బుల్లెట్ కంటే వేగంగా దూసుకుపోయే సామర్థ్యం, 50 వేల అడుగుల ఎత్తు నుంచి శత్రువును పసిగట్టి మాటు వేసే సత్తా, పది వేల కిలోల ఆయుధాల్ని మోసుకెళ్లే కెపాసిటీ, అణ్వాయుధాలను సైతం ప్రయోగించగలిగే ప్రత్యేకత, భూమిపై-సముద్రంలో నక్కి ఉన్న శత్రువులను చీల్చి చండాడే శక్తియుక్తులు.. ఇవన్నీ ఇటీవలే భారత అమ్ముల పొదిలో చేరిన రాఫెల్ యుద్ధ విమానాల ప్రత్యేకతలు. మరి, ఇలాంటి ప్రతిష్ఠాత్మక యుద్ధ విమానం నడుపుతూ.. చాకచక్యంగా శత్రువును తుదముట్టించడమంటే మాటలు కాదు.. అందుకు ఎంతో కఠోర శిక్షణ తీసుకోవాలి.. అంతకంటే ముందు ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేంత ఓర్పు-నేర్పు కావాలి.. ఇవన్నీ తనలో ఉన్నాయంటోంది ఫ్లైట్ లెఫ్టినెంట్ శివాంగి సింగ్. ఇలా శిక్షణ ఎంత కష్టంగా ఉన్నా ఇష్టంగా భరిస్తోంది కాబట్టే రాఫెల్ యుద్ధ విమానాలను నడపనున్న తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా చరిత్రకెక్కింది. మల్టీరోల్ ఎయిర్‌క్రాఫ్ట్ రాఫెల్ జెట్స్‌గా పేరున్న ఈ విమానాలను నడపడానికి తొలిసారి ఓ మహిళా పైలట్ శిక్షణ పొందుతున్నట్లు ఐఏఎఫ్ ఇటీవలే ప్రకటించినా.. ఆమె పేరు మాత్రం తాజాగా వెల్లడించింది. మరి, ‘గోల్డెన్ యారోస్’గా పేరున్న ఈ రాఫెల్ వైమానిక దళంలోకి చేరిన ఈ గోల్డెన్ గర్ల్ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..
పురుషాధిపత్యం ఉన్న రంగాల్లోనూ మహిళలు పాగా వేస్తున్నారని చెప్పడానికి తాజా ఉదాహరణే ఫ్లైట్ లెఫ్టినెంట్ శివాంగి సింగ్. ఇటీవలే ఫ్రాన్స్ నుంచి భారత్ చేరుకున్న రాఫెల్ యుద్ధ విమానాలు నడిపే బృహత్తర బాధ్యతను ఆమె అందుకున్నారు. ఇలా రాఫెల్ జెట్స్ నడపనున్న తొలి మహిళా యుద్ధ విమాన పైలట్‌గా చరిత్రను తిరగరాశారు శివాంగి.
పక్షిలా ఎగరాలని!
శివాంగి సింగ్ స్వస్థలం వారణాసి. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె.. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్సీసీలో కూడా చేరారామె. ఆపై 2016లో ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. చిన్నతనం నుంచీ పక్షిలా ఆకాశంలో ఎగరాలని కలలు కన్న శివాంగి.. ఎప్పటికైనా పైలట్ అవ్వాలని అప్పుడే నిశ్చయించుకున్నారు. ఇలా ఆమె ఆశకు మొదటి దశ యుద్ధ విమాన పైలట్లుగా నియమితులైన మోహనా సింగ్, భావనా కాంత్, అవనీ చతుర్వేది ఆయువు పోశారు. వారి స్ఫూర్తితోనే 2017లో రెండో దశ యుద్ధ విమాన పైలట్లలో ఒకరిగా ఎంపికైన శివాంగి.. మిగ్-21 బైసన్ యుద్ధ విమానాలు నడపడంలో దిట్ట. ఇక ఇప్పుడు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రాఫెల్ యుద్ధ విమానాలు నడిపే అరుదైన అవకాశాన్ని అందుకొని చరిత్ర సృష్టించారు.
ఎన్నెన్నో ప్రత్యేకతలు!
ఫ్రాన్స్‌లో తయారైన రాఫెల్ యుద్ధ విమానాల గురించి ఎంత చెప్పినా తక్కువే! గంటకు 1912 కిలోమీటర్లు దూసుకుపోయే బుల్లెట్ వేగం, 50 వేల అడుగుల ఎత్తుకు ఎగిరే సామర్థ్యం, సుమారు పది వేల ఆయుధాల్ని మోసుకెళ్లగలిగే సత్తా, పర్వత ప్రాంతాల్లో సైతం సునాయాసంగా పోరాడే శక్తియుక్తులు, అణ్వాయుధాలను ప్రయోగించగలిగే ప్రత్యేకత, భూమి-సముద్రంలో నక్కి ఉన్న శత్రువును పసిగట్టి చీల్చి చండాడే నైపుణ్యం.. ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతల్ని నింపుకొన్న రాఫెల్ యుద్ధ విమానాలను నడపడమంటే అంత తేలికైన విషయం కాదు. దీనికి ఎంతో కఠినమైన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.. ఈ క్రమంలో ఎన్ని సవాళ్లకైనా ఎదురొడ్డగలిగిన సామర్థ్యం కావాలి.. ఇవన్నీ పుణికిపుచ్చుకుంది కాబట్టే శివాంగికి ఈ అరుదైన అవకాశం దక్కింది. రాఫెల్ యుద్ధ విమానాల్లో రయ్ రయ్ మంటూ దూసుకుపోయేందుకు ప్రస్తుతం అంబాలా ఎయిర్‌బేస్‌లో అత్యంత కఠినమైన శిక్షణ తీసుకుంటోందీ ధీర. బాలాకోట్ దాడుల సమయంలో ఈ ఎయిర్‌బేస్ నుంచే వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ తో కలిసి విధుల్లో పాల్గొంది శివాంగి.
యుద్ధంలో పురుషులే కాదు.. మహిళలూ పాల్గొని సత్తా చాటగలరని నిరూపించడానికే 2015లో మహిళల్ని యుద్ధ విమాన పైలట్లుగా ఆహ్వానించడం మొదలుపెట్టింది భారత వైమానిక దళం. ఈ క్రమంలోనే ఇప్పటిదాకా దాదాపు 10 మంది మహిళలు యుద్ధ విమాన పైలట్లుగా, 18 మంది నావిగేటర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే రాఫెల్ వంటి అత్యంత కఠినమైన, ప్రతిష్ఠాత్మక యుద్ధ విమానాల్ని నడిపే సత్తా సైతం మహిళల సొంతం అని శివాంగిని ఎంపిక చేసి మరోసారి చెప్పకనే చెప్పింది ఐఏఎఫ్. ఇలా యుద్ధ విమాన పైలట్లుగా నిలవాలని కలలు కంటోన్న ఎంతోమంది అమ్మాయిలకు మార్గదర్శకురాలిగా, స్ఫూర్తిప్రదాతగా మారిందీ గోల్డెన్ గర్ల్.
ఆల్ ది బెస్ట్ శివాంగి!