Photo: Instagram
అమ్మ పాలు అమృతంతో సమానం. తల్లి పాలల్లో ఉండే ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు... ఇతరత్రా పోషకాలు పిల్లల రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి. వారిని బాలారిష్టాల నుంచి రక్షిస్తాయి. అందుకే బిడ్డ పుట్టినప్పటి నుంచి కనీసం ఆరు నెలల దాకా తల్లి పాలే పట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతమున్న యాంత్రిక జీవనంలో అమ్మపాలకు చాలా కొరతొచ్చి పడింది. అందుకు కారణాలు అనేకం. ఈ క్రమంలో ముంబయికి చెందిన ఓ ఫిల్మ్ మేకర్ తన బిడ్డకు అమృతమంటి పాలను అందిస్తూనే, అదనంగా ఉత్పత్తైన పాలను దానం చేసి ఆదర్శంగా నిలుస్తోంది.
పసిపిల్లలకు తల్లిపాల అవసరం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఈ రోజుల్లో తల్లి పాలకు చాలా కొరతొచ్చింది. తల్లికి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉండడం; సిజేరియన్, పోషకాహార లోపం వల్ల రొమ్ములో పాలు ఉత్పత్తి కాకపోవడం... వంటివి అందులో కొన్ని. పేరుకు ‘తల్లి పాల బ్యాంకులు’ ఉన్నా చాలామందికి వాటిపై అవగాహన ఉండడం లేదు. ఇక అమ్మ పాల నిల్వపై ఉన్న అపోహల కారణంగా చాలామంది తల్లులు తమ పిల్లలకు డబ్బా పాలు పడుతున్నారు. ఫలితంగా చాలామంది చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోయి అనారోగ్యాల బారిన పడుతున్నారు. అలాంటి పిల్లలందరికీ తల్లిగా మారింది ముంబయికి చెందిన 42 ఏళ్ల నిధి పర్మార్ హీరానందానీ. తల్లి పాల ఆవశ్యకతని గుర్తించిన ఆమె నెలలు నిండకుండానే పుట్టిన చిన్నారులు, అనారోగ్యం పాలైన పిల్లలకు తన చనుబాలను దానం చేస్తూ ప్రాణ దాతగా నిలుస్తోంది.
చనుబాలను దానం చేస్తూ!
తాప్సీ, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో గతేడాది వచ్చిన ‘శాండ్ కీ ఆంఖ్’ సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన ఈ సినిమా నిర్మాతల్లో ఒకరే నిధి పర్మార్. తొమ్మిదేళ్ల క్రితం తుషార్‌తో పెళ్లి పీటలెక్కిన ఈ ఫిల్మ్‌మేకర్ ఈ ఏడాది ఫిబ్రవరి 21న ‘వీర్’ అనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ ఆరోగ్యానికి తల్లి పాలు ఎంతో శ్రేష్ఠమైనవి అని చెప్పే ఆమె.. తన బాబుకు పుష్ఠిగా చనుబాలు పట్టేది. అయితే ఆమెలో పాల ఉత్పత్తి అధికంగా ఉండడంతో తన కొడుక్కి పాలు పట్టిన తర్వాత కూడా చనుబాలు మిగులుతుండడంతో వాటిని వృథా చేయడానికి ఆ తల్లి మనసు అంగీకరించలేదు. దీంతో ఆ పాలను అవసరమున్న చిన్నారులకు అందించాలని నిర్ణయించుకుంది. అయితే అప్పుడే లాక్డౌన్ ప్రారంభం కావడంతో బిడ్డను వదిలి బయటకు వెళ్లలేకపోయిన ఆమె ఇంటర్నెట్ ద్వారా సమీపంలోని తల్లి పాలు దానం చేసే కేంద్రాల వివరాలు తెలుసుకుంది. చివరకు ముంబయిలోని ఓ హాస్పిటల్‌లోని చిన్నారులకు పాలను దానం చేయడం ప్రారంభించింది.
3 నెలల్లో 40 లీటర్లకు పైగా!
ఈ క్రమంలో మార్చి నుంచి మే మధ్య కాలంలో సుమారు 40 లీటర్లకు పైగా చనుబాలు దానం చేసింది నిధి. ఈ క్రమంలో ఓసారి స్వయంగా ఆమె తన పాలు తాగే చిన్నారులు ఎలా ఉన్నారో చూడడం కోసం ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి పిల్లల్లో ప్రి-మెచ్యూర్ బేబీస్, తక్కువ బరువుతో పుట్టిన చిన్నారులే ఎక్కువగా ఉండడాన్ని గమనించింది. ఈ సందర్భంగా వారి దీన పరిస్థితిని చూసి వచ్చే ఏడాది (ఫిబ్రవరి 21, 2021) వరకు తన చనుబాలను దానం చేయాలని నిర్ణయించుకుంది.

నా చనుబాలను అలా వృథా చేయదలుచుకోలేదు!
‘నా బిడ్డకు పాలిచ్చాక కూడా ఇంకా పాలు మిగిలిపోతున్నాయి. వాటిని వృథా చేయకూడదనుకున్నాను. పాలు రిఫ్రిజిరేటర్లో సరిగ్గా భద్రపరిస్తే మూడు నుంచి నాలుగు నెలల వరకు నిల్వ ఉంచవచ్చని ఇంటర్నెట్లో చదివాను. అందుకే నా పాలను చనుబాలు దొరక్క ఇబ్బంది పడుతోన్న చిన్నారులకు అందించాలని నిర్ణయించుకున్నాను..
నా పాలను దానం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఎలా చేయాలన్న విషయం గురించి తీవ్రంగా ఆలోచించాను. నాకు తెలిసిన స్నేహితులు, బంధువులను అడిగాను. అందులో కొందరు నన్ను ఎగతాళి చేశారు. మరికొందరేమో చనుబాలను ఫేస్ ప్యాక్స్‌కు వాడుకోవచ్చని, వాటితో చంటి పిల్లలకు స్నానం చేయించవచ్చని, తమ పాదాలను స్ర్కబ్ చేసుకోవచ్చునని, సెలూన్లలో క్రీముల తయారీకి వినియోగించుకోవచ్చునని చెప్పారు. కానీ వారు చెప్పిన విషయాలు నాకు అసలు నచ్చలేదు. అమ్మ పాలు ఎంతో అమూల్యమైనవి. వాటిని ఇలా వ్యర్థం చేయకూడదని భావించాను. అందుకే సెలూన్లకు ఇవ్వడానికి నా మనసు అంగీకరించలేదు. దీంతో మా ఇంటికి సమీపంలో చనుబాల కేంద్రాలేమైనా ఉన్నాయా అని ఇంటర్నెట్లో శోధించాను. ఆ తర్వాత బాంద్రాలోని ఉమెన్స్ హాస్పిటల్లో పనిచేస్తోన్న నా గైనకాలజిస్టును కలిశాను. చనుబాల దానం గురించి ఆమెను అడిగాను. ముంబయిలోని ఖర్లో ఉన్న సూర్య హాస్పిటల్లో చనుబాలను దానం చేయవచ్చని నాకు సూచించారు. అప్పటి నుంచి 150 మిల్లీ లీటర్ల చొప్పున 20 పాల ప్యాకెట్లను రిఫ్రిజిరేటర్లో నిల్వ చేశాను. కానీ లాక్డౌన్ సమయం...అందులోనూ ఇంట్లో నా బిడ్డను వదిలి పెట్టి బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఆ ఆస్పత్రి నాకు మంచి సహకారం అందించింది. ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి వారే మా ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి మరీ పాల ప్యాకెట్లను తీసుకెళ్లేవారు.
ఆ మాట వినగానే చాలా సంతోషం కలిగింది!
‘ఈ క్రమంలో నేను దానం చేసిన పాలను ఎవరెవరికి ఇస్తున్నారో ప్రత్యక్షంగా తెలుసుకోవాలనుకున్నాను. అందుకోసం ఆస్పత్రి యాజమాన్యాన్ని సంప్రదించగా వారు ఒకసారి వచ్చి చూడమన్నారు. అక్కడకు వెళ్లిన నాకు ఆస్పత్రి సిబ్బంది ఓ 60 మంది పసికందులను చూపించారు. వారందరికీ నేను ఇచ్చిన పాలే పడుతున్నట్లు తెలిపారు. ఆ మాట వినగానే నా మనసుకెంతో సంతోషం కలిగింది. నా పాలతో అంతమంది పసివాళ్ల ఆకలి తీరుస్తున్నందుకు చాలా గర్వంగా అనిపించింది. ఆ పిల్లలందరికీ చనుబాలు చాలా అవసరమని, వారి కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పాలను దానం చేస్తానని ఆస్పత్రి సిబ్బందితో చెప్పాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ సూపర్ మామ్.
సాధారణంగా 42 ఏళ్ల వయసులో తల్లి అవడమే కష్టం.. అలాంటిది ఆ వయసులో అమ్మ కావడమే కాక పాలకు నోచుకుని పిల్లలకు తన చనుబాలను దానం చేస్తూ ఎంతోమంది పసికందుల ఆకలి తీరుస్తోంది నిధి పర్మార్. తన ఔదార్యంతో అమ్మ మనసెంత మధురమో అందరికీ చాటుతోంది.