జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటాం.. వాటిని చేరుకోవడానికి పరితపిస్తుంటాం.. కానీ విధి విసిరే సవాళ్లకు తలవంచి మరో మార్గాన్ని అన్వేషిస్తుంటాం.. ఇలాంటి పరిస్థితులే ఎదురైనా మనలా ఆలోచించలేదామె. ప్రతికూలతలకు ఎదురొడ్డి ధైర్యంగా ముందుకు సాగింది. తన కలల ప్రపంచంలోకి అడుగుపెట్టింది.. ‘నేనేదైనా మెంటల్‌గా ఫిక్సయ్యానంటే అది చేసి తీరతా!’ అంటోంది. ఆమే కనిపించని నాలుగో సింహం అనితా కుందు. ప్రస్తుతం హరియాణా పోలీసు విభాగంలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోన్న ఆమె.. ఓవైపు డ్యూటీలో బిజీగా ఉన్నా.. మరోవైపు పర్వతారోహణను ప్రవృత్తిగా ఎంచుకొని అందులోనూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఎవరెస్ట్ సహా మరో ఐదు ఖండాల్లోని ఐదు ఎత్తైన పర్వతాలను అధిరోహించి మౌంటెనీరింగ్‌పై తనకున్న మక్కువను చాటుకున్న ఈ సూపర్ కాప్.. తాజాగా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. సాహస క్రీడల్లో అత్యున్నత పురస్కారంగా భావించే ‘టెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు - 2019’ పురస్కారానికి ఎంపికైంది. ‘జాతీయ క్రీడా దినోత్సవం’ సందర్భంగా ఆగస్టు 29న ఈ అవార్డును స్వీకరించనున్న సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!
అనితా కుందు.. ఆడపిల్లలంటే వివక్ష ఎక్కువగా ఉండే హరియాణా రాష్ట్రంలో పుట్టిపెరిగిందామె. అక్కడి హిస్సర్ గ్రామం ఆమె సొంత ఊరు. నిరుపేద కుటుంబంలో పుట్టినా తన తల్లిదండ్రుల అండతో చదువు కొనసాగించింది. ఇరుగుపొరుగు వారు, బంధువులు ఆడపిల్ల అంటూ ఆమెపై వివక్ష చూపించినా.. తన కూతురిని మాత్రం అంతర్జాతీయ స్థాయి బాక్సర్‌గా చూడాలన్నది అనిత తండ్రి కల. నాన్న కోరిక మేరకే బాక్సింగ్ ట్రైనింగ్‌లోనూ చేరిందామె. ‘అంతా అనుకున్నట్లు జరిగితే అది జీవితమెందుకు అవుతుంది?’ అన్నట్లుగా తన 13వ ఏట అకస్మాత్తుగా ఆమె తండ్రి మరణించడంతో అంతా తారుమారైపోయింది.
తల్లి కష్టాన్ని గమనిస్తూ..!
కుటుంబ పెద్ద దూరమవడంతో వాళ్ల బంధువులంతా పెళ్లి చేసుకోమని ఆమెను పోరుపెట్టారు. అయినా అందుకు తలవంచలేదు అనిత. ‘నేను చేసుకోనంటూ చేసుకోనని’ పట్టుబట్టింది. ఆ సమయంలో తన తల్లే తనకు అండగా నిలిచింది. కుటుంబ భారమంతా ఆమె భుజాలపైకెత్తుకుంది. పాలమ్ముతూ కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టిందా తల్లి. మరోవైపు వ్యవసాయం కూడా చేసేది. ఇలా తల్లి కష్టాన్ని గమనిస్తూనే బడిలో కసిగా చదివేది అనిత. అంతేకాదు.. బడి నుంచి ఇంటికి తిరిగొచ్చాక పొలంలో అమ్మకు సహాయపడేది కూడా! ఇలా కష్టపడి ఉన్నత చదువులు చదివిన ఆమెను పోలీసు ఉద్యోగం వరించింది. ఇందుకోసం శిక్షణ తీసుకుంటున్న క్రమంలోనే పర్వతారోహణపై తనకున్న మక్కువను గుర్తించిందీ కాప్. పురుషాధిక్యం ఎక్కువగా ఉన్న ఈ సాహస క్రీడలో ఎలాగైనా తన సత్తా చాటాలన్న ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేసిందామె.
ఆ ఘనత నాదే!
ఈ క్రమంలో ఆదిలోనే ఆకాశానికి నిచ్చెనేసింది అనిత. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్‌ని రెండుసార్లు అధిరోహించింది. 2013లో ఈ శిఖరాన్ని నేపాల్ వైపు నుంచి అధిరోహించిన ఆమె.. 2017లో చైనా వైపు నుంచి ఎక్కింది. ఈ క్రమంలో ప్రతికూల వాతావరణం ఆమెకు అడ్డంకిగా నిలిచినా వెన్ను చూపని ధైర్యాన్ని ప్రదర్శించి ఎవరెస్ట్ అంచున మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది. ఇలా ఎవరెస్ట్‌ని నేపాల్ వైపు నుంచి, చైనా వైపు నుంచి అధిరోహించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది అనిత. ఏడు ఖండాల్లో ఏడు అత్యంత ఎత్తైన శిఖరాల్ని అధిరోహించాలని రెండేళ్ల క్రితమే నిర్ణయించుకున్న ఈ లేడీ పోలీస్.. ఇప్పటికే ఆరు పర్వతాల్ని ముద్దాడింది. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణ అమెరికాలోని ఎత్తైన శిఖరం ఆకొన్కాగ్వాను అధిరోహించి ఆరు పర్వతాల్ని అధిరోహించిన ఘనత సాధించింది.
ఆ సమయంలో మువ్వన్నెల పతాకంతో దిగిన ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన అనిత.. ‘ఎముకలు కొరికే చలి, బలంగా వీచే చలిగాలులు, అంతంత మాత్రంగానే ఆక్సిజన్ అందే వాతావరణం.. ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ చివరికి ఆకొన్కాగ్వా శిఖరంపైకి చేరాను.. దేశానికి మరో విజయం అందించాను. చాలా సంతోషంగా ఉంది..’ అంటూ తన ఆనందాన్ని క్యాప్షన్‌గా జోడించిందామె.
ఈ క్రెడిటంతా అమ్మకే!
ఇలా పర్వతారోహణలో మన దేశ ఖ్యాతిని ఖండాంతరాలు దాటిస్తోన్న ఈ మహిళా పోలీసు సాహసాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం గతేడాదికి గాను ‘టెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు’కు ఎంపిక చేసింది. మన దేశంలో సాహస క్రీడల్లో అత్యున్నత పురస్కారంగా భావించే ఈ అవార్డును ‘జాతీయ క్రీడా దినోత్సవం’ సందర్భంగా ఆగస్టు 29న స్వీకరించనుంది అనిత. వర్చువల్‌గా జరిగే అవార్డుల వేడుకలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనుందీ మహిళా మౌంటెనీర్. అవార్డుకు ఎంపికైన సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్, చైనా ఇరువైపుల నుంచి అధిరోహించిన తొలి భారతీయ మహిళను అని చెప్పుకోవడం నాకెంతో గర్వంగా ఉంది. ఇదంతా అమ్మ వల్లే సాధ్యమైంది. ఈ అత్యున్నత పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ క్రెడిటంతా అమ్మకే దక్కుతుంది..’ అంటూ తన మనసులోని ఆనందాన్ని పంచుకుందీ సూపర్ పోలీస్.
|
తను అనే కాదు.. ఎవరైనా సరే.. ‘నేను ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి అని మనసులో బలంగా అనుకుంటే.. తప్పకుండా విజయం సాధిస్తారు..’ అంటూ తన సక్సెస్ సీక్రెట్‌ని చెప్పకనే చెప్పిందీ సూపర్ ఉమన్.
కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అనితా!