Image for Representation
త్యాగానికి మారు పేరు ‘అమ్మ’. తన కన్న బిడ్డల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడడం అమ్మకు తప్ప మరెవరికీ సాధ్యం కాదేమో అనడం అతిశయోక్తి కాదు. తన పిల్లల ఆకలి తీర్చడానికి తాను పస్తులుంటుంది.. వారిని చదివించి ప్రయోజకుల్ని చేయడానికి ఎన్ని కష్టాలనైనా ఇష్టంగా భరిస్తుంది. అలాంటి మాతృమూర్తికి మరో రూపంగా నిలిచారు ఓ ఇద్దరు తల్లులు. తమ కన్న బిడ్డల కోసం వారు చేసిన త్యాగం ప్రస్తుతం అందరిచేతా జేజేలు కొట్టిస్తోంది. మరి, ఇంతకీ ఎవరా తల్లులు? తమ పిల్లల కోసం వాళ్ళు చేసిన త్యాగమేంటి? రండి.. తెలుసుకుందాం!
కర్ణాటకలోని గడగ్ జిల్లాకు చెందిన కస్తూరి అనే మహిళ తన భర్తతో కలిసి రోజువారీ కూలీ పనులు చేస్తుంటుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు సంతానం. తమలాగే తమ పిల్లల భవిష్యత్తు నాశనం కాకూడదని భావించిన ఆ తల్లి ఎంత కష్టమైనా పిల్లల్ని చదివిస్తోంది. అయితే కరోనా మహమ్మారి అందరి బతుకుల్లో నిప్పులు పోసినట్లే వారి బతుకుల్నీ ఛిద్రం చేసింది. ఈ వైరస్ ప్రభావంతో ఎక్కడా కూలీ పనులు కూడా లేక ఉపాధి కోల్పోయారు కస్తూరి దంపతులు. దీంతో కుటుంబ పోషణ మరింత భారంగా మారిందీ జంటకు.
ఆన్లైన్ క్లాసులని చెప్పడంతో..!
ఈ ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో స్కూల్ కూడా లేకపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు కస్తూరి పిల్లలు. అయితే ఈ మహమ్మారికి చెక్ పెట్టే వరకూ అక్కడి విద్యార్థులందరికీ టీవీల ద్వారా ఆన్లైన్ క్లాసుల్ని చెప్పాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్నే ఇటీవల ప్రకటించేసరికి కస్తూరి కుటుంబానికి ఒక్కసారిగా గుండెల్లో రాయి పడ్డట్లయింది. అందుకు కారణం.. వారింట్లో టీవీ లేకపోవడమే! అసలే రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. అలాంటి నిరుపేద కుటుంబంలో టీవీ అంటే కాస్త కష్టమే అనుకోవచ్చు. ‘అలాగని పిల్లల్ని చదువుకు దూరం చేయలేను.. ఇప్పటికిప్పుడు టీవీ కొందామంటే అంత డబ్బు నా దగ్గర లేదు.. ఎలా?’ అని గుండెల మీద చెయ్యేసుకొని ఆలోచిస్తున్న ఆమెకు.. తన మెడలో ఉన్న మంగళసూత్రం గుర్తొచ్చింది.

పిల్లల కోసం తప్పలేదు!
అయితే ఆడవాళ్లు ఎంతో పవిత్రంగా భావించే, భార్యాభర్తల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఆ పవిత్రమైన తాళిని తాకట్టుపెట్టాలని ఏ మహిళా కోరుకోదు. కానీ తన పిల్లల కోసం వేరే దారి లేక తన మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి టీవీ కొన్నానని చెబుతోంది కస్తూరి. ‘నేను, నా భర్త రోజువారీ కూలీ పనులు చేస్తుంటాం. ఈ కరోనా వల్ల మాకు ఆ పని కూడా లేకుండా పోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో తినడానికే తిండి గింజలు లేవు. అలాంటిది టీవీ అంటే మాతో కాని పని. అలాగని చదువు పేరుతో నా పిల్లల్ని రోజూ ఇరుగుపొరుగు వాళ్లిళ్లకు పంపడం కరక్ట్ కాదు. అందుకే నా పిల్లల కోసం నా మెడలో ఉన్న మంగళసూత్రం తాకట్టు పెట్టాలని నిర్ణయించుకున్నా. ఇలా వచ్చిన రూ. 20 వేలలో రూ. 14 వేలు పెట్టి టీవీ కొన్నా. ఇప్పుడు నా పిల్లలు ఎక్కడికీ వెళ్లే పనిలేకుండా ఇంట్లోనే ఉండి చదువుకోవచ్చు.. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది..’ అంటూ చెప్పుకొచ్చిందీ మాతృమూర్తి.
అమ్మ త్యాగం వల్లే!
ఇలా అమ్మ చేసిన త్యాగానికి పిల్లలు స్పందిస్తూ.. ‘అమ్మ త్యాగం వల్లే ఇప్పుడు మా ఇంట్లో టీవీ ఉంది.. మేం చదువుకోగలుగుతున్నాం.. బాగా చదువుకొని అమ్మకు ఇంతకంటే మంచి మంగళసూత్రం కొనిస్తాం..’ అంటూ చెప్పుకొచ్చారా పిల్లలు.
బంగారు చెవి రింగులతో కూతురి భవిష్యత్‌కు బాటలు!
ఇక ఒడిషాలోని కటక్ జిల్లాలోని సాలేపూర్కు చెందిన రిటాభోయ్ దంపతులది కూడా ఇదే కథ. రోజు కూలీలైన ఈ జంటకు ఎనిమిదో తరగతి చదువుతున్న అర్చితతో పాటు మరో కుమారుడున్నాడు. లాక్డౌన్లో ఎలాంటి ఉపాధి పనులు దొరక్కపోవడంతో చాలా రోజుల నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నారీ దంపతులు. పాఠశాలలు కూడా మూతపడడంతో ఇద్దరు పిల్లలు కూడా ఇంటికే పరిమితమయ్యారు.
 ఆన్లైన్ తరగతుల కోసం! ఈ నేపథ్యంలో లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ఒడిషా ప్రభుత్వం ఆన్లైన్ తరగతులకు అనుమతినిచ్చింది. కరోనా ప్రభావం తగ్గేంతవరకు ‘మధు’ అనే ఓ యాప్ సహాయంతో వర్చువల్ తరగతులు నిర్వహించాలని అక్కడి ప్రభుత్వ పాఠళాలలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా అక్కడి ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓ వాట్సప్ గ్రూప్‌ను క్రియేట్ చేసి అందులో విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్స్, వీడియో లెక్చర్స్ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో స్వయంగా విద్యార్థుల ఇంటికెళ్లి తల్లిదండ్రుల వాట్సప్ నంబర్లను సేకరిస్తున్నారు. అయితే స్వేదం చిందిస్తే కానీ పూటగడవని రిటాభోయ్ కుటుంబంలో ఎలాంటి స్మార్ట్‌ఫోన్ సౌకర్యం లేదు. దీంతో తన చదువుకు ఆటంకం కలగకూడదని భావించిన అర్చిత కొన్ని రోజుల పాటు తన స్నేహితుల దగ్గరికెళ్లి స్టడీ మెటీరియల్‌ను తెచ్చుకుంది. బంగారు చెవి రింగులు అమ్మేసి! అసలే ఇది కరోనా కాలం. ఈ క్రమంలో చదువు కోసం తన కూతురును ఎక్కడికో ఒంటరిగా పంపించడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు రిటాభోయ్. దీంతో తన బంగారు చెవి రింగులను అమ్మేసి తన కూతురికి స్మార్ట్ ఫోన్ కొనిచ్చింది. ‘లాక్డౌన్ కారణంగా మాకెలాంటి ఉపాధి దొరకడం లేదు. ఇంట్లో ఉన్న గింజలతో పొట్ట నింపుకొంటున్నాం. ఈ పరిస్థితుల్లో స్మార్ట్‌ఫోన్ కొనడమంటే మాకు తలకుమించిన భారమే. అలాగని నా కూతురి చదువును ఆపలేం. పైగా ఉపాధ్యాయలు మా దగ్గరకు వచ్చి ‘అర్చిత చాలా తెలివైనది. బాగా చదువుకుంటోంది. అయితే ప్రస్తుత ఆన్లైన్ తరగతులకు హాజరుకాకపోతే తను బాగా వెనకబడిపోయే అవకాశం ఉంది’ అని చెప్పారు. ఈ పరిస్థితుల్లో చదువు పేరుతో నా కూతురిని ఎక్కడో ఉన్న తన స్నేహితుల ఇంటికి పంపడం కూడా సమంజసం కాదు. అందుకే నా బంగారు చెవి దిద్దులను అమ్మగా వచ్చిన మొత్తం రూ.8 వేలలో రూ.7 వేలు పెట్టి ఓ స్మార్ట్ ఫోన్ కొన్నాను. ఇప్పుడు నా కూతురు చదువు కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు’.. అమ్మిచ్చిన పెళ్లి కానుకతో! ‘నాకు 2006లో వివాహమైంది. అప్పుడు మా అమ్మ ఎంతో ప్రేమగా ఈ బంగారు చెవి రింగులను నాకు బహూకరించింది. నా పెళ్లి కానుకగా వచ్చిన ఈ చెవి దిద్దులను నా తర్వాత అర్చితకు ఇవ్వాలని ఆ సందర్భంలో చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నా కూతురు చదువు కొనసాగించేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గం కనిపించలేదు. అందుకే వాటిని అమ్మేసి స్మార్ట్‌ఫోన్ కొన్నాను. మా ఆర్థిక పరిస్థితులు నా బంగారు తల్లి భవిష్యత్‌కు ప్రతిబంధం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. గతేడాది సంభవించిన ‘ఫణి’ తుపాన్ కారణంగా మా ఇల్లు పూర్తిగా దెబ్బతింది. దీంతో ఇంటి నిర్మాణం కోసం మేం ఇప్పటికే బ్యాంక్‌లో లోన్ తీసుకున్నాం. ఈ లోన్ తీర్చేందుకే అష్టకష్టాలు పడుతున్నాం. ఇక నా కుమారుడు కూడా ఇక్కడే ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. తన రీ అడ్మిషన్‌కి కూడా డబ్బులు కావాలి. అయితే ఎలాగోలా వాడికి కూడా డబ్బులు సర్దుతాం’ అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పుకొచ్చింది రీటా.
|
పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించడమే పరమావధిగా భావించే తల్లి మనసు వారి బంగారు భవిష్యత్ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడుతుందని మరోసారి నిరూపించారు ఈ ఇద్దరు మాతృమూర్తులు.