ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కాలం నడుస్తోంది. వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు, కార్యాలయాలు ఒక్కొక్కటిగా తెరచుకుంటున్నా ఇప్పటికీ పాఠశాలలు ప్రారంభం కావడం లేదు. దీంతో చదువులో వెనకబడకూడదని చాలామంది విద్యార్థులు ఆన్లైన్ బాట పట్టారు. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ సహాయంతో ఇంటినుంచే ఆన్లైన్ పాఠాలు నేర్చుకుంటున్నారు. వీరి సంగతి అలా పక్కన పెడితే... స్మార్ట్‌ఫోన్ లేని పిల్లల సంగతేంటి? ఇంటర్నెట్ లేని విద్యార్థులంతా విద్యా బుద్ధులకు దూరం కావాల్సిందేనా? అంటే ఏమాత్రం అవసరం లేదంటోంది జమైకాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు. కొవిడ్ కాలంలో ఆన్లైన్ క్లాసులకు దూరమవుతోన్న పేద విద్యార్థులకు వినూత్నంగా పాఠాలు బోధిస్తోందీ టీచరమ్మ. తన విద్యాబోధనతో యునిసెఫ్ ప్రశంసలు అందుకున్న ఈ పంతులమ్మ గురించి తెలుసుకుందాం రండి..
వీధి గోడలను బ్లాక్ బోర్డులుగా మార్చి!
తల్లిదండ్రులు మనకు జీవితాన్ని ప్రసాదిస్తే... గురువులు మనం జీవితంలో ఎదగడానికి కావాల్సిన విద్యా బుద్ధులు, క్రమశిక్షణ, జ్ఞానాన్ని అందిస్తారు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ... అంటూ తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని గురువులకు ఇస్తాం. జమైకా దేశంలోని సెయింట్ ఆండ్రూలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోన్న తనేకా మక్కాయ్ ఫిప్స్ను చూస్తే ఈ మాటలెందుకన్నారో మనకు పూర్తిగా అవగతమవుతుంది. ఓవైపు కరోనా వైరస్, మరోవైపు నేర ముఠాల తుపాకీ చప్పుళ్లు, ఇంకోవైపు హడలెత్తిస్తోన్న కరేబియన్ వేడిగాలులు... ఇవేవీ పట్టించుకోని ఆమె.. వీధి గోడలను బ్లాక్ బోర్డులుగా మార్చి పేద పిల్లలకు పాఠాలు చెబుతోంది. తన భర్త, కూతురు సహాయంతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది.
అందుకే ఈ నిర్ణయం!
కరోనాతో జమైకాలో ఏడునెలల క్రితం పాఠశాలలు మూతపడ్డాయి. అయితే విద్యార్థులు వెనకబడకూడదనే ఉద్దేశంతో కొన్ని నెలల క్రితం అక్కడి ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులకు అనుమతినిచ్చింది. ఈక్రమంలో ఇంటర్నెట్ సదుపాయం, స్మార్ట్‌ఫోన్ సౌకర్యమున్న విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. అయితే జమైకా, కింగ్స్టన్ నగరాల్లోని కొన్ని మురికివాడల కుటుంబాలకు ఇప్పటికీ పూటగడవడమే కష్టంగా ఉంటోంది. అలాంటిది వారి పిల్లలకు స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇలాంటి పరిస్థితుల్లో తనేకాకు ఓ చక్కటి ఆలోచన వచ్చింది. ఇందులో భాగంగా ముందుగా తన భర్త సహాయంతో మురికివాడల్లోని కమ్యూనిటీ గోడలను బ్లాక్ బోర్డులుగా మార్చేసింది తనేక. ఆ తర్వాత వాటిపై పిల్లలకు అవసరమైన పాఠాలను బోధించడం మొదలుపెట్టింది. వాటిని కొంతమంది పిల్లలు తమ ఫోన్లలో ఫొటోలు తీసుకుని ఇంటికెళ్లి చదువుకుంటుంటే, మరికొందరు అక్కడే ఉండి తమ నోట్‌బుక్‌లో రాసుకుంటున్నారు. ఆ తర్వాత టీచరమ్మ ఇంటికెళ్లి పాఠాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకుంటూ, హోం వర్క్ తీసుకుంటూ ముందుకెళ్తున్నారు పిల్లలు. అంతేకాదు.. కరోనా నేపథ్యంలో ఇలా క్లాసులకు హాజరయ్యే పిల్లలందరూ మాస్కులు ధరించేలా, సామాజిక దూరం పాటించేలా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు తనేక.
120 మంది పిల్లలకు విద్యాబుద్ధులు!
కొవిడ్ కారణంగా పిల్లలు చదువులో వెనకబడిపోకుండా తనేక చేస్తోన్న ఈ మంచి ప్రయత్నం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. దీంతో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మరికొంతమంది ఆమె బాటలోనే నడుస్తున్నారు. అందులో ఆమె 23 ఏళ్ల కూతురు కూడా ఉండడం విశేషం. ఈక్రమంలో ప్రతిరోజూ ఉదయాన్నే తన బృందాన్ని వెంటబెట్టుకుని మురికివాడలకు వెళ్లడం, అక్కడున్న కమ్యూనిటీ బ్లాక్ బోర్డులపై కొత్త పాఠాలు రాస్తూ, వాటిని బోధిస్తూ సుమారు 120 మంది పిల్లలకు అక్షర జ్ఞానాన్ని పంచుతున్నారీ సూపర్‌వుమన్.
కరోనాతో పిల్లలు చదువుకు దూరం కాకూడదు!
‘ఒకరోజు నేను ఇంట్లో పనిలో ఉండగా పక్క వీధుల నుంచి పిల్లల అరుపులు, శబ్దాలు వినిపించాయి. ఏం జరుగుతుందో తెలుసుకుందామని గేటు తీసి బయటకు వెళ్లాను. అక్కడ కొంతమంది పిల్లలు గంతులేస్తూ, ఆటలాడుతూ కనిపించారు. మరికొందరు సైకిల్ తొక్కుతున్నారు. వారిని అలా చూసే సరికి నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఒకవేళ కొవిడ్ రాకపోయి ఉంటే వారందరూ ఈపాటికి తరగతి గదుల్లో ఉండేవారు... అక్కడ టీచర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినేవారు కదా...! అందుకే ఈ వైరస్ కారణంగా రేపటి పౌరులైన పిల్లలు చదువులో వెనకబడకూడదని గట్టిగా అనుకున్నాను. ఒక టీచర్‌గా నేను ఆ పిల్లలందరికీ విద్యా బుద్ధులు నేర్పించాలనుకున్నాను. అయితే నేను స్వయంగా పిల్లల దగ్గరికెళ్లి పాఠాలు చెప్పే పరిస్థితులు లేవు. ఆ సమయంలోనే నాకు ఈ ఆలోచన వచ్చింది. నా భర్త సహాయంతో మురికివాడల్లోని గోడలను బ్లాక్ బోర్డులుగా మార్చేశాను. వాటిపై పిల్లలకు అవసరమైన పాఠాలను బోధించడం మొదలుపెట్టాను. మా బృందం సహాయంతో తల్లిదండ్రులు, వారి పిల్లలందరికీ ఈ విషయం తెలిసేలా చేశాను. కరోనా కారణంగా మన సాధారణ జీవితంలో ఎన్నో మార్పులొచ్చాయి. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా మన పిల్లలకు చదువు అందాల్సిందే. బోధనకు సంబంధించి ఉపాధ్యాయులు కూడా సరికొత్త మార్గాలను అన్వేషించుకోవాలి. అందులో భాగమే నా ఈ ప్రయత్నం’ అని అంటోందీ టీచరమ్మ.
ఆమె కృషి అభినందనీయం!
తన వినూత్న విద్యా బోధనతో అందరి మన్ననలు అందుకుంటున్నారు తనేక. ఈక్రమంలో యునిసెఫ్(యునైటెడ్ నేషన్స్ చిల్ర్డన్స్ ఫండ్) తమ అధికారిక ట్విట్టర్ పేజీ ద్వారా ఆమె చేస్తోన్న ప్రయత్నాన్ని అందరితో షేర్ చేసుకుంది. తనేక మరెందరికో స్ఫూర్తిదాయకమంటూ ప్రశంసలు కురిపించింది. ఇక జమైకా అధ్యక్షుడు ఆండ్రూ హోల్నెస్ స్వయంగా ఈ టీచరమ్మను కలుసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆమె చేస్తోన్న కృషి అభినందనీయమంటూ ప్రశంసించారు. దీంతో పాటు పలువురు దాతలు ఆమెకు సహాయమందించేందుకు ముందుకొస్తున్నారు.
Photo: Screengrab