Image for Representation
హిజబ్... ముస్లిం మహిళలు నలుగురిలోకి వెళ్లాలంటే తప్పక ధరించాల్సిన వస్ర్తధారణ ఇది. తలను, జుట్టును కవర్ చేస్తూ క్లాత్ చుట్టుకోవడమే ఇందులోని ప్రధానాంశం. ఇక కళ్లు మినహా ఏ ఇతర శరీర భాగం కనిపించకుండా చాలామంది ముస్లిం మహిళలు బుర్ఖా ధరించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ కట్టుబాట్ల కారణంగా చాలామంది ముస్లిం మహిళలు పోలీస్ లాంటి ఉద్యోగాల్లో చేరడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువమంది ముస్లిం మహిళలను పోలీస్ దళాల్లో చేర్చుకునేలా న్యూజిలాండ్ ప్రభుత్వం తమ పోలీస్ అధికారిక యూనిఫాంలో హిజబ్‌ను ప్రవేశపెట్టింది. ఈక్రమంలో ఇటీవల కానిస్టేబుల్‌గా విధుల్లోకి చేరిన జీనా అలీ హిజబ్ ధరించిన తొలి న్యూజిలాండ్ మహిళా పోలీస్‌గా అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది.
పోలీస్ యూనిఫాంలో హిజబ్!
ముస్లిం మహిళలు పోలీస్ దళాల్లో పనిచేయాలన్న ఉద్దేశంతో లండన్, స్కాట్లాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోని ముస్లిం మహిళా పోలీసులకు ఇప్పటికే హిజబ్ యూనిఫాంను ప్రవేశపెట్టారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా పోలీసులు 2004లోనే ఇలాంటి యూనిఫాంను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత లండన్‌లోని మెట్రోపాలిటన్ పోలీసులు 2006లో హిజబ్‌ను పోలీస్ యూనిఫాంలో భాగం చేశారు. ఇక 2016లో స్కాట్లాండ్ పోలీసులు కూడా తమ యూనిఫాంలో హిజబ్‌ను చేర్చారు. అయితే ప్రస్తుతం న్యూజిలాండ్ విషయానికొస్తే... పోలీస్ యూనిఫాంలో హిజబ్‌ను చేర్చాలని రెండేళ్ల క్రితమే ప్రతిపాదనలు వచ్చినా అది కార్యరూపం దాల్చడానికి ఇంత సమయం పట్టింది.
తొలి మహిళా పోలీస్‌గా!
ఈక్రమంలో పోలీస్ యూనిఫాంతో పాటు హిజబ్ ధరించిన తొలి న్యూజిలాండ్ మహిళా పోలీస్‌గా అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది జీనా. ఫిజీలో పుట్టిన ఆమె తాను చిన్న వయసులో ఉండగానే తన తల్లిదండ్రులు న్యూజిలాండ్ వచ్చేశారు. అక్కడే పెరిగిన జీనా డిగ్రీ వరకు చదువుకుంది. ఈ నేపథ్యంలో గతేడాది క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో సుమారు 51 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాతే పోలీస్ దళాల్లో చేరాలని గట్టిగా సంకల్పించుకుంది జీనా. అనుకున్నట్లే తన కలను సాకారం చేసుకున్న ఆమె కొద్ది రోజుల క్రితమే కానిస్టేబుల్‌గా ఎంపికైంది. తాజాగా అక్కడి పోలీసు యూనిఫాంలో హిజబ్‌కు అనుమతివ్వడంతో ఈ యూనిఫాం ధరించిన తొలి న్యూజిలాండ్ మహిళా కాప్‌గా రికార్డులకెక్కింది జీనా.
చాలా గర్వంగా ఉంది!
ఈ సందర్భంగా హిజబ్ అనుమతితో తన లాంటి మరింత మంది ముస్లిం మహిళలు పోలీస్ వ్యవస్థలో చేరతారంటోంది జీనా. ‘ఏడాది క్రితం క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 51 మంది అమాయకులు బలయ్యారు. ఆ సమయంలో నేను ఒక పోలీస్ అధికారిణిగా అక్కడి బాధితులకు అండగా నిలిచి ఉంటే బాగుండేదనిపించింది. అందుకే పోలీస్ కావాలని ఆ సమయంలోనే గట్టిగా నిర్ణయించుకున్నాను. నాలాగే మరింత మంది ముస్లిం మహిళలు పోలీసు విభాగంలో చేరాలి. ప్రజలకు సాయం చేయాలి. ఇక హిజబ్ యూనిఫాం ధరించిన మొదటి న్యూజిలాండ్ మహిళా పోలీస్‌గా గుర్తింపు పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. హిజబ్ ధరించి విధుల్లో పాల్గొనడం సరికొత్త అనుభూతినిస్తోంది. ఈ దుస్తుల డిజైన్ ప్రక్రియలో నేను కూడా భాగమైనందుకు, నా కమ్యూనిటీకి, ముఖ్యంగా మహిళలకు ప్రాతినిథ్యం వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది.’
మరికొందరు కూడా వస్తారు!
‘ఇక ప్రస్తుత పరిస్థితుల్లో సమాజానికి సహాయపడడానికి మాకు ఎక్కువ మంది ముస్లిం మహిళలు కావాలి. ఎందుకంటే చాలామంది మహిళలు వారి సమస్యల్ని పురుష పోలీసులతో చెప్పుకోవడానికి జంకుతున్నారు. అలాంటప్పుడు ఎక్కువమంది మహిళా పోలీసులుంటే వారు నిర్మొహమాటంగా తమ సమస్యలను పంచుకుంటారు. తద్వారా చాలా వరకు నేరాలను తగ్గించగలం. ఇక మా లాంటి ముస్లిం మహిళల వ్యక్తిగత అవసరాలను పరిగణనలోకి తీసుకుంటోన్న న్యూజిలాండ్ పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో నేను పోలీస్ కాలేజీలో శిక్షణ పొందుతున్నప్పుడు నా కోసం ప్రార్థన గదితో పాటు హలాల్ భోజనం ఏర్పాటుచేశారు. స్విమ్మింగ్‌కి వెళ్లేటప్పుడు లాంగ్‌స్లీవ్స్ కలిగిన స్విమ్సూట్ను కూడా అందించారు. తాజాగా హిజబ్‌ను కూడా అనుమతించారు. ఇలాంటి సంస్కరణలతో మరికొందరు ముస్లిం మహిళలు పోలీస్ వ్యవస్థలో చేరేందుకు ఆసక్తి చూపుతారు’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ లేడీ పోలీస్.