బల్లిని చూస్తేనే భయపడిపోతాం.. అలాంటిది పాము కనిపించిందంటే ఇక వెన్నులో వణుకే! వెంటనే ఇంట్లో ఉండే నాన్నో, అన్నయ్యకో పిలుపు వెళ్తుంది. కానీ కర్ణాటకలోని బెల్గాంలో ఎవరింట్లో పాము కనిపించినా నిర్జరా చిట్టికే ఫోన్ వెళ్తుంది.. అదేంటి పాములు పట్టడం మగవారి పని కదా.. అందుకోసం మహిళను పిలవడమేంటి.. అంటారా? పాములు పట్టడంలో ఆమె అంత అనుభవజ్ఞురాలు మరి! ఎలాంటి పరికరాలు లేకుండానే అలవోకగా పాములు పట్టేస్తోందామె.. పైగా చీరకట్టులో కూడా ఇలాంటి సాహసాలు చేస్తూ అందరి చేతా ‘వావ్’ అనిపించుకుంటోంది. అలాంటి వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.
చీరకట్టు.. అతివలందరికీ ఎంతో ఇష్టమైన అవుట్‌ఫిట్ అయినప్పటికీ.. ఈ ఆహార్యంలో కొన్ని రకాల పనులు చేయలేం. అందుకే కొంతమంది మహిళలు కేవలం ప్రత్యేక సందర్భాల్లోనే చీరకట్టుకు ప్రాధాన్యమిస్తుంటారు. కానీ అలాంటి ట్రెడిషనల్ అటైర్‌లోనే అలవోకగా పాములు పట్టేస్తూ అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది కర్ణాటక బెల్గాం నగరానికి చెందిన నిర్జరా చిట్టి.
నిర్జరా చిట్టి, ఆమె భర్త ఎలాంటి పాములనైనా అలవోకగా పట్టేస్తుంటారు. అయితే చిట్టి ఇటీవలే సంప్రదాయ కట్టూ-బొట్టులో ముస్తాబై ఓ పెళ్లి వేడుకకు వెళ్లింది. అంతలోనే ఆమెకు ఫోన్..! ‘మా ఇంట్లో పాముంది.. మీరు వెంటనే రావాలి!’ అని అవతలి వారి నుంచి పిలుపు అందింది. దాంతో వెంటనే అక్కడికి చేరుకున్న ఆమె తాను చీరకట్టులో ఉన్నానన్న విషయం కూడా ఆలోచించకుండా, పామును పట్టుకోవడానికి తన వద్ద ఎలాంటి పరికరాలు లేకపోయినా పని మొదలుపెట్టింది.
చీరకట్టులో.. నిజంగా సాహసమే!
పాము ఇంట్లోని మూలల్లోకి దూరినా మొబైల్ టార్చ్, కర్ర సహాయంతో దాన్ని బయటికి లాగే ప్రయత్నం చేసిందామె. అలా కొద్దిసేపు ప్రయత్నించి మొత్తానికి పామును పట్టేసింది నిర్జర. ఈ క్రమంలో ఓ చేత్తో పాము తోక పట్టుకొని మరో చేత్తో దాన్ని ఓ చిన్న సంచిలోకి దూర్చింది. అక్కడున్న వారంతా పామును చూసి భయపడుతూనే, ఆమె సాహసాన్ని ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. ముఖ్యంగా ‘చీరకట్టులో పామును పట్టడమంటే నిజంగా గ్రేట్..’ అంటూ ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు. ఇలా ఈ డేరింగ్ ఉమన్ చేసిన సాహసానికి సంబంధించిన వీడియోను ఓ మహిళ ట్విట్టర్లో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది.
‘చీరకట్టులో పాములు పట్టుకోవడం కష్టమే.. కానీ ఈ అత్యవసర పరిస్థితుల్లో తప్పలేదు..’ అంటూ చెప్పుకొచ్చారీ స్నేక్ క్యాచర్. ఇక ఈ మహిళ సాహసాన్ని చూసిన నెటిజన్లు ఆమె ధైర్యానికి ఫిదా అయిపోతున్నారు. ఇలా ఈ వీడియోను లక్షల మంది వీక్షిస్తూ, వేల మంది లైకులు కొడుతూ ఆమె సాహసాన్ని కొనియాడుతున్నారు.
భర్త దగ్గర్నుంచి నేర్చుకొని..!

నిర్జరా చిట్టి భర్త ఆనంద్ చిట్టి ఓ స్నేక్ లవర్. పాములు పడుతూ వాటిని నిర్జన ప్రదేశాల్లో వదలడం ఆయనకు అలవాటు. ఇక అతడిని పెళ్లి చేసుకున్నాక పాములు పట్టడంలో ఆయనకు సహాయం చేసేది నిర్జర. అలా తనకూ పాములు పట్టడం అలవాటైందంటోంది. ఆ తర్వాత భర్త ఆనంద్ దగ్గర్నుంచి దీనికి సంబంధించిన కొన్ని మెలకువలు కూడా నేర్చుకున్నానంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ స్నేక్ లవర్. ఇలా ఇప్పటిదాకా చాలా పాములనే పట్టిన నిర్జర.. అత్యంత ప్రమాదకరమైన రక్తపింజర వంటి పాములను కూడా అలవోకగా పట్టి జనావాసాలకు దూరంగా అడవిలో వదిలిపెడుతుందట! ఇలా ‘పాములు ప్రమాదకరమైనవే అయినా అవి కూడా ప్రాణులే.. వాటిని కాపాడడం మన బాధ్యత!’ అని తాము చేసే పనితో నిరూపిస్తున్నారీ కన్నడ కపుల్.
|
పాములకు హాని కలగకుండా..!

పాములు పట్టడం మగవారి పని అనేది చాలామంది అభిప్రాయం.. అలాగే పాము కనిపిస్తే చాలు.. చాలామంది దాన్ని చంపుతుంటారు. కానీ అలా చంపడం పాపం అంటోంది కేరళకు చెందిన రాజీ. అక్కడి పాలోడ్లోని పచ్చా ప్రాంతంలో నివసిస్తోన్న ఈ 34 ఏళ్ల మహిళ.. ఎలాంటి పాములైనా అలవోకగా పట్టేస్తుంటుంది. అయితే ఈ వృత్తిలో ఆమె ప్రత్యేక శిక్షణ ఏమీ తీసుకోకపోవడం విశేషం. కానీ ఒకే ఒక్క రోజు మాత్రం పూర్తిగా పాములు పట్టడంలోనే లీనమైందట! రాజీ కుటుంబం ఉండే ప్రాంతం అడవికి చేరువగా ఉండడంతో పదే పదే అక్కడికి పాములు వస్తుంటాయి.. అయితే ఈ క్రమంలో వాటి ద్వారా మనుషులకు, మనుషుల ద్వారా వాటికి ఎలాంటి అపాయం జరగకూడదన్న ఉద్దేశంతో రాజీ పాములను పట్టి వాటిని అటవీ శాఖ సంరక్షణ విభాగానికి అప్పగిస్తుంటుంది. పైగా ఇందుకోసం ఆమె ఎలాంటి పరికరాలను కూడా ఉపయోగించదట!
|
వీరితో పాటు మరికొందరు మహిళలు కూడా పాములు పడుతూ.. వారి ధైర్యాన్ని, సాహసాన్ని నలుగురికీ చాటుతున్నారు.. ‘పాములు పట్టడానికి ఆడ, మగ అన్న తేడా లేదు..’ అని నిరూపిస్తున్నారు. ఇలాంటి మహిళలందరి సాహసానికి ఓ సెల్యూట్ కొట్టాల్సిందే!