‘అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం’ అంటూ దేశ ప్రజలంతా రామ నామ స్మరణతో భక్త సంద్రంలో మునిగితేలారు. శ్రీరామ చంద్రుడి జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిరానికి అంకురార్పణ జరగడమే దీనికి కారణం. ఎట్టకేలకు ఎన్నో అవరోధాలు దాటుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ఈ కోవెల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలనేది హిందువుల చిరకాల కోరిక. అందుకే భూమి పూజ జరుగుతున్న సమయంలోనే ప్రముఖులతో పాటు సామాన్యులు వారి ఇంటి వద్దనే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదే సమయంలో రాముని కోవెల కోసం ఓ మహిళ 28 ఏళ్లుగా చేస్తున్న తన సుదీర్ఘ ఉపవాస దీక్షకు ముగింపు పలికింది.
నిత్యం రామ నామ స్మరణలో!
ఊర్మిళా చతుర్వేది....మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన ఈమె వయసు 82 ఏళ్లు. అయోధ్యలో రాముడి ఆలయం కోసం 28 ఏళ్ల పాటు భోజనం ముట్టని ఈ అభినవ ఊర్మిళ కల ఎట్టకేలకు నేటితో సాకారమైంది.

1992 డిసెంబర్ 6న రామాలయ నిర్మాణం విషయంలో అయోధ్యలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. అప్పుడు ఊర్మిళ వయసు 53 సంవత్సరాలు. ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందిన ఆమె అయోధ్యలో మళ్లీ రామాలయ నిర్మాణానికి రాయి పడేవరకూ ముద్ద ముట్టుకోనని నిర్ణయించుకుంది. పలుమార్లు కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఆమెను అన్నం తినమని బతిమాలినప్పటికీ, ఊర్మిళ వారి మాట వినలేదు. కేవలం ఒకటి రెండు పండ్లు, కాసిన్ని పాలతోనే పొట్ట నింపుకొంటోంది. ఇంట్లోనే రామ దర్బారును ఏర్పాటు చేసుకుని నిత్యం రామ నామ స్మరణ చేస్తూ గడుపుతోంది.
శ్రీరాముడి దర్శనమే నాకు పునర్జన్మ!
28 ఏళ్లుగా కేవలం పండ్లు, పాలు తప్ప ఇతర అన్నపానీయాలు ముట్టని ఊర్మిళ... గత ఏడాది నవంబరులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కాస్త కుదుటపడింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని, అక్కడ రామమందిరం నిర్మించుకోవచ్చునని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ప్రకటించాక ఎంతో సంతోషించారామె. అయితే ఉపవాస దీక్షను మాత్రం విరమించలేదు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఎంతగా వేడుకున్నా ఊర్మిళ వెనకడుగు వేయలేదు. ‘నేను అయోధ్యకు వెళ్లి ఆ శ్రీరాముని మందిరాన్ని దర్శించుకోవాలి. అదే నాకు పునర్జన్మ. భూమి పూజ అనంతరం అయోధ్యకు వెళ్లి, సరయూ నదిలో పవిత్ర స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ ఉపవాస దీక్ష విరమిస్తాను’ అని ఆ సందర్భంగా చెప్పుకొచ్చారామె. ఇందుకు కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు.
అమ్మా! మీ భక్తికి ప్రణమిల్లుతున్నా!
ఈ నేపథ్యంలో ఊర్మిళ ఉపవాస దీక్ష గురించి తెలుసుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ వేదికగా ఆమెపై ప్రశంసలు కురిపించారు. ‘శ్రీరాముడు తన భక్తులను ఎప్పటికీ నిరాశపరచడు. త్రేతాయుగం నాటి శబరి అయినా, ఈ యుగం నాటి ఊర్మిళమ్మ(ఊర్మిళా చతుర్వేది) అయినా! అమ్మా, మీ భక్తికి ప్రణమిల్లుతున్నాను. దేశమంతా మీకు వందనాలు అర్పిస్తోంది! జై శ్రీరాం!’ అని రాసుకొచ్చారు.
ఇంట్లోనే దీక్ష విరమణ!
కరోనా ప్రభావం నేపథ్యంలో రామ మందిర భూమి పూజకు పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులను ఆహ్వానించారు. దీంతో అయోధ్య వెళ్లి ఉపవాస దీక్ష విరమించాలన్న ఊర్మిళకు నిరాశే ఎదురైంది. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ భూమి పూజ జరిగే సమయంలోనే ఇంట్లోనూ పూజ చేసి, ఆ ప్రసాదంతోనే తిరిగి ఆహారం తీసుకుందామె. తద్వారా తన 28 ఏళ్ల సుదీర్ఘ ఉపవాస దీక్షను ముగించింది.