Image for Representation
ఇంట్లో ఓ మనిషినో, ఆత్మీయుడినో కోల్పోతే ఆ బాధను మాటల్లో చెప్పలేం. మరి చిన్నప్పటి నుంచి చేయిపట్టి నడిపించిన నాన్న చనిపోతే..ఆ విషాదం నుంచి తేరుకోవాలంటే అంత సులభమేమీ కాదు. మరి ‘ఆకాశమంత’ ప్రేమను కురిపించి, తన జీవితానికి మార్గదర్శిగా నిలిచిన నాన్న కానరాని లోకాలకు వెళ్లిపోతే ఓ కన్న కూతురు ఆవేదన ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అలాంటిది తండ్రి మరణించాడని తెలిసినా, స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌కు హాజరైంది ఓ మహిళా ఇన్స్పెక్టర్. మాస్కు మాటున దుఃఖాన్ని దిగమింగుతూ దేశభక్తిని చాటింది. అప్పగించిన పరేడ్ బాధ్యతలు పూర్తయ్యాకే తండ్రి అంత్యక్రియలకు బయలుదేరి తన వృత్తి నిబద్ధతను చాటుకుంది.
నాన్న చనిపోయినా..
తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలిలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తోంది ఎన్ మహేశ్వరి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏటా జరిగే పరేడ్‌లో జిల్లా కలెక్టర్‌కు తనే గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వాలి. ఈసారి కూడా ఆమే ఇవ్వాలని ఆదేశాలు అందాయి. దీంతో ఇండిపెండెన్స్‌డే పరేడ్ కోసం విస్తృతంగా రిహార్సల్స్ చేసింది మహేశ్వరి. వేడుకకు ముందు శుక్రవారం (ఆగస్టు 14) కూడా పరేడ్ రిహార్సల్స్‌లో పాల్గొని ఇంటికెళ్లిన ఆమెకు ఓ విషాద వార్త తెలిసింది. తిరునల్వేలికి 230 కిలోమీటర్ల దూరంలో ఉండే వడమదురైలో ఉన్న ఆమె తండ్రి నారాయణ స్వామి అనారోగ్య కారణాలతో కన్నుమూశాడని ఆ వార్త సారాంశం.
రెండు వారాలుగా సమస్యలతో సతమతం!
తిరునల్వేలి సిటీ పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న మహేశ్వరి భర్త బాలమురుగన్ కొద్ది రోజుల క్రితమే కరోనా బారిన పడ్డాడు. రెండు వారాలుగా క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నాడు. ఓవైపు భర్త ఆరోగ్యంపై ఆందోళన, మరోవైపు ఇంట్లోని పిల్లల బాగోగులపై బెంగ, అదేవిధంగా ఇన్స్పెక్టర్గా విధుల నిర్వహణ...ఇలా రెండు వారాలుగా సతమతమవుతోంది మహేశ్వరి. అంతలోనే తండ్రి మరణం ఆమెను మరింత కుంగదీసింది. ఓవైపు తండ్రిని కడసారి చూసుకోవాలన్న తాపత్రయం... మరోవైపు తెల్లారితే ఇండిపెండెన్స్‌డే పరేడ్.. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాలేదామెకి. కొద్దిసేపు సంయమనంతో ఆలోచించిన మహేశ్వరి పరేడ్ డ్యూటీకే ప్రాధాన్యమిచ్చింది. తాను వెళ్లిపోతే, ఇంత తక్కువ సమయంలో మరొకరు పరేడ్ బాధ్యతలు చూసుకోవడం కష్టమని గ్రహించి వృత్తి నిర్వహణకే ఓటు వేసింది.
దుఃఖాన్ని దాచుకుంటూ!
ఈ క్రమంలో తన తండ్రి మరణించిన విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరైంది మహేశ్వరి. మాస్కు మాటున దుఃఖాన్ని, గంభీరమైన తన గళంతో ఆవేదనను కప్పిపుచ్చి ముందుండి మరీ పరేడ్‌ను నడిపించింది. వృత్తి నిబద్ధతను చాటుతూ జిల్లా కలెక్టర్ శిల్పా ప్రభాకర్‌కు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చింది. ఈక్రమంలో తండ్రి మరణవార్త తెలిసినప్పటి నుంచి సుమారు 13 గంటల పాటు దుఃఖాన్ని దిగమింగుతూనే పరేడ్‌ను విజయవంతంగా పూర్తి చేసిందీ సూపర్ పోలీస్. పరేడ్ పూర్తయిన మరుక్షణమే అధికారుల అనుమతితో 230 కిలోమీటర్ల దూరంలోని వడమదురైకు వెళ్లి తండ్రి అంత్యక్రియలకు హాజరైంది. ఎట్టకేలకు తన తండ్రిని కడసారి చూసుకుని కన్నీటి నివాళి అర్పించింది. అప్పటికి కానీ అధికారులు, మహేశ్వరి సహచరులు ఈ విషయం తెలుసుకోలేపోయారు. ఈ క్రమంలో ఆమె అంకిత భావం పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కూడా ఆమెను చూస్తుంటే గర్వంగా ఉందని తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. పర్సనల్ సెంటిమెంట్‌ను పక్కన పెట్టిన ఆమె ఎంతో ప్రొఫెషనల్‌గా పరేడ్‌ను నిర్వహించిందని ప్రశంసిస్తున్నారు.
తండ్రి మరణాన్ని దిగమింగుతూ డ్యూటీకే ప్రాధాన్యమిచ్చింది మహేశ్వరి. దుఃఖాన్ని దాచుకుని మరీ దేశభక్తిని చాటింది. తన వృత్తి నిబద్ధతతో అందరి మన్ననలు అందుకుంటోన్న ఈ మహిళా పోలీస్‌కు మనమూ ‘సెల్యూట్’ చేద్దాం!