Image for Representation
ఎంత బాగా చదివినా పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్షలు రాయాలంటే కొంచెం ఆందోళనగా ఉంటుంది. చదువుకున్నవన్నీ జ్ఞాపకం ఉంటాయో లేదో అన్న భయం చాలామందిని వెంటాడుతుంది. అందుకే సాధారణ పరిస్థితుల్లోనే ఈ ‘అగ్ని’ పరీక్షను పూర్తి చేయాలంటే ఎంతో ఏకాగ్రత, మానసిక ప్రశాంతత అవసరం. అలాంటిది కరోనా బారిన పడిన ఓ విద్యార్థిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు హాజరైంది. ఆరోగ్య పరిస్థితి సహకరించకపోయినా ఇన్నాళ్లూ తను పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు కాకూడదంటూ అంబులెన్స్‌లో కూర్చొని మరీ పరీక్షను పూర్తి చేసింది. ఈ క్రమంలో ఆమె చూపించిన పట్టుదల పలువురి ప్రశంసలు అందుకుంటోంది.
అంబులెన్స్‌లోనే పరీక్ష!
కేరళలోని తిరువనంతపురంకు చెందిన గోపికా గోపన్ అనే విద్యార్థిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పీఎస్సీ) పరీక్షల కోసం చాలా ఏళ్ల నుంచి సిద్ధమవుతోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలన్నది తన కోరిక. అయితే జులైలో జరగాల్సిన ఈ పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో కొంచెం నిరుత్సాహానికి గురైన గోపిక ఈ లాక్డౌన్ ఖాళీ సమయాన్ని తన ప్రిపరేషన్ కోసం వినియోగించుకుంది. ఇంట్లోనే ఉంటూ పుస్తకాలతోనే కుస్తీ పట్టింది. చదివిన పాఠాలనే పునశ్చరణ చేసుకుంది. ఈ నేపథ్యంలో గతంలో వాయిదా పడిన ఈ పరీక్షలను కరోనా నిబంధనలు పాటిస్తూ జరపాలని కేరళ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఈ నిర్ణయంపై కొన్ని వర్గాల నుంచి నిరసన ఎదురైనా ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. అనుకున్నట్లుగానే కరోనా నిబంధనల మధ్య ఇటీవల పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గోపిక తన కలను సాకారం చేసుకునే సమయం ఆసన్నమైంది.
పరీక్షకు రెండు రోజుల ముందు కరోనా!
జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లు జరగవు... కొన్నిసార్లు మనకు ఊహించని పరిణామాలు కూడా ఎదురవుతుంటాయి. గోపిక విషయంలోనూ ఇదే జరిగింది. సరిగ్గా పరీక్షకు రెండు రోజుల ముందు ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారితమైంది. ఈ పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు ‘మళ్లీ ఎప్పుడైనా రాసుకోవచ్చులే’ అనుకుంటారు. కానీ గోపిక అలా అనుకోలేదు. ఇన్నాళ్లూ తను పడిన కష్టాన్ని వృథా చేసుకోదలుచుకోలేదు. అందుకే ఎలాగైనా పరీక్షకు హాజరవ్వాలనుకుంది. పీఎస్సీ అధికారులతో ఫోన్లో మాట్లాడి పరీక్ష రాయడానికి ఉన్న అవకాశాలు, సాధ్యాసాధ్యాలన్నింటినీ పరిశీలించింది.
పరీక్ష పైనే దృష్టి సారించాను!
‘అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలన్న లక్ష్యంతో చాలా ఏళ్లుగా ఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. కానీ దురదృష్టవశాత్తూ పరీక్షకు రెండు రోజుల ముందు నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా నిబంధనల నేపథ్యంలో అంబులెన్స్‌ను ఏర్పాటు చేసుకుంటే పరీక్ష రాయొచ్చని తెలుసుకున్నాను. దీంతో పరీక్ష కోసం స్వయంగా అంబులెన్స్‌తో పాటు ఒక డ్రైవర్‌ను నియమించుకున్నాం. అందులో కుర్చీ, టేబుల్‌తో పాటు పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. నేను అంబులెన్స్‌లోనే ఉంటాను కాబట్టి పీపీఈ కిట్ ధరించాల్సిన అవసరం లేదని, అయితే ముఖానికి తప్పనిసరిగా మాస్కు ఉండాలని అధికారులు సూచించారు. వైరస్ నుంచి రక్షణ పొందే క్రమంలో డ్రైవర్ మాత్రం కచ్చితంగా పీపీఈ కిట్ ధరించడంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారుల సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. పరీక్షా కేంద్రమైన పాఠశాల ముందు అంబులెన్స్‌ను నిలిపి అందులోనే పరీక్ష రాశాను. నేను ఈ పరీక్ష కోసం ముందే మానసికంగా సిద్ధమయ్యాను. అందుకే పరీక్షా వేదిక గురించి పెద్దగా ఆలోచించలేదు. కేవలం నా పరీక్ష పైనే దృష్టి సారించాను. వాహనంలో ఫ్యాన్ కూడా ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు పడకుండానే పరీక్షను పూర్తి చేశాను’ అని చెప్పుకొచ్చిందీ చదువుల తల్లి.
ఆమె సంకల్పానికి సెల్యూట్!
తన కలను సాకారం చేసుకునే క్రమంలో గోపిక చూపిన అంకిత భావాన్ని పలువురు కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఓ వార్తా పత్రికలో ప్రచురితమైన గోపిక కథనాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంటూ ‘ప్రతికూలతలను ఎదుర్కొని తన ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు గోపిక కనబరిచిన సంకల్పానికి నా సెల్యూట్. నా నియోజకవర్గానికే చెందిన ఆమె తపన పట్ల నాకు గర్వంగా ఉంది’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.