కొన్ని దశాబ్దాల క్రితం వరకు వంటింటికి మాత్రమే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో అడుగుపెడుతున్నారు. అవకాశాల్లో సగమిస్తే చాలు... రాకెట్లలో రివ్వున ఎగిరి ఆకాశాన్ని సైతం అందుకోగలమని రుజువు చేస్తున్నారు. ఈ మాటలను మరోసారి నిరూపిస్తూ భారత విమానయాన చరిత్రలో తొలిసారి ఓ మహిళ దేశీయ విమానయాన సంస్థ పగ్గాలు అందుకున్నారు.
తొలి మహిళా సీఈవోగా!
భారత ప్రభుత్వ రంగ సంస్థ ‘ఎయిర్ ఇండియా’ (ఏఐ)లో సరికొత్త చరిత్రకు తెరలేసింది. ఎయిర్ ఇండియా ప్రాంతీయ అనుబంధ సంస్థ అలయన్స్ ఎయిర్‌కు కెప్టెన్ హర్‌ప్రీత్ సింగ్‌ను సీఈవోగా నియమిస్తూ ఎయిర్ ఇండియా సీఎండీ రాజీవ్ భన్సల్ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హర్‌ప్రీత్ సింగ్ సీఈవోగా వ్యవహరిస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం హర్‌ప్రీత్ సింగ్ ఎయిరిండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(విమానభద్రత విభాగానికి)గా వ్యవహరిస్తున్నారు. ఆమె స్థానంలో, ఎయిర్ ఇండియా నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కెప్టెన్ నివేదితా భాసిన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
మహిళా సామర్థ్యంపై నమ్మకముంచుతూ!
మహిళా సాధికారతకు సంబంధించి ఎయిర్ ఇండియా సంస్థకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. దేశీయ విమానయాన సంస్థలకు సంబంధించి అత్యధిక మంది మహిళా పైలట్లు ఈ సంస్థలోనే ఉండడం విశేషం. అందుకే చాలామంది మహిళలు పైలట్ ఉద్యోగాలకు ఈ సంస్థకే దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇక మహిళల శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటుతూ ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందీ సంస్థ. ఇందులో భాగంగా గతేడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 12 అంతర్జాతీయ విమాన సర్వీసులు, 40కి పైగా దేశీయ విమాన సర్వీసులను మొత్తం మహిళా సిబ్బందితోనే నడిపించింది.
అనారోగ్య కారణాలతో దూరమై!
ఈ క్రమంలో తొలిసారిగా ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అలయన్స్ ఎయిర్‌కు సీఈవోగా హర్‌ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. తద్వారా ఓ దేశీయ విమానయాన సంస్థ పగ్గాలు అందుకున్న తొలి మహిళగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారామె. హర్‌ప్రీత్ సింగ్ 1988లో ఎయిర్ ఇండియా పైలట్‌గా ఎంపికయ్యారు. ఆ అవకాశం అందుకున్న మొట్టమొదటి మహిళ కూడా ఆమే కావడం విశేషం. అయితే అనారోగ్య సమస్యలతో విమానంలో ప్రయాణించలేకపోయిన ఆమె.. ఫ్లైట్ సేఫ్టీ విభాగంలో చేరారు. విమానాల భద్రత విషయంలో విశేష సేవలందించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. ‘ఇండియన్ వుమెన్ పైలట్ అసోసియేషన్’కు హెడ్‌గా కూడా పనిచేశారు. నేటితరం పైలట్లకు రోల్‌మోడల్స్‌గా నిలుస్తోన్న కెప్టెన్ భాసిన్, కెప్టెన్ క్షమతా బాజ్‌పాయి.. తదితర సీనియర్ మహిళా కమాండర్లందరూ ఈ అసోసియేషన్‌లోనే భాగమవడం విశేషం.
ఎయిర్ ఇండియాకు ప్రస్తుతం రూ.52వేల కోట్లకు పైగా అప్పులున్నాయి. దీంతో ఈ సంస్థలోని వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈక్రమంలో ప్రస్తుతం విక్రయానికి వెళుతున్న ఎయిర్ ఇండియా-ఏఐ, ఎక్స్‌ప్రెస్-ఏఐఎస్ఏటీఎస్లో అలయన్స్ ఎయిర్ భాగం కాదు. ప్రస్తుతానికి ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతోంది.
Photo: www.facebook.com/harpreet.adesingh