Image for Representation
కరోనా ప్రభావంతో ప్రస్తుతం పిల్లలందరూ ఆన్లైన్ పాఠాలు వింటున్నారు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు చేతుల్లో పట్టుకుంటూ డిజిటల్ తరగతుల బాట పడుతున్నారు. అయితే చాలామంది ఇళ్ల్లల్లో స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్లు లేకపోవడంతో చాలామంది పిల్లలు ఆన్లైన్ పాఠాలకు దూరమవుతున్న సంగతి తెలిసిందే. అయితే కశ్మీర్‌కు చెందిన ఓ ఉపాధ్యాయురాలు వినూత్న బోధనా పద్ధతులతో పిల్లలకు ఆసక్తి కలిగించేలా పాఠాలు చెబుతోంది. కనీసం చాక్‌పీస్, బ్లాక్‌బోర్డ్ లేకుండా విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తోంది. ఈక్రమంలో ఆ టీచరమ్మ అద్భుత ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారానికి ఆమెను ఎంపిక చేసింది. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న రాష్ర్టపతి రామ్నాథ్కోవింద్ చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోనున్నారామె. ఈ సందర్భంగా ఆ పంతులమ్మ, ఆమె వినూత్న బోధనా పద్ధతుల గురించి తెలుసుకుందాం రండి...
రోజూ స్కూల్‌కు వెళ్లేముందు !
శ్రీనగర్‌కు చెందిన రూహీ సుల్తానా అక్కడి ఓ ప్రభుత్వ పాఠశాలలో 12 ఏళ్లుగా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. 49 ఏళ్ల వయసున్న ఆమె రోజూ పాఠశాలకు వెళ్లే ముందు వివిధ దుకాణాలకు వెళ్లి చిప్స్, చాకొలెట్ ర్యాపింగ్ పేపర్లు, సబ్బుల కవర్లు, ఖాళీ టెట్రా ప్యాకెట్లు, ప్లాస్టిక్ కవర్లు, రంపపు పొడి, వాడిపడేసిన టీ ఆకులు మొదలైన వ్యర్ధాలను షాపు యజమానులను అడిగి మరీ తీసుకుంటుంది. అవి తీసుకుని నేరుగా స్కూల్‌కు వెళుతుంది. వాటి సహాయంతో స్కూల్లోని పిల్లలకు ఆసక్తి కలిగించే రీతిలో అక్షర జ్ఞానం పంచుతుంది. పెన్సిల్, పేపర్ అవసరం లేకుండానే విద్యార్థులకు చాలా సులభంగా అర్థమయ్యేలా పాఠాలు నేర్పుతుంది.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా!
విద్యా బోధనలో వినూత్న పద్ధతులు ఆచరిస్తూ విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాట వేస్తోన్న ఉత్తమ ఉపాధ్యాయులను భారత ప్రభుత్వం ఏటా ప్రత్యేక పురస్కారంతో గౌరవిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి గాను దేశవ్యాప్తంగా మొత్తం 47 మంది ఉపాధ్యాయులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అందులో శ్రీనగర్‌కు చెందిన రూహీ సుల్తానా కూడా ఉన్నారు. చిన్నప్పటి నుంచి టీచర్ కావాలని కలలు కన్న ఆమె ఉర్దూ, కశ్మీరీ భాషల్లో మాస్టర్స్ పూర్తి చేసింది. బోధనకు సంబంధించి బీఎడ్ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సు చేసిన ఆమె కాలిగ్రఫీ (చేతిరాతకు సంబంధించిన కోర్సు)లో కూడా డిగ్రీ పట్టా అందుకుంది.
అలాంటి పిల్లలకు ఏ ఖర్చూ లేకుండా!
నిత్యం ఉగ్రవాద దాడులు, బాంబుల మోతలతో దద్దరిల్లే శ్రీనగర్‌లో నివాసముండే కుటుంబాల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారి ఆదాయం కూడా అంతంత మాత్రమే. ఈ క్రమంలో బకర్వాల్, గుజ్జర్ అనే రెండు అల్పాదాయ వర్గాలకు చెందిన పిల్లలకు ఎలాంటి ఖర్చు లేకుండా పాఠాలు చెబుతోంది సుల్తానా. పిల్లలకు అర్థమయ్యే రీతిలో సరదాగా ఆటలాడుతున్నట్లుగా, ఆసక్తి కలిగించేలా విద్యా బోధన చేస్తోంది.
‘నేను ప్లాస్టిక్ కవర్లపై అక్షరాలను రాసి పిల్లలతో ప్రాక్టీస్ చేయిస్తాను. వాడి పడేసిన బాటిల్స్, టాఫీ ర్యాపర్లపై పేర్లు, పదాలను రాసి విద్యార్థులతో చదివిస్తాను. అనంతరం వాటిని ఒక అర్ధవంతమైన వాక్య క్రమంలో అమర్చమని పిల్లలకు చెబుతాను. అదేవిధంగా ఎండిపోయిన టీ ఆకులను వివిధ అక్షరాల ఆకృతిలో అమరుస్తాను. సీరియస్ గా కాకుండా ఇలా సరదాగా ఒక ఆట రూపంలో చదువు చెప్పడం వల్ల పిల్లలను బాగా ఆకట్టుకుంటోంది. వారు ఎంజాయ్ చేస్తూనే అక్షర జ్ఞానం పెంచుకుంటున్నారు. వీరిని చూసి మరికొంతమంది పిల్లలు పాఠశాలలో చేరుతున్నారు’ అంటారు సుల్తానా.
అలా అడగడానికి నేనేమీ సిగ్గుపడను!
పిల్లల పాఠాల కోసం దుకాణ యజమానులను అడిగి మరీ మిగిలిపోయిన వ్యర్థ పదార్థాలను సేకరిస్తున్నారు రూహీ. ‘కేవలం ఆదాయం కోసమే నేను ఈ ఉద్యోగంలో చేరలేదు. పేద పిల్లలకూ విద్యను అందించాలనే ఉద్దేశంతోనే టీచర్‌గా కొనసాగుతున్నాను. ఇక పిల్లల పాఠాల కోసం దుకాణాల్లో మిగిలిపోయిన వ్యర్థాలను అడిగేందుకు నేనేమీ సిగ్గు పడను. నేను వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ఒకసారి డయాగ్నోస్టిక్ ల్యాబ్‌కు వెళ్లాను. అప్పుడే ర్యాపింగ్ పేపర్స్‌లో చుట్టిన ఒక కొత్త యంత్రాన్ని అక్కడకు తీసుకొచ్చారు. దానిని ఇన్స్టాల్ చేసిన అనంతరం ఆ ల్యాబ్ యజమానులు ఆ పేపర్‌ను బయట పారేద్దామనుకున్నారు. కానీ వారి అనుమతితో నేను ఆ పేపర్స్‌ను పాఠశాలకు తీసుకెళ్లాను. అక్కడి తరగతి గదులకు అతికించాను. పిల్లలు అక్షరాలు దిద్ది ప్రాక్టీస్ చేయడానికి ఈ ర్యాపింగ్ పేపర్ చాలా ఉపయోగపడింది. పిల్లల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకునే నేను ఈ పనులన్నీ చేస్తున్నాను. అదేవిధంగా నా సొంత ఖర్చులతోనే తరగతి గదులకు సున్నం వేయిస్తున్నాను’ అని చెబుతారు సుల్తానా.
చాలా గర్వంగా ఉంది!
ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పిల్లలకు పాఠాలు చెబుతోన్న సుల్తానా బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌లో కంటెంట్ క్రియేటర్‌గా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈమేరకు ఉర్దూ, కశ్మీరీ భాషలకు సంబంధించి ఆలిండియా రేడియో బ్రాడ్కాస్ట్ ద్వారా ఆన్లైన్ పాఠాలు బోధిస్తోందీ సూపర్ వుమన్. ఈ క్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారానికి ఎంపికైన సుల్తానాను చూస్తుంటే గర్వంగా ఉందంటున్నారు ఆమె భర్త. ‘జాతీయ అవార్డుకు ఎంపికైన నా సతీమణిని చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. చాలా సంతోషంగానూ ఉంది. మా కుటుంబానికే కాదు... కశ్మీర్లో ఉంటున్న ఉపాధ్యాయుల కుటుంబాలన్నింటికీ ఆమె గర్వకారణంగా నిలిచింది’ అని హర్షం వ్యక్తం చేస్తున్నారాయన.