కరోనా కారణంగా చాలామంది ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. కానీ ఏఎన్ఎమ్లు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు మాత్రం ఇంటింటికీ వెళ్తున్నారు. పూర్తిగా కార్యదీక్షలో మునిగిపోయి వీధి వీధి తిరుగుతూ కొవిడ్ కల్లోలంపై అందరినీ జాగృతం చేస్తున్నారు. అయిన వారే వద్దంటున్నా... అవమానాలు ఎదురైనా వృత్తిధర్మానికే ఓటేస్తున్నారు. ఇదిలా ఉంటే ఒడిశాకు చెందిన ఇద్దరు ఐసీడీఎస్ ఆరోగ్య కార్యకర్తలు కొవిడ్ వైరస్‌పై వినూత్న తరహాలో పోరాటం చేస్తున్నారు. వృత్తిధర్మాన్ని నిక్కచ్చిగా పాటిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు పలువురి మన్ననలు అందుకుంటున్నారు.
పాటలతో కరోనాపై అవగాహన!
సాధారణ రోజుల్లో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు ఏం చేస్తారు? ఇంటింటా తిరుగుతూ గర్భిణీలు, బాలింతల వివరాలు నమోదు చేసుకుంటారు. ప్రభుత్వాల నుంచి వారికి అందాల్సిన సంక్షేమ పథకాలతో పాటు తల్లీబిడ్డల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తారు. అయితే ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన సుజాత, సబిత అనే ఇద్దరు ఐసీడీఎస్ ఆరోగ్య కార్యకర్తలు కొవిడ్‌పై సరికొత్త తరహాలో అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ పాటల రూపంలో కరోనా జాగ్రత్తలను వివరిస్తున్నారు. పిల్లలు కూడా అర్థం చేసుకునేలా లిరిక్స్, స్లోగన్స్‌తో వైరస్ గురించి ప్రచారం కల్పిస్తున్నారు. తద్వారా అక్కడి ప్రజలందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.
పిల్లలు కూడా ఆసక్తిగా వింటున్నారు!
ఆశావర్కర్ సుజాతకు చిన్నప్పటి జానపద పాటలంటే చాలా ఇష్టం. అందులో తనకు కొంచెం ప్రావీణ్యం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అదే కళా ప్రతిభతో వైరస్ వ్యతిరేక పోరాటంలో పాల్గొంటోందీ కరోనా వారియర్. ‘నేను ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకే ఇంటి నుంచి బయలుదేరతా. విధుల్లో భాగంగా నాకు అందించిన మార్గంలోని ఇళ్ల ముందు ఆగుతాను. కొవిడ్‌కు సంబంధించిన స్లోగన్స్‌తో పాటు వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి వారికి పాటల రూపంలో వివరిస్తాను. దీంతో పాటు ప్రభుత్వాలు అమలు చేస్తున్న కరోనా నిబంధనలు, మార్గదర్శకాలను కూడా పాటలు పాడుతూనే చెబుతాను. నా పాటలు, లిరిక్స్ అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. అందుకే ప్రజలతో పాటు పిల్లలు కూడా వీటిని ఆసక్తిగా వింటున్నారు’ అని చెబుతోంది సుజాత.
ప్రతిరోజూ 30 ఇళ్లు తిరుగుతూ!
కరోనా కట్టడిలో భాగంగా విశ్రాంతి లేకుండా విధులు నిర్వర్తిస్తోంది సుజాత. ప్రతిరోజూ 30 ఇళ్లు తిరుగుతూ కొవిడ్ పాటలు పాడుతోంది. ‘మే మాసంలో కొవిడ్ బాధితుల సంఖ్య బాగా పెరిగిపోయింది. గంజాం జిల్లాలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా నియంత్రణలో భాగంగా ఇంటింటి సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి మేం ఇంటింటా తిరిగి కరోనా బాధితులను గుర్తిస్తున్నాం. ఇందులో భాగంగా మే మొదటివారంలో అంకుస్పుర్ అనే గ్రామంలో ఒకేరోజు 36 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో నేనే బాధ్యత తీసుకుని వారందరినీ ఓ కొవిడ్ ఆస్పత్రిలో చేర్చించాను. అప్పటినుంచి ఇలా నిరంతరాయంగా కరోనా పోరులో భాగస్వామురాలి నవుతున్నాను’ అంటోందీ కరోనా వారియర్.
చాలామందికి చేరుతుందనే!
ఇక అదే జిల్లాలోని గుంతపాద అనే గ్రామంలో అంగన్వాడీ వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తోంది సబిత. ఆమె కూడా పాటల రూపంలోనే కొవిడ్ నిబంధనలను పాటించమని ప్రజలను కోరుతోంది. ‘గత ఏడు నెలల నుంచి కరోనా వైరస్ అందరినీ బాధపెడుతోంది. చేతుల పరిశుభ్రత, సామాజిక దూరం, మాస్కుల వినియోగం వంటి విషయాలను పాటల రూపంలో చెబితే చాలామందికి చేరుతుందని నాకు అనిపించింది. అందుకే ఈ పద్ధతిని ఎంచుకున్నాను. నేను గత ఏడునెలలుగా ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు. నేను అప్రమత్తంగా ఉండకపోతే చాలామంది ప్రజలు వైరస్‌ను తేలికగా తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు పరిస్థితులు మరింత దిగజారతాయి. అందుకే ఇలా ఇంటింటా తిరుగుతూ అందరి ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తున్నాం’ అంటోంది సబిత.
ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు!
విధి నిర్వహణలో భాగంగా సుజాత, సబిత గత ఏడు నెలలుగా ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేదు. నిరంతరం ఇంటింటికీ తిరుగుతూ వైరస్‌పై వినూత్న తరహాలో పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ట్విట్టర్ వేదికగా ఈ కరోనా వారియర్స్‌ను ప్రశంసించారు. ఆపత్కాలంలో విధి నిర్వహణ పట్ల వారు చూపిస్తున్న అంకిత భావం ఎనలేనిదని కొనియాడారు. ఈ క్రమంలో పలువురు నెటిజన్లు కూడా ఈ కరోనా వారియర్స్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.