కౌన్ బనేగా కరోడ్‌పతి... 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ షోకు నేటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ బుల్లితెర కార్యక్రమంలో పాల్గొనాలని, హాట్ సీట్ వరకు చేరుకోవాలని ఎంతోమంది ప్రయత్నిస్తారు. ఈ షో ద్వారా వచ్చిన పేరు, ప్రైజ్ మనీతో తమ కలలను సాకారం చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఆ అదృష్టం కొందరికే దక్కుతుంది. అలాంటి వారిలో ఒకరు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అనూపాదాస్. వృత్తిరీత్యా టీచర్ అయిన ఆమె ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి అంటే గత 20 ఏళ్లుగా దీనిలో పాల్గొనాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తాజాగా తన కలను సాకారం చేసుకోవడమే కాకుండా ఏకంగా కోటి రూపాయలు గెలుచుకుంది.
ముచ్చటగా మూడో కోటీశ్వరురాలు!
ఇప్పటికే 11 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న కేబీసీ తాజా సీజన్ సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమైంది. కరోనా ఆంక్షల కారణంగా షో చరిత్రలో మొదటిసారిగా ఆన్లైన్ ఆడిషన్స్ నిర్వహించి కంటెస్టెంట్లను ఎన్నుకున్నారు. బుల్లితెర ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ గేమ్ షోలో కోటి రూపాయలు గెలుచుకోవాలంటే ట్యాలెంట్‌తో పాటు కాసింత అదృష్టం కూడా కలిసి రావాలి. ఈ క్రమంలో తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ ఈ సీజన్ ప్రారంభమైన కొద్ది రోజుల వ్యవధిలోనే ముగ్గురు మహిళలు కోటి రూపాయలు గెలుచుకున్నారు. ముందుగా దిల్లీకి చెందిన నజియా నసీమ్ కోటి రూపాయలు గెలుచుకుని తాజా సీజన్లో కోటీశ్వరురాలిగా నిలిచిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత జమ్మూకశ్మీర్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ మోహితా శర్మ రెండో కోటీశ్వరురాలిగా నిలిచింది. తాజాగా ముచ్చటగా మూడో కోటీశ్వరురాలిగా ఆ జాబితాలో చేరింది అనూపాదాస్.

20 ఏళ్ల కల సాకారం!
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా జగ్దల్పూర్కు చెందిన అనూప ఓ సాధారణ టీచర్. పెళ్లయిన కొన్ని నెలలకే భర్తతో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ వారి బాగోగులు చూసుకుంటోంది. ఇక కేబీసీ అంటే అమితాసక్తి చూపే ఆమె గత 20 ఏళ్లుగా ఈ గేమ్ షోలో పాల్గొనాలని ప్రయత్నిస్తోంది. మెదడుకు పదును పెట్టే ఈ కార్యక్రమాన్ని చూస్తే ఆలోచనా జ్ఞానం పెరుగుతుందని తన విద్యార్థులకు కూడా బోధిస్తోంది. ఈసారి ఎలాగైనా కేబీసీలో పాల్గొనాలని డిసైడ్ అయిన అనూప ఆత్మవిశ్వాసంతో అన్ని రౌండ్లను పూర్తి చేసి హాట్ సీట్ వరకు చేరుకుంది. ఆ తర్వాత అమితాబ్ అడిగిన ప్రశ్నలకు చకచకా సమాధానాలు చెబుతూ కోటి రూపాయల ప్రశ్నకు చేరువైంది.
ఇందులో భాగంగా ‘లడాఖ్ లోని రేజంగ్లా అనే ప్రాంతంలో 1962 నవంబర్ 18న అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ‘పరమవీర చక్ర’ పురస్కారం అందుకున్నది ఎవరు? అనే కోటి రూపాయల ప్రశ్నను ఆమెకు సంధించారు అమితాబ్. ఈ ప్రశ్నకు ఎ)మేజర్ ధన్సింగ్ థాపా బి) లెఫ్టినెంట్ కల్నల్ ఎ.బి. తారాపోర్ సి)సుబేదార్ జోగిందర్ సింగ్ డి) మేజర్ షైతాన్ సింగ్ అనే పేర్లను ఆప్షన్లుగా ఇచ్చారు. ఈ ప్రశ్నకు తనకున్న చివరి లైఫ్ లైన్‌ను వినియోగించుకున్న అనూప మేజర్ షైతాన్ సింగ్ అనే సమాధానం చెప్పి కోటి రూపాయలు సొంతం చేసుకుంది.

మా అమ్మకు మెరుగైన వైద్యం చేయిస్తాను!
షోలో భాగంగా గెలుచుకున్న డబ్బుతో ఏం చేస్తావని అనూపను అడిగాడు అమితాబ్. దీనికి ఆమె ఇచ్చిన సమాధానం బిగ్‌బీతో పాటు అందరినీ కట్టిపడేసింది. ‘నేను ఓ సాధారణ టీచర్ని. పెళ్లయిన కొన్ని నెలలకే విడాకులు తీసుకున్నాను. ప్రస్తుతం నా తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నాను. నాకు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వారి భర్తలు నన్ను సొంత తోబుట్టువులా చూసుకుంటున్నారు. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటున్న సమయంలో గతేడాది మా అమ్మకు స్టేజ్-3 క్యాన్సర్ సోకిందని నిర్ధారితమైంది. దీంతో అమ్మకు వైద్యం చేయించడం కోసం తనను తీసుకుని ముంబయి వచ్చేశాను. మా వద్ద ఉన్న డబ్బులన్నీ ఆస్పత్రి బిల్లులకే ఖర్చు చేశాం. దేవుడి దయతో నేను కోటి రూపాయలు గెలుచుకున్నాను. ఈ ప్రైజ్‌మనీతో మా అమ్మను క్యాన్సర్ మహమ్మారి నుంచి కాపాడుకుంటాను’ అని చెప్పుకొచ్చింది అనూప.

అందుకే ఆ రిస్క్ చేయలేదు!
ఈ క్రమంలో వరుసగా 15 ప్రశ్నలకు సరైన సమాధానాలిచ్చి కోటి రూపాయలు గెలుచుకున్న ఈ టీచర్ తర్వాతి రౌండ్లో భాగంగా 7 కోట్ల రూపాయల ప్రశ్నను ఎదుర్కొంది.
‘వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో రియాజ్ పూనావాలా, షౌకత్ దుకాణ్వాలా ఏ దేశానికి ప్రాతినిథ్యం వహించారు’ అనే ప్రశ్నకు ఎ) కెన్యా బి) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సి) కెనడా డి) ఇరాన్ పేర్లను ఆప్షన్లుగా ఇచ్చారు. అయితే అప్పటికే లైఫ్ లైన్లన్నీ అయిపోవడంతో ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేనంటూ గేమ్ నుంచి తప్పుకుంది అనూప. అయితే క్విట్ అయ్యే ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండని అమితాబ్ ఆమెను అడిగాడు. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని సమాధానం ఇచ్చింది. అయితే అదే కరెక్ట్ ఆన్సర్ అని బిగ్‌బీ చెప్పడంతో సంతోషంతో గేమ్ నుంచి తప్పుకుంది అనూప.
‘7 కోట్ల రూపాయల ప్రశ్నను వదులుకున్నందుకు నేనేమీ బాధపడడం లేదు. నాకు క్రీడలపై అంతగా అవగాహన లేదు. దీంతో ఈ ప్రశ్నను ఎదుర్కొనే క్రమంలో కొంత ఆందోళనకు గురయ్యాను. ఒకవేళ నేను సరైన సమాధానం చెప్పకపోతే ఇప్పుడు గెలుచుకున్న ఈ డబ్బంతా పోతుంది. మళ్లీ మా అమ్మను, నా కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టివేయలేను. అందుకే రిస్క్ చేయకుండా గేమ్ నుంచి తప్పుకున్నాను. అయితే నేను అనుకున్న ఆన్సర్ సరైనదేనని అమితాబ్ చెప్పడంతో చాలా సంతోషమేసింది’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ సూపర్ వుమన్.
Photo- Screen grab