ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ప్రపంచమంతా ఆసక్తి చూపిస్తుంది. అందుకు తగ్గట్టే నవంబర్‌లో జరిగే ఈ ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పీఠం ఎక్కేందుకు రిపబ్లిక్, డెమొక్రటిక్ పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను మరింత సమర్థంగా ఎదుర్కొ నేందుకు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్ష పదవి అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఈ అవకాశం దక్కించుకున్న తొలి నల్ల జాతీయురాలిగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు కమల.
తొలి మహిళగా!
అగ్రరాజ్య చరిత్రలో ఇంతవరకూ మహిళలు అధ్యక్షులుగా కానీ ఉపాధ్యక్షులుగా కానీ గెలిచిన దాఖలాలు లేవు. ఈక్రమంలో వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ విజయం సాధిస్తే ఉపాధ్యక్ష పదవిని చేపట్టే తొలి మహిళగా కమల కొత్త అధ్యాయం లిఖించే అవకాశం ఉంది. ఇప్పటికే కాలిఫోర్నియా సెనేటర్‌గా తన పాలనా దక్షతను చాటుకున్న ఈ ఇండో అమెరికన్ గురించి మరికొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం రండి.
భారతీయ మూలాలు!
కమలా హ్యారిస్.. అన్న పేరే చెబుతుంది ఆమె భారతీయ మూలాలున్న వ్యక్తి అని. ఆమె తల్లి శ్యామలా గోపాలన్. చెన్నైకి చెందిన శ్యామల చదువు నిమిత్తం అమెరికా వెళ్లి.. అక్కడే శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు. కమల తండ్రి డొనాల్డ్. జమైకా దేశానికి చెందిన ఆయన ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. క్యాలిఫోర్నియాలోని ఓక్‌ల్యాండ్‌లో జన్మించిన కమల.. తల్లి భారతీయురాలు కాబట్టి భారతీయ అమెరికన్, తండ్రి ఆఫ్రికన్ కాబట్టి ఆఫ్రికన్ అమెరికన్ అయ్యారు. ‘చిన్నప్పుడు చెన్నై బీచ్‌లో తాతగారితో గడిపిన క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తే..’ అంటూ తన భారతీయ మూలాలను నెమరు వేసుకుంటారు కమల.
తొలి నల్ల జాతీయురాలిగా..
హోవార్డ్ విశ్వవిద్యాలయం నుంచి కమల ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశారు. క్యాలిఫోర్నియా యూనివర్సిటీ పరిధిలోని హేస్టింగ్స్ కాలేజ్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టరేట్ అందుకొన్నారు. హోవార్డ్‌లో చదువుతున్నప్పుడే విద్యార్థి నాయకురాలిగా పోటీ చేశారామె. చదువు పూర్తి చేసిన తర్వాత క్యాలిఫోర్నియాలోని అలమెడా కౌంటీకి డిప్యూటీ డిస్ట్రి క్ట్ అటార్నీగా (1990-98) పని చేశారు. శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో కెరీర్ క్రిమినల్ యూనిట్లో మేనేజింగ్ అటార్నీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై శాన్ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీ జనరల్‌గా రెండు పర్యాయాలు ఎన్నికై సమర్థంగా తన బాధ్యతలు నిర్వహించారు కమల. 2003లో ఆ పదవి చేపట్టిన కమల 2011 వరకు అందులోనే కొనసాగారు. ఆపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు. ఈ సమయంలో ఆమె చిన్నారుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. ఇక 2017లో కాలిఫోర్నియా సెనేటర్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. తద్వారా కరోల్ మోస్లే తర్వాత అమెరికన్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో అడుగుపెట్టిన తొలి నల్ల జాతీయురాలిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
ఆమె కూతురిగా చెప్పుకోవడమే నాకు ఇష్టం!
కమలకు ఏడేళ్ల వయసున్నప్పుడే వారి తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో సింగిల్ పేరెంట్‌గానే ఇద్దరు కూతుళ్ల బాధ్యతలను స్వీకరించారు తల్లి శ్యామలా గోపాలన్. ఈక్రమంలో ఓ మహిళగా తాను సాధించిన విజయాలన్నింటికీ అమ్మే కారణమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు కమల. ‘సంప్రదాయ కట్టుబాట్లను అధిగమించి 19 ఏళ్ల వయసులో ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చింది ఓ అమ్మాయి (శ్యామలా గోపాలన్). బ్రెస్ట్ క్యాన్సర్‌పై పరిశోధనలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అమ్మే నాకు స్ఫూర్తి. తనే నా రియల్ హీరో. నాతో పాటు నా సోదరి మాయకు అమ్మ భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని వివరించేది. ఈ పదవులు, గౌరవాల కంటే శ్యామలా గోపాలన్ కూతురిగా చెప్పుకోవడమే నాకు అసలైన గౌరవం’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారీ ఇండో అమెరికన్.
సవతి పిల్లలతో గడపడమంటే ఇష్టం!
కమలా హ్యారిస్ డోగ్లాస్ ఎమ్హోప్ను 2014లో వివాహం చేసుకున్నారు. తనకున్న బాధ్యతల దృష్ట్యా ఎప్పుడూ బిజీగా సమయం గడిపే కమలకు తన సవతి పిల్లలతో ఆడుకోవడమంటే చాలా ఇష్టం. ఇక న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకున్న కమల సోదరి మాయ హిల్లరీ క్లింటన్ న్యాయవాదిగా, సలహాదారుగా పనిచేశారు.
ట్రంప్‌ను ఓడించబోతున్నాం!
ట్రంప్‌కు పోటీగా డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా మొదట కమలా హ్యారిస్ ఎంపికయ్యారు. అందుకు తగ్గట్టుగానే ప్రచారపర్వంలో కూడా దూసుకెళుతూ ఓటర్లను ఆకట్టుకున్నారు. అయితే గతేడాది డిసెంబర్లో అనూహ్యంగా అధ్యక్ష రేసు నుంచి తప్పుకొని అందరినీ ఆశ్చర్యపరిచారామె. అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ ట్రంప్‌పై తన పోరాటం కొనసాగుతుందని ఆ సందర్భంలో చెప్పుకొచ్చారామె. అందుకు అనుగుణంగానే ట్రంప్ విధానాలపై విశ్లేషణాత్మక విమర్శలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌కు ఎన్నికల వ్యూహకర్తగా కూడా వ్యవహరిస్తున్నారామె. ఈ క్రమంలో అమెరికా ఉపాధ్యక్ష పదవి అభ్యర్థిగా కమలను ఎంపిక చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు జో బిడెన్. ఈ సందర్భంగా తామిద్దరం కలిసి ట్రంప్‌ను ఓడించబోతున్నామంటూ ధీమా వ్యక్తం చేశారు.
మహిళలందరూ గర్వపడే సమయం!
ఈ సందర్భంగా కమలా హ్యారిస్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈక్రమంలో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా సోషల్ మీడియా వేదికగా ఆమెకు అభినందనలు తెలిపింది. ఇన్‌స్టాలో కమల ఫొటోను షేర్ చేస్తూ ‘ ఈ ఎంపిక మహిళలందరికీ గర్వకారణం. అన్ని వర్ణాలకు చెందిన మహిళలు, నల్లజాతీయ మహిళలు, దక్షిణాసియా మహిళలందరూ గర్వపడే సమయమిది. అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతోన్న మొదటి భారతీయ, నల్లజాతీయురాలైన కమలకు అభినందనలు’ అని రాసుకొచ్చింది.
ఈ ఎన్నికల్లో కమలా హ్యారిస్ గెలిస్తే మాత్రం అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కీర్తి గడించనున్నారు. అంతేకాకుండా తొలి ఇండియన్-అమెరికన్, ఆఫ్రికన్‌గా చరిత్ర సృష్టించనున్నారు.
Photo: Instagram