Image for Representation
‘మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే స్ర్తీ, పురుష సమానత్వం సాధ్యమవుతుంది’ అన్న మాటలను అక్షరాలా నిరూపిస్తుంది యూపీకి చెందిన ఓ మహిళ. తన స్వశక్తితో సొంత కాళ్లపై నిలబడుతూ, మరికొందరిని తన బాటలో నడిచేలా స్ఫూర్తినిస్తోంది. అందుకే సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు అందుకుంది. ఇంతకీ ఎవరా మహిళ? ఏమిటి ఆమె ప్రత్యేకత? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.
ఆర్థిక స్వాతంత్ర్యం సాధించారు!
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీకి చెందిన సుమన్ దేవి డిగ్రీ పూర్తిచేసింది. అందరిలా ఉద్యోగాల కోసం వెంపర్లాడని ఆమె.. స్వశక్తితో సొంత కాళ్లమీద నిలబడాలనుకుంది. అందుకే జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్(NRLM) పథకంలో భాగంగా మరికొందరు మహిళలతో కలిసి ‘మా వైష్ణో స్వయం సహాయక బృందా’న్ని ఏర్పాటుచేసింది. 2016 ఆగస్టులో ప్రారంభమైన ఈ బృందంలో మొత్తం 11 మంది మహిళలు సభ్యులుగా చేరారు. ప్రాజెక్టు మేనేజర్, అధికారుల సహాయంతో స్వయం ఉపాధిలో శిక్షణ తీసుకున్నారు. మిరప, టొమాటో.. వంటి పంటల సాగులో మెలకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ సహాయంతో సొంతంగా నర్సరీలు ఏర్పాటు చేసుకున్నారు. తక్కువ పెట్టుబడితో మిరప, టొమాటోను సాగు చేసి లాభాలు ఆర్జించారు. తద్వారా తాము కోరుకున్న ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించారు.
11 నుంచి 24!
కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడంలో భాగంగా స్వీయ పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కుల వినియోగం కూడా తప్పనిసరైంది. ఈక్రమంలో సుమన్ దేవి నేతృత్వంలోని మా వైష్ణో స్వయం సహాయక బృందం కూడా మాస్కుల తయారీలో నిమగ్నమైంది. ముందుగా కొద్ది రోజుల పాటు మాస్కులు కుట్టడంలో శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత ఇంట్లోనే మాస్కులు తయారుచేసి పిల్లలు, అవసరమైన వారికి ఉచితంగా అందించారు. సామాజిక స్పృహతో వీరు ప్రారంభించిన ఈ మంచి పనిలో మరికొందరు మహిళలు కూడా భాగస్వాములయ్యారు. నాలుగేళ్ల క్రితం 11మంది మహిళలతో ప్రారంభమైన ఈ బృందంలో ప్రస్తుతం 24 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు.
కరోనాపై పోరులో మేము సైతం!
సుమన్ దేవికి ప్రస్తుతం ఇద్దరు కూతుళ్లున్నారు. ఓవైపు స్వయం సహాయక బృందాన్ని ముందుండి నడిపిస్తూనే మరోవైపు తన ఇద్దరు పిల్లల సంరక్షణను చూసుకుంటోంది. ‘లాక్డౌన్ ప్రారంభంలో మాస్కుల కొరత భారీగా ఏర్పడింది. దీంతో నాతో పాటు మా సభ్యులందరం ఒక నిర్ణయానికి వచ్చాం. ఖాదీ మాస్కులు తయారుచేసి అవసరమైన వారికి అందిద్దామనుకున్నాం. ఇందులో భాగంగా మా మిషన్ మేనేజర్ సలహాలు తీసుకున్నాం. ఆయన సహకారంతో ఇంట్లోనే మాస్కులు కుట్టాం. మొదట్లో మా బృందమంతా కలిపి రోజుకు 70 మాస్కులు తయారుచేశాం. స్థానికంగా ఉండే పిల్లలు, పేదలకు వాటిని అందించాం. ఆ తర్వాత కొవిడ్ కేసులు పెరిగిపోవడంతో మాస్కులకు మరింత డిమాండ్ ఏర్పడింది. దీంతో మార్కెట్ నుంచి భారీగా ఖాదీ క్లాత్‌ను కొనుగోలు చేసి మాస్కుల తయారీ సంఖ్యను పెంచాం. ఈ ఖాదీ మాస్కులు ఒకసారి వాడిన తర్వాత మళ్లీ శుభ్రం చేసుకొని ధరించే సౌలభ్యం ఉంటుంది. మేం చేస్తున్న మంచి పనిని మెచ్చుకుంటూ చాలామంది మహిళలు మాతో చేరారు. అలా మేం కూడా ఈ వైరస్ వ్యతిరేక పోరులో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది’ అని అంటుంది సుమన్ దేవి.
మోదీ మెచ్చుకున్నారు!
‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా మోదీ ఇటీవల జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సుమన్ దేవితో పాటు మా వైష్ణో స్వయం సహాయక బృందం పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. వేలకొద్ది మాస్కులు తయారుచేసిన వారి విజయగాథను అందరితో షేర్ చేసుకున్నారు. ఇక ప్రధాని నోటి వెంట తన పేరు రావడంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతోంది సుమన్ దేవి. ‘ప్రధానమంత్రి ప్రత్యేకంగా నా పేరును ప్రస్తావించారు. ఇంతకన్నా పెద్ద ప్రశంస ఇంకేముంటుంది? మా కృషిని మోదీ గుర్తించారు. మమ్మల్ని మెచ్చుకొని మాకు మరింత ప్రోత్సాహం అందించారు. ప్రతి ఒక్కరూ నన్ను అభినందిస్తున్నారు. ప్రధాని అందించిన స్ఫూర్తితో మేం మరింత కష్టపడతాం’ అని అంటోందీ సూపర్ వుమన్.
దేశమంతా ఆమె కృషిని గుర్తించింది!
ఈ సందర్భంగా బారాబంకీ జిల్లా మెజిస్ట్రేట్ కూడా సుమన్ దేవిపై ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. ‘మన్ కీ బాత్’లో ప్రధానమంత్రి నోటి వెంట బారాబంకీ జిల్లా పేరు రావడం ఇది మూడోసారి. గతంలో సరాహి సరస్సు, కల్యాణి నదుల గురించి ఆయన చెప్పుకొచ్చారు. తాజాగా సుమన్ దేవితో పాటు మా వైష్ణో స్వయం సహాయక బృందాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రస్తుతం దేశమంతా ఆమె కృషిని గుర్తించింది’ అంటూ రాసుకొచ్చారు.