Photo: Image for Representation
పెళ్లయిన మహిళలకు ఇంటి పని, వంట పని, పిల్లల ఆలనా పాలనా చూసుకోవడం...ఇలా పలు రకాల బాధ్యతలుంటాయి. ఇక ఉద్యోగం చేసే ఆడవాళ్ల పరిస్థితి అయితే మరింత క్లిష్టంగా ఉంటుంది. ఒకవైపు ఇంటి బాధ్యతలు..మరోవైపు ఆఫీస్ పనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిగత జీవితాన్ని... సమానంగా, సమర్థంగా బ్యాలన్స్ చేయాల్సి ఉంటుంది. ఈక్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా అధికారిణి తల్లి ప్రేమను చాటుకుంటూనే వృత్తి నిబద్ధతను పాటిస్తోంది. మాతృత్వం, వృత్తి ధర్మం తనకు రెండు కళ్లలాంటివి అని చెబుతోన్న ఈ కరోనా వారియర్ గురించి మనమూ తెలుసుకుందాం రండి..
చంటి బిడ్డతో కార్యాలయానికి!
యూపీలోని ప్రయాగ్ రాజ్‌కు చెందిన సౌమ్యా పాండే అనే ఐఏఎస్ అధికారిణి ప్రస్తుతం ఘజియాబాద్ జిల్లాలోని మోదీ నగర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (SDM)గా పనిచేస్తున్నారు. మూడువారాల క్రితం ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆమె...ప్రసవానంతర సెలవు కూడా తీసుకోకుండానే తిరిగి తన విధుల్లోకి చేరారు. కరోనాను మరింత సమర్థంగా ఎదుర్కొనే క్రమంలో మూడువారాల చంటి బిడ్డను తీసుకుని మరీ కార్యాలయానికి హాజరవుతున్నారు సౌమ్య. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు పాప బాధ్యతతో పాటు డ్యూటీ కూడా ముఖ్యమేనంటోన్న ఈ ఐఏఎస్ ఆఫీసర్ వృత్తి నిబద్ధతపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
సెలవులను రద్దు చేసుకుని!
సాధారణంగా ప్రసవం తర్వాత మహిళలకు ఆరునెలల పాటు ప్రసూతి సెలవులు ఉంటాయి. అయితే కరోనా ప్రభావం నుంచి సామాన్య జనజీవనం క్రమంగా కోలుకుంటున్న నేటి పరిస్థితుల్లో తాను ఇంట్లో ఉండడం భావ్యం కాదనుకున్నారు సౌమ్య. అందుకే తన ఆరునెలల మెటర్నిటీ సెలవులను కూడా రద్దు చేసుకుని తిరిగి తన బాధ్యతల్లో చేరారు. యూపీలోని ప్రయాగ్ రాజ్‌కు చెందిన సౌమ్య 2016లో జరిగిన యూపీఎస్సీ పరీక్షల్లో ఆల్ ఇండియా స్థాయిలో నాలుగో ర్యాంకును సొంతం చేసుకున్నారు. అంతకుముందు అలహాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ఉత్తరాఖండ్‌లోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో సివిల్ సర్వీసెస్ శిక్షణ పూర్తి చేసి బంగారు పతకంతో బయటికొచ్చారు.
ఏడో నెలలో అదనపు బాధ్యతలు!
2019 అక్టోబర్‌లో ఘజియాబాద్ జిల్లా జాయింట్ మెజిస్ర్టేట్‌గా తొలిసారి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన సౌమ్య ఆ తర్వాత సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌గా మోదీ నగర్‌కు వచ్చారు. ఇక కొవిడ్ నేపథ్యంలో ఘజియాబాద్ జిల్లా నోడల్ ఆఫీసర్‌గా ఈ ఏడాది జులైలో అదనపు బాధ్యతలను స్వీకరించారు. అప్పుడామె ఏడో నెల గర్భంతో ఉన్నారు. ఆ సమయంలో సెలవులు తీసుకునే సౌలభ్యం ఉన్నప్పటికీ కరోనా ప్రభావంతో వాటిని ఉపయోగించుకోలేదామె. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ జిల్లా అంతటా క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. లాక్డౌన్ ఆంక్షలు పటిష్ఠంగా అమలయ్యేలా చూస్తూనే నిత్యావసరాలకు సంబంధించి సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
దేవుడు నాకు ఆ శక్తిని ప్రసాదించాడు!
ఈక్రమంలో సెప్టెంబర్ 17న మీరట్‌లోని ఓ ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు సౌమ్య. సర్జరీ కోసం 22 రోజుల పాటు సెలవు తీసుకున్న ఆమె అక్టోబర్ 1న తిరిగి విధుల్లోకి చేరారు. ‘కొవిడ్‌ను కట్టడి చేసేందుకు వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి. ఇలాంటి తరణంలో నేను ఇంట్లో ఉండడం భావ్యం కాదు. అందుకే పాపకు జన్మనిచ్చిన రెండు వారాలకే తిరిగి విధుల్లో చేరాను. గ్రామాల్లో ఇప్పటికీ చాలామంది మహిళలు డెలివరీ తేదీ దగ్గర పడ్డాక కూడా జీవనోపాధి పనులకు వెళుతుంటారు. ప్రసవమయ్యాక కూడా ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకోకుండా తిరిగి పనులకు హాజరవుతుంటారు. అదృష్టవశాత్తూ దేవుడు నాకు కూడా అలాంటి శక్తి, సహనాన్ని ప్రసాదించాడు. అందుకే ఓవైపు అమ్మగా నా బిడ్డను చూసుకుంటూనే.. మరోవైపు విధులకు హాజరవుతున్నాను. అలా అని చిన్నారి ఆరోగ్య విషయంలో ఏ మాత్రం అలక్ష్యంగా ఉండడం లేదు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటున్నాను. పాపకు పాలిచ్చే విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాను. ఒకేసారి ఎక్కువ మంది సందర్శకులు కార్యాలయానికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇక చిన్నారి సంరక్షణ విషయంలో మా కుటుంబ సభ్యులు, కార్యాలయ సిబ్బంది కూడా నాకు బాగా సహకరిస్తున్నారు’ అని చెబుతున్నారీ సూపర్ మామ్.
ఒడిలో పాపను పెట్టుకుని విధులు నిర్వర్తిస్తోన్న ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈసందర్భంగా వృత్తి పట్ల ఆమెకు ఉన్న అంకితభావాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో పాపాయి ఆరోగ్యం గురించి మరింత అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. మరి అటు వృత్తిని, ఇటు పాపాయి ఆలనా పాలనను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోన్న ఈ కరోనా వారియర్‌కు మనమూ సెల్యూట్ చేద్దాం..!