గర్భం ధరించిన క్షణం నుంచి తన చిన్నారిని ఎప్పుడెప్పుడు చేతుల్లోకి తీసుకుందామా అని ఆతృతగా ఎదురుచూస్తుంటుంది అమ్మ మనసు. అలాంటిది ఆ ముచ్చట తీరకుండానే పుట్టిన బిడ్డ పురిట్లోనే కన్నుమూస్తే ఆ తల్లి గుండె తట్టుకోగలదా?! తన కొడుకు షంషేర్‌ను కోల్పోయిన ఆ క్షణం తాము కూడా అంతకుమించిన బాధను అనుభవించామని చెబుతోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ సెలీనా జైట్లీ. మొదటి ప్రెగ్నెన్సీలో కవల అబ్బాయిలకు జన్మనిచ్చిన ఈ అందాల తారకు.. రెండోసారీ కవలలుగా మగపిల్లలే పుట్టారు. అయితే వారిద్దరూ నెలలు నిండకుండానే పుట్టడం, వారిలో ఒకరికి పుట్టుకతోనే గుండె సమస్య ఉండడంతో ఆ బాబు పురిట్లోనే కన్నుమూశాడు. ఇక మరో కొడుకు రెండు నెలల పాటు ఇంక్యుబేటర్‌లో చికిత్స పొందిన తర్వాత ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నాడు.
ఇలా తానే కాదు.. చాలామంది తల్లిదండ్రులు నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల విషయంలో తల్లడిల్లిపోతున్నారని, అయితే ఇలాంటి సమయంలో పాజిటివ్‌గా ఆలోచించడం, బిడ్డను జాగ్రత్తగా సంరక్షించుకోవడం చాలా ముఖ్యమంటోంది సెలీనా. ‘వరల్డ్ ప్రి-మెచ్యూరిటీ డే’ సందర్భంగా గతంలో తన కొడుకును కోల్పోయిన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టిందీ అందాల అమ్మ.
బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సెలీనా.. ‘సూర్యం’ సినిమాతో తెలుగు వారినీ పలకరించింది. 2001లో ‘మిస్ ఇండియా’గా అవతరించిన ఈ ముద్దుగుమ్మ.. అదే ఏడాది జరిగిన ‘మిస్ యూనివర్స్’ పోటీల్లో 4వ రన్నరప్‌గా నిలిచింది. 2011లో ఆస్ట్రియన్ వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ను వివాహమాడిన ఈ అందాల తార.. పెళ్లి తర్వాత పూర్తిగా కుటుంబానికే పరిమితమైంది. 2012లో విన్స్టన్ హాగ్, విరాజ్ హాగ్ అనే ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చినప్పట్నుంచి అమ్మగా తన పూర్తి సమయాన్ని పిల్లలతో గడపడానికే కేటాయిస్తోంది సెలీనా. ఇక 2017లో మరోసారి అమ్మయిన ఈ బాలీవుడ్ బ్యూటీకి.. ఈ క్రమంలో షంషేర్ హాగ్, ఆర్థర్ హాగ్ రూపంలో మరోసారి మగ కవలలు జన్మించారు. అయితే వీరిద్దరూ నెలలు నిండకుండానే పుట్టడం, వీరిలో షంషేర్‌కు పుట్టుకతోనే గుండె సమస్య ఉండడంతో ఆ బాబు పురిట్లోనే కన్నుమూశాడు. ఆర్థర్ రెండు నెలల పాటు ఇంక్యుబేటర్‌లో చికిత్స పొంది ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నాడు.
అది తీవ్రమైన అనారోగ్యమే.. అయినా!
అయితే ఇలా నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడమనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య అని, ఇలా పుట్టిన పిల్లల్ని కంటికి రెప్పలా కాచుకోవాలంటోంది సెలీనా. వరల్డ్ ప్రి-మెచ్యూరిటీ డే సందర్భంగా ఇదే సమస్యతో గతంలో తన కొడుకును కోల్పోయిన చేదు అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టిందీ క్యూట్ మామ్. ‘నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడం (ప్రి-మెచ్యూర్ బర్త్) అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య. అయినా పుట్టిన బిడ్డలు దీన్ని జయించగలుగుతారన్న నమ్మకమే మనలో ఆశను చిగురింపజేస్తుంది. ప్రి-మెచ్యూర్ బేబీస్‌ని ఎలా సంరక్షించుకోవాలన్న విషయంలో తల్లిదండ్రులు అప్పటికప్పుడు సన్నద్ధమై ఉండకపోవచ్చు.. అలాంటి సమయంలో తమ కుటుంబ సభ్యులు, స్నేహితులే వారికి అండగా నిలవాలి. ఇలా నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో చికిత్స పొందుతోన్న పిల్లల తల్లిదండ్రులకు నేను, పీటర్ (సెలీనా భర్త) చెప్పేది ఒక్కటే! అదేంటంటే.. నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల విషయంలో ప్రస్తుతం వారు ఎదుర్కొంటోన్న ప్రతికూలతలు ఎప్పటికీ ఉండవు.. వారూ భవిష్యత్తులో ఆరోగ్యంగా ఎదగలుగుతారు.. ఉన్నతిని సాధించగలుగుతారు! అలాంటి పిల్లల విషయంలో కంగారూ కేర్ పద్ధతి పాటించడం, తల్లి పాలివ్వడం, ప్రేమగా వారిని పొత్తిళ్లలో హత్తుకోవడం.. వంటి చిన్నపాటి జాగ్రత్తల వల్ల చిన్నారులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.
రెండు నెలల్లో కోలుకున్నాడు!
నాకు రెండోసారి కవలలు నెలలు నిండకుండానే పుట్టారు. ఆ సమయంలో షంషేర్‌కు పుట్టుకతోనే గుండెలో లోపముండడంతో వాడు పురిట్లోనే కన్నుమూశాడు. ఓవైపు ఆర్థర్ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందడం, మరోవైపు షంషేర్ చనిపోవడం.. ఇలా ఆ క్షణం మా గుండె పగిలినంత పనైంది.. ఓ తల్లిగా ఎంతగానో తల్లడిల్లిపోయాను. అయినా ఆ బాధను దిగమింగుతూ ఆర్థర్‌ను కంటికి రెప్పలా కాచుకున్నాం.. మా ఆశ, డాక్టర్ల నిరంతర కృషి ఫలితంగా వాడు రెండు నెలల్లో కోలుకున్నాడు. ఇలా నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల్లో కొంతమందికి పెరిగి పెద్దయ్యే క్రమంలో కూడా పలు అనారోగ్యాలు తలెత్తితే.. మరికొందరు సంపూర్ణ ఆరోగ్యంతో ఎదుగుతున్నారు.. ఇంకొందరేమో విన్స్టన్ చర్చిల్, ఐన్‌స్టీన్‌లా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నారు. ప్రస్తుతం నా కొడుకు ఆర్థర్ని కూడా అలాగే నలుగురిలో ఒక్కరిగా పెంచుతున్నా. అందుకు మీ అందరి ఆశీస్సులు కావాలి..’ అంటూ తన మనసులోని మాటల్ని, ఆవేదనను బయటపెట్టిందీ అందాల అమ్మ.
ఇలా ప్రి-మెచ్యూర్ బేబీస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూనే.. అలా జరగకుండా ఉండేందుకు కాబోయే తల్లులు గర్భస్థ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, డాక్టర్ల సలహాలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తోంది సెలీనా.