Photo: Instagram
‘లోకులు కాకులు.. అవసరం ఉన్నా లేకపోయినా ఇతరుల విషయాల్లో తలదూర్చుతుంటారు. పెళ్లి, పిల్లలు, కెరీర్.. ఇలా అన్ని విషయాల్లో నిర్ణయాధికారం వారిదే అన్నట్లుగా మాట్లాడతారు.. అయితే ఇలా ఎవరెన్ని చెప్పినా మీరు మాత్రం మీ మనసు చెప్పిందే వినండి..!’ అంటున్నారు ప్రముఖ దర్శకనిర్మాత ఫరా ఖాన్. 43 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ ద్వారా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన ఈ సెలబ్రిటీ మామ్.. వయసుకు, పిల్లల్ని కనడానికి సంబంధం లేదంటున్నారు. సైన్స్ అభివృద్ధి చెందుతోన్న ఈ కాలంలో తమకు నచ్చినప్పుడు, అందుకు మానసికంగా సిద్ధమైనప్పుడు పిల్లల్ని కనొచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో తన ఐవీఎఫ్ స్టోరీని, ఈ క్రమంలో తనకెదురైన అనుభవాలను గుదిగుచ్చి ఓ సుదీర్ఘ లేఖ రాశారామె. వర్క్-లైఫ్ బ్యాలన్స్ గురించి మహిళలందరికీ దిశానిర్దేశం చేసేలా ఉన్న ఈ లేఖ సారాంశమేంటో తెలుసుకుందాం రండి..
ఫరా ఖాన్.. బాలీవుడ్లో మేటి దర్శకనిర్మాతగా, కొరియోగ్రాఫర్‌గా పరిచయం అక్కర్లేని పేరు ఆమెది. తనకంటే 8 ఏళ్లు చిన్నవాడైన శిరీష్ కుందర్‌ను 2004లో వివాహమాడారు ఫరా. శిరీష్ కూడా ఫిల్మ్ మేకర్ కావడంతో ఇద్దరూ కలిసి ‘జానే మన్’, ‘ఓం శాంతి ఓం’, ‘తీస్ మార్ ఖాన్’.. వంటి సినిమాలకు పనిచేశారు. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత అంటే 2008లో ఐవీఎఫ్ పద్ధతిలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు (ట్రిప్లెట్స్)కు జన్మనిచ్చారామె. వీరిలో ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లున్నారు.
ఇది మన జీవితం!
అయితే ఫరా తల్లయ్యేనాటికి ఆమె వయసు 43 ఏళ్లు. ఈ క్రమంలో తాను ఐవీఎఫ్‌ను ఎంచుకోవడం, ఆలస్యంగా తల్లైతే ఈ సమాజం ధోరణి ఎలా ఉంటుంది.. తదితర విషయాల గురించి తన అనుభవాలను ఓ సుదీర్ఘ లేఖలో ప్రస్తావించారామె. మహిళలను ఉద్దేశించి రాసిన ఈ ఉత్తరంలో ఫరా ఏమన్నారంటే..
‘డియర్ విమెన్..
ఒక్కోసారి మనం మాట్లాడే మాటల కంటే మన చేతలే మనమేంటో నిరూపిస్తాయి. ఇలా మనం చేసే ప్రతి పనినీ నిర్ణయించుకునే అధికారం మనకుంది.
ఒక కూతురిగా, భార్యగా, అమ్మగా నేను ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకున్నాను. కాబట్టే కొరియోగ్రాఫర్‌గా, ఫిల్మ్ మేకర్‌గా, నిర్మాతగా ఇలా మీ ముందు నిలబడ్డా. ఈ క్రమంలో నేను వేసే ప్రతి అడుగూ నాకు సరైందే అనిపించింది.. అది నా కెరీర్ విషయంలోనైనా, లేదంటే నా కుటుంబానికి సంబంధించిన అంశమైనా.. ఇలా ప్రతి విషయంలోనూ నా మనసు చెప్పిందే విన్నాను.. దాన్నే లాక్ చేశాను. మనలో చాలామంది మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో, మనల్ని ఎలా జడ్జ్ చేస్తున్నారో అనే ఆలోచిస్తుంటారు. కానీ అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. వాటిని మర్చిపోండి.. ఎందుకంటే ఇది మన జీవితం.. మనకు నచ్చినట్లుగా మలచుకునే అధికారం మనకు తప్ప ఇంకెవరికీ లేదు.
అలాంటి వారికి అది వరం!
నేను తీసుకున్న ఒక నిర్ణయం వల్లే ఈ రోజు ఒక గొప్ప తల్లిని కాగలిగాను. ‘ఈ వయసులోనే పిల్లల్ని కనాలి..’ అన్న సమాజ ధోరణితో ఏకీభవించకుండా.. పిల్లల్ని కనడానికి సంసిద్ధమైనప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నా. అందుకు ఇప్పుడున్న ఆధునిక వైద్య పరిజ్ఞానానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నా 43 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ పద్ధతి వల్లే నేను అమ్మను కాగలిగాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా ఈ రోజుల్లో చాలామంది మహిళలు కూడా ఇతరుల మాటల్ని పట్టించుకోకుండా వారి నిర్ణయాలకే ప్రాధాన్యమిస్తున్నారు.. తద్వారా మరికొందరి ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తూ వాళ్లూ సంతోషంగా ఉండగలుగుతున్నారు. ఇటీవలే నేను ఒక టీవీ షోలో ఒక బోల్డ్ స్టేట్మెంట్ గురించి విన్నాను. ‘ఒక మహిళకు ప్రేమ లేకుండా పెళ్లి జరిగినప్పుడు.. భర్త లేకుండా తను తల్లి ఎందుకు కాకూడదు?’ అని! నిజానికి ఇందులో చాలా వరకు వాస్తవం ఉంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ అలాంటి మహిళల కలల్ని నిజం చేస్తోంది. దాత సహకారంతో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చే అవకాశం మనకుంది. అలాంటప్పుడు తల్లి కావాలనుకున్న సమయంలో ఎందుకు దాన్ని ఎంచుకోవట్లేదు?
నిజానికి మహిళల నిర్ణయాలను సమాజం గుర్తిస్తే ఒక దర్శకనిర్మాతగా నాకు అంతకంటే ఆనందం ఇంకేముంటుంది? మహిళలు తాము కావాలనుకున్నప్పుడు సహజ పద్ధతుల్లో లేదంటే మనకు అందుబాటులో ఉన్న పద్ధతుల్లో తల్లి కావచ్చు.. అలాంటి అమ్మతనం మహిళలందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. ఎప్పటికీ గుర్తు పెట్టుకోండి.. ఇది మన జీవితం.. మన నిర్ణయం!
-ఫరా ఖాన్’
అంటూ నిర్మొహమాటంగా తన మనసులోని మాటల్ని బయటపెట్టారీ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్.
నిజమే కదా మరి.. మన జీవితానికి సంబంధించిన ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే అధికారం మనకు తప్ప ఇంకెవరికి ఉంటుంది చెప్పండి. అంతేకాదు.. అమ్మయ్యే విషయంలోనూ సమాజం ఒత్తిడి చేస్తుందని కాకుండా.. మనం అందుకు సంసిద్ధమైనప్పుడే ముందుకు సాగాలని చెబుతున్నారామె. అందుకే సోషల్ మీడియాలో ఆమె పోస్ట్‌కు ‘సూపర్’ అంటూ కామెంట్లు వస్తున్నాయి. మరి, ఈ విషయం గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాలను ‘వసుంధర.నెట్’ వేదికగా పంచుకోండి.