’గా గుర్తించాయి. లాక్‌డౌన్‌కు ముందు ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్-2019’ అవార్డుకు నామినేట్ అయ్యాను. ఇక కొవిడ్ కారణంగా మూడేళ్ల తర్వాత మళ్లీ నా కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం దొరికింది. ఈ ఖాళీ సమయంలో నా తోబుట్టువులతో కలిసి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. అందరం ఒక సమూహంగా ఏర్పడి కొత్త ఆటలు నేర్చుకున్నాం. పుస్తకాలు చదవడం, అందంగా ఫొటోలు-వీడియోలు తీయడం, ఆన్లైన్ సెషన్స్, ఇంటర్వ్యూలు, గార్డెనింగ్, క్లీనింగ్.. లాంటి అంశాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు సోషల్ మీడియా ట్రెండ్స్‌ను ఫాలో అయ్యాం. అంతేకాదు.. నేను సైక్లింగ్, రన్నింగ్ బాగా నేర్చుకున్నాను.’
కచ్చితంగా ఆ లైఫ్‌నే ఎంచుకుంటాను!
‘నిజం చెప్పాలంటే... ఈ ఏడాది నాకోసం ఇంకెన్ని విశేషాలు మోసుకొస్తుందో తెలియడం లేదు. ప్రఖ్యాత టైమ్ పత్రిక నవతరం నాయకత్వ లక్షణాలున్న మేటి మహిళగా, ఆసియాలోని ప్రభావశీలురైన వ్యక్తుల్లో ఒకరిగా నన్ను గుర్తించింది. అంతేకాదు అక్టోబర్‌లో ఆసియా ఎడిషన్ కవర్ పేజీని నా ముఖచిత్రంతో ముద్రించింది. ఆ తర్వాత బార్బీడాల్ షీరోస్ సంస్థ నా పోలికలతో ఒక బార్బీ బొమ్మను రూపొందించి.. అత్యంత ప్రభావశీలురైన మహిళల్లో ఒకరిగా స్థానం కల్పించింది. ఇక నవంబర్‌లో బీబీసీ విడుదల చేసిన 100 మంది అత్యంత స్ఫూర్తిదాయకమైన, ప్రభావశీలురైన మహిళల్లో నా పేరు కూడా ఉంది. కరోనా కారణంగా క్రీడలకు బ్రేక్ పడింది. కానీ నాకు మాత్రం ఈ ఏడాది చివరి రెండు నెలలు జీవితానికి సరిపడా గుర్తింపును తీసుకొచ్చాయి. కానీ ఒకసారి నా గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటే... తొమ్మిదేళ్ల క్రితం జరిగిన ప్రమాదం నుంచి ఎంత దూరం వచ్చానో నాకు అర్థమవుతోంది. సాధారణంగా తొమ్మిదేళ్లు అంటే ఎంతో ఎక్కువ సమయమని చాలామంది భావించొచ్చు. అయితే ‘యాక్సిడెంట్‌కు ముందు, తర్వాత... ఈ రెండింటిలో మీరు ఏ లైఫ్‌ను ఎంచుకుంటారు?’ అని ఎవరైనా అడిగితే కచ్చితంగా యాక్సిడెంట్‌కు ముందు గడిపిన జీవితాన్నే ఎంచుకుంటాను..’ అని తన సుదీర్ఘ పోస్ట్‌లో రాసుకొచ్చింది మానసి.