యుద్ధం.. ఈ మాట వింటేనే ఒళ్లంతా ముచ్చెమటలు పడతాయి.. సినిమాల్లో యుద్ధ సన్నివేశాలు చూస్తేనే గుండె భయంతో కంపించిపోతుంది. అలాంటిది నిజంగా ఆ యుద్ధభూమిలోకి వెళ్లి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే..? అమ్మో..! కనీసం ఆ ఆలోచన చేయడం కూడా మన తరం కాదు.. కానీ ఆ సదవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా, దేశ సేవలో ఎప్పుడెప్పుడు తరిద్దామా అని దాదాపు ఐదేళ్ల పాటు ఎదురుచూసిందామె. 1999లో కార్గిల్ యుద్ధంలో పాల్గొనే అవకాశం రావడంతో ధైర్యంగా శత్రువుల చెరలోకి ప్రవేశించి గాయపడిన భారత సైనికుల్ని సురక్షిత స్థావరాలకు తరలించింది.. అలా యుద్ధభూమిలో హెలికాప్టర్ నడిపిన తొలి మహిళగా చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. యస్.. ఆమే ది గ్రేట్ వుమన్ సోల్జర్ గుంజన్ సక్సేనా!
ఎవరైనా కంఫర్ట్ జోన్లో ఉండాలనుకుంటారు.. కానీ గుంజన్ మాత్రం భారత వైమానిక దళంలో చేరాలని కలలు కంది. ‘అందరిలా నేనెందుకు ఉండాలి? అమ్మాయిలు ఆర్మీలో చేరితే తప్పేంటి? భరతమాతకు సేవ చేసే అదృష్టం అబ్బాయిలకే ఎందుకు దక్కాలి? అమ్మాయిలూ అంతటి ధైర్యసాహసాలు ప్రదర్శించే ధీరవనితలే’ అంటూ తన చిన్ననాటి కలను సాకారం చేసుకొని నలుగురిలో ఒక్కరిగా గుర్తింపు సంపాదించుకుంది గుంజన్. అందుకే ఆ ధీర సాహసాన్ని ‘గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్’ పేరుతో వెండితెరపై ఆవిష్కరించేందుకు సన్నద్ధమయ్యారు బాలీవుడ్ దర్శకుడు శరణ్ శర్మ. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో ఓటీటీ వేదికగా ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ రియల్ హీరో గురించి తెలుసుకుందాం రండి..
‘ఆపరేషన్ విజయ్’ అంటే మనలో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం గురించి తెలియని వారుండరు. ఆనాడు పాకిస్థాన్‌తో జరిగిన భీకర యుద్ధంలో 527 మంది సైనికులు అమరులయ్యారు. 1400 మందికి పైగా గాయపడ్డారు. ఇది జరిగి 20 ఏళ్లు పూర్తయింది. అయినా ఆ యుద్ధంలో శత్రు సైన్యాన్ని ఎదిరించే క్రమంలో సైనిక వీరులు ప్రదర్శించిన ధైర్యసాహసాలను దేశం ఎన్నటికీ మర్చిపోలేదు. అలాంటి సైనికుల్లో గుంజన్ సక్సేనా ఒకరు. మరి, ఈ రణభూమిలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో.. గాయపడ్డ భారత సైనికులను తన ప్రాణాలకు తెగించి సురక్షిత స్థావరాలకు చేర్చి, కార్గిల్ యుద్ధంలో పాలుపంచుకున్న తొలి యోధురాలిగా నిలిచిందీ ధీర.
వారే ఆదర్శం..
గుంజన్ తండ్రి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో కంబాట్ ఏవియేటర్‌గా పనిచేశారు. ఆమె అన్న కూడా ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా విధులు నిర్వర్తించారు. వారిద్దరి దేశభక్తి గుంజన్ని ఎంతో ప్రభావితం చేసింది. దానికి తోడు తనకూ చిన్నప్పటి నుంచే రక్షణ రంగంలోకి ప్రవేశించాలన్న ఆసక్తి ఉంది. ఫలితంగా అప్పుడే ఇండియన్ ఆర్మీలో చేరాలని దృఢంగా నిర్ణయించుకుంది. ఐదేళ్ల వయసులో ఎయిర్ ఫోర్స్‌లో పనిచేస్తున్న తన కజిన్ మొదటిసారిగా కాక్‌పిట్‌ని తనకు పరిచయం చేశాడని, ఎయిర్ పైలట్ అవ్వాలన్న ఆలోచనకి అది బలమైన పునాది వేసిందని, దాంతో ఎప్పుడెప్పుడు ఎయిర్‌ఫోర్స్‌లో చేరే అవకాశమొస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూశానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
చదువుకుంటూనే లక్ష్య సాధన..
తన వయసుతో పాటే ఆర్మీలో చేరాలన్న తన ఆలోచన కూడా మరింత బలపడింది. గుంజన్ ఆశయాన్ని కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా అంగీకరించారు. దిల్లీలోని హన్స్‌రాజ్ కాలేజీలో డిగ్రీ చదువుతూనే ఆమె సర్వీస్ సెలక్షన్ బోర్డ్ పరీక్షలకు సన్నద్ధమైంది. అదే సమయంలో సఫ్దర్‌జంగ్ ఫ్త్లెయింగ్ క్లబ్లో చేరి పైలట్‌గా రాణించడానికి అవసరమైన మెలకువలు నేర్చుకుంది. డిగ్రీ పూర్తి కాగానే SSB పరీక్షలో విజయం సాధించింది. అదే సమయంలో (1994లో) భారత వాయుసేన మొదటిసారిగా మహిళల్ని IAF పైలట్లుగా నియమించుకోవడానికి సంకల్పించింది. ఈ విషయం తెలుసుకున్న గుంజన్ ఒక్కసారిగా ఎగిరి గంతేసింది. తాను కలలు కన్న ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నానన్న ఆనందంతో ఉప్పొంగిపోయింది. అలా భారత వాయుసేన నియమించుకున్న మొదటి 25 మంది మహిళా పైలట్లలో గుంజన్ స్థానం సంపాదించుకుంది. జమ్ము-కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఆమెకు పోస్టింగ్ ఇచ్చారు. ఇలా దేశంలోనే మొట్టమొదటి మహిళా కంబాట్ ఏవియేటర్‌గా కీర్తి గడించింది గుంజన్.
‘కార్గిల్ గర్ల్’గా మారిందలా..!
యుద్ధ విమాన పైలట్‌గా ఉద్యోగం అయితే సంపాదించింది కానీ దేశానికి సేవ చేయాలన్న అవకాశం ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూసేది గుంజన్. అనుకున్నట్లుగానే అలాంటి అసలు సిసలైన అవకాశం 1999 కార్గిల్ యుద్ధం ద్వారా ఆమెను వరించింది. ‘ఆపరేషన్ విజయ్’గా పిలిచే ఈ యుద్ధంలో భాగంగా గాయపడిన యుద్ధవీరులకు అవసరమైన మందులను అందించడం, వారిని బేస్ క్యాంప్‌కు తరలించడం వంటి పనులను కంబాట్ పైలట్త్లెన గుంజన్ సక్సేనా, శ్రీవిద్యా రాజన్‌లకు అప్పగించారు. ఈ క్రమంలో 'చీతా' అనే హెలికాప్టర్లో ఎటువంటి బలమైన ఆయుధాలు లేకున్నా ఎంతో సాహసోపేతంగా పాకిస్థాన్ సరిహద్దుల్లోని భారత వీరులను సురక్షితంగా బేస్ క్యాంప్‌కు తరలించింది గుంజన్. ఏ క్షణాన్నైనా తన హెలికాప్టర్‌ను శత్రువు కూల్చవచ్చని గ్రహించిన గుంజన్.. తన దగ్గర ఒక అసాల్ట్ రైఫిల్, ఒక రివాల్వర్ పెట్టుకొని ఆకాశంలో ఎగిరేది. ఒకసారి కార్గిల్ స్ట్రిప్ మీద ఆమె హెలికాప్టర్ టేకాఫ్ అవుతూ ఉండగా ఆమెను లక్ష్యంగా చేసి పేల్చిన రాకెట్ లాంచర్ కొంచెంలో తప్పి పక్కన ఉన్న కొండ చరియను తాకింది. దీంతో తృటిలో ప్రమాదం తప్పినట్లయింది. అయినా ఏమాత్రం జంకు లేకుండా తన పని తాను చేసుకుపోయింది గుంజన్. అలా కార్గిల్ యుద్ధంలో తాను చూపిన తెగువ, ధైర్యసాహసాల వల్లే ఆమెకు ‘కార్గిల్ గర్ల్’గా పేరొచ్చింది.
భారత ప్రభుత్వం కూడా ఆమెను ‘శౌర్య చక్ర’ పురస్కారంతో సత్కరించింది. ఈ అవార్డు అందుకున్న తొలి భారత మహిళగా ఖ్యాతి గడించింది గుంజన్. ఆమె భర్త ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా విధులు నిర్వర్తించేవారు. ఈ జంటకు ప్రగ్య అనే కూతురు ఉంది. 2004 జులైలో గుంజన్ ఉద్యోగ విరమణ పొందింది. ప్రస్తుతం ఆమె గుజరాత్ జామ్‌నగర్‌లో నివాసముంటోంది.
బట్టలు మార్చుకోవాలన్నా ఇబ్బందే!
ఈ ప్రపంచంలో ప్రతి రంగంలో పురుషాధిక్యత ఉన్నట్లే అప్పట్లో త్రివిధ దళాల్లో సైతం మగవారిదే పైచేయి. అలాంటి సమయంలో తొలి మహిళా యుద్ధ విమాన పైలట్‌గా గుంజన్ ఎంపికైనప్పుడు ఈ రంగంలో ఏదో మహిళలున్నారా అంటే ఉన్నారులే అన్నట్లుగా ఉండేవి అప్పటి పరిస్థితులు. దీంతో పోస్టింగ్ ఇచ్చిన చోట మహిళలకు సరైన సౌలభ్యాలు కూడా లేవంటూ ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది గుంజన్.
‘ఉద్యోగం వచ్చాక నాకు తొలిసారిగా జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో పోస్టింగ్ ఇచ్చారు. నాతో పాటు నా కోర్స్ మేట్ కూడా ఉంది. ఇద్దరం కలిసి యూనిట్‌కి చేరుకున్నాం. అయితే అక్కడ మహిళల కోసం ప్రత్యేకంగా వాష్‌రూమ్స్ ఏవీ లేవు. దీంతో దుస్తులు మార్చుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్లం. అందుకే యూనిఫాంలో విధులకు వెళ్లిన మేము అదే యూనిఫాంతో తిరిగి ఇంటికి చేరుకునే వాళ్లం. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో దుస్తులు మార్చుకోవాల్సి వస్తే మాత్రం అక్కడ రెండు గోడలకు ఎల్-ఆకృతిలో ఉన్న అల్మరాతో ఒక చిన్న గదిలా ఉన్న ఏర్పాటుండేది. నేను మార్చుకున్నప్పుడు నా ఫ్రెండ్, తను మార్చుకున్నప్పుడు నేను డోర్ దగ్గర కాపలా ఉండేవాళ్లం. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకు మహిళల కోసం ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేశారు. కాలక్రమేణా మహిళల అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని వారి కోసం చాలా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి..’ అంటూ నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారీ సూపర్ సోల్జర్.
|
అలా ఇప్పుడు మళ్లీ తెరపైకి..!
ఒక మహిళ తలచుకుంటే ప్రతికూల పరిస్థితుల్ని కూడా తనకు సానుకూలంగా మార్చుకోవచ్చని నిరూపించిన ఈ ధీర జీవితకథను వెండితెరపై ఆవిష్కరించారు బాలీవుడ్ దర్శకుడు శరణ్ శర్మ. ‘గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్’ పేరుతో రూపొందించిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ గుంజన్‌గా నటించింది. అయితే ఈ సినిమా రూపుదిద్దుకుంటున్న దగ్గర్నుంచి తన నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ మళ్ళీ వార్తల్లో నిలుస్తున్నారు రియల్ హీరో గుంజన్. ఈ క్రమంలో- గుంజన్ జీవితానికి సంబంధించిన కొన్ని అరుదైన ఫొటోలను కొలేజ్ చేసి, జాన్వీ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌ను జతచేసి రూపొందించిన ఓ వీడియోను నెట్‌ఫ్లిక్స్ ఇండియా మొన్నామధ్య యూట్యూబ్‌లో విడుదల చేయగా వైరల్‌గా మారింది.
ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని! దాదాపు నిమిషం నిడివి గల ఈ వీడియో తననూ ఎంతగానో ఆకట్టుకుందని చెప్పుకొచ్చారు రియల్ లైఫ్ గుంజన్. ఈ నేపథ్యంలో ఈ సినిమా పోస్టర్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసిన ఆమె.. దానికి ఓ సుదీర్ఘమైన క్యాప్షన్‌ను జతచేశారు. ‘నా జీవితంలోని మధుర క్షణాలను రంగరించి రూపొందించిన ఈ వీడియో నన్ను కట్టిపడేసింది. ఇక ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో జాన్వీ వాయిస్ అద్భుతంగా ఉంది. నా గత జ్ఞాపకాలు ఇంత అందంగా నా కళ్ల ముందు కదలాడడం చాలా అరుదు. నా వయసులో ఉన్న ప్రతి ఒక్కరికీ చెప్పడానికి ఒక కథంటూ ఉంటుంది. అయితే తమ కథను వెండితెరపై చూసే అదృష్టం నాలాంటి అతి కొద్ది మందికే దక్కుతుంది. ఈ క్రమంలో శరణ్, జాన్వీ లాంటి వృత్తి పట్ల అంకితభావం గల వ్యక్తులు నాకు దొరకడం మరో అదృష్టం. ఏ జీవిత ప్రయాణమూ పార్కులో నడిచినంత సులభమైంది కాదు.. నా జీవితమూ అందుకు భిన్నం కాదు.. కానీ ఒక దశలో మన లక్ష్యంపై మనకున్న దృష్టే మనల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఐఏఎఫ్‌లో ఉన్నప్పుడు నేను ఏదైతే సాధించానో.. బ్లూ యూనిఫాంలో ఉన్న ఇతర మహిళలు, పురుషుల (తోటి సైనికుల గురించి ప్రస్తావిస్తూ) ద్వారానే అది నాకు సాధ్యమైంది. నా జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా చూసి అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. కేవలం ఇది నా జీవిత కథ మాత్రమే కాదు.. శరణ్, ఆయన బృందం కలిసి చేసిన హార్డ్ వర్క్ కూడా!’ అంటూ తన మనసులోని మాటల్ని పంచుకున్నారు గుంజన్.
|
పాత్రకు ప్రాణం పోయడానికి..!
వెండితెరపై పాత్రలకు ప్రాణం పోయడం మన ముద్దుగుమ్మలకు వెన్నతో పెట్టిన విద్య. బాలీవుడ్ అందాల తార జాన్వీ అందులో తక్కువేమీ కాదు. గుంజన్ పాత్ర కోసం ఆమె సంతకం చేసిన నాటి నుంచే ఆ పాత్రకు అంకితమైంది మన జూనియర్ శ్రీదేవి. ఈ క్రమంలో తన ఫిజిక్‌లో మార్పులు చేసుకోవడం, నిరంతరం గుంజన్‌తో టచ్‌లో ఉంటూ ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడం.. ఇలా తాను గుంజన్‌గా నటిస్తున్నానన్నట్లుగా కాకుండా రియల్ గుంజన్లా సినిమాలో ఒదిగిపోయిందీ బాలీవుడ్ భామ. అంతేనా.. ఈ సినిమా కోసం పైలట్ పాఠాలు కూడా నేర్చుకుందీ క్యూట్ గర్ల్.
|