పితృస్వామ్యం.. ఎన్నో ఏళ్లుగా మన సమాజంలో వేళ్లూనుకుపోయిందీ వ్యవస్థ. ఆడపిల్లలపై పక్షపాత ధోరణి చూపే అలాంటి వ్యవస్థలోంచి పుట్టిందో అగ్నికణం. ‘నువ్వు బలహీనురాలివి’ అన్నారు.. ‘కాదు.. మగాళ్లను మించిన బలవంతురాలిని’ అని నిరూపించింది. ‘అది నీ వల్ల కాద’న్నారు.. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది.. తన తపన, తండ్రి ప్రోత్సాహంతో దేశం గర్వించే స్థాయికి చేరుకుంది.. యుద్ధభూమిలో హెలికాప్టర్ నడిపిన తొలి మహిళా పైలట్‌గా చరిత్ర పుటల్లో తనకంటూ ప్రత్యేకంగా ఓ అధ్యాయాన్నే లిఖించుకుంది.
ఆమే.. ది గ్రేట్ సోల్జర్ గుంజన్ సక్సేనా. ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తిప్రదాతగా మారిన ఆమె జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు దర్శకుడు శరణ్ శర్మ. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..
21 ఏళ్ల క్రితం జరిగిన భీకర కార్గిల్ యుద్ధంలో గాయాల పాలైన భారత సైనికులను తన చీతా హెలికాప్టర్లో క్షేమంగా బేస్‌క్యాంప్‌కు తరలించిన ధీర వనిత గుంజన్ సక్సేనా. ఓవైపు శత్రువులు బాంబుల వర్షం కురిపిస్తున్నా.. వారి చెరకు చిక్కకుండా మెరుపు వేగంతో తన హెలికాప్టర్లో దూసుకుపోయిన ఆమె.. యుద్ధభూమిలో హెలికాప్టర్ నడిపిన తొలి మహిళా పైలట్‌గా చరిత్రలో నిలిచిపోయారు. మరి, ఆమె ఈ స్థాయికి చేరుకోవడానికి, అదీ మహిళలపై పక్షపాతం చూపించే ఆ రోజుల్లో అంటే.. అందుకు ఆమె ఎంతగా కష్టపడిందో, ఎన్ని సవాళ్లను ఎదుర్కొందో మాటల్లో చెప్పడం అసాధ్యం. అందుకే ఆమె జీవితాన్ని ‘గుంజన్ సక్సేనా - ది కార్గిల్ గర్ల్’ పేరుతో సినిమాగా రూపొందించారు బాలీవుడ్ దర్శకులు శరణ్ శర్మ.
‘ఆమె’ ఒక్కర్తే!
బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో భాగంగా ‘ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలనుకుంటే మీరొక సైనికుడవ్వాలి.. లేదంటే ఇంటికెళ్లి వంట చేసుకోండి..’ అనే నేపథ్య డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. చిన్నారి గుంజన్ ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూసి తాను ఎప్పటికైనా పైలట్ కావాలనుకుంటుంది. అదే విషయాన్ని తన తండ్రితో పంచుకోవడం, చుట్టూ ఉన్న వాళ్లు ‘నువ్వు ఆడపిల్లవు.. ఇవన్నీ నీకెందుకన్నా’ కూడా.. ఆయన మాత్రం ఆమెను ఆ దిశగా ప్రోత్సహించడం, ఇలా తండ్రి ప్రోత్సాహంతో ఎన్నో ఒడిదొడుకుల్ని ధైర్యంగా ఎదుర్కొని పైలట్‌గా మారుతుంది గుంజన్. అయినా అక్కడా ఆమెకు వివక్షే ఎదురవుతుంది. కారణం.. ఆ ఎయిర్‌ఫోర్స్ పైలట్స్ బృందంలో ఆమె ఒక్కర్తే మహిళ కావడం. ఈ క్రమంలో ఆమె పై అధికారులు ‘నువ్వు మహిళవు.. అంటే నువ్వు బలహీనురాలివి..’ అంటూ పదే పదే కించపరచడం, కనీసం ఆ ఎయిర్‌ఫోర్స్ శిక్షణ కేంద్రంలో మహిళలకంటూ ప్రత్యేకంగా వాష్‌రూమ్ కూడా లేని పరిస్థితుల్లో తాను ఎదుర్కొన్న కష్టాలు.. వంటివన్నీ ట్రైలర్లో కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు శరణ్.
నిన్ను ఓడిపోనివ్వను నాన్నా..!
నేటి మహిళలు సాధించిన విజయాలతోనో, లేదంటే లింగ సమానత్వం దిశగా పోరాటం చేస్తోన్న మహిళల వల్లో ఈ రోజుల్లో మహిళలకు ఎంతో కొంత గౌరవమైనా దక్కుతోంది.. కానీ ఆ రోజుల్లో మహిళల పట్ల ఎంత వివక్ష ప్రదర్శించేవారో, మహిళల్ని ఎంత బలహీనులుగా చూసేవారో సినిమాలో చక్కగా చూపించారు. అయినా అన్ని సవాళ్లనూ ఎదుర్కొంటూ గుంజన్ తనని తాను నిరూపించుకున్న తీరు మహిళలందరికీ ఆదర్శం అని చెప్పచ్చు. ఇక గుంజన్ పాత్రలో జాన్వీ నటన అద్భుతమంటున్నారు ఫ్యాన్స్, పలువురు సినీ ప్రముఖులు.
ఇక ఈ ట్రైలర్లో భాగంగా ‘ఆడ-మగ.. వీరిలో విమానం ఎవరు నడిపినా పైలట్ అనే అంటారు..’ అంటూ తన కూతురు గుంజన్‌ను ప్రోత్సహిస్తూ ఆమె తండ్రి చెప్పే డైలాగ్స్; ‘అన్నయ్య ఆర్మీలో చేరినప్పుడు నేనెందుకు చేరకూడదు?’, ‘నాన్నా.. నేను నీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. నిన్ను నేను ఎప్పటికీ ఓడిపోనివ్వను..’ అంటూ గుంజన్ చెప్పే డైలాగ్స్; తండ్రీ-కూతుళ్ల మధ్య జరిగే సన్నివేశాలు.. వంటివన్నీ అందరినీ ఎంతో భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. ఇక జాన్వీ కూడా ఈ చిత్రంలో తన హావభావాలతో చక్కటి నటన కనబరిచింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న కథానాయికగా ఈ సినిమాలో ఒదిగిపోయిందీ జూనియర్ అతిలోక సుందరి.
కరణ్ జోహర్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో గుంజన్ తండ్రిగా పంకజ్ త్రిపాఠి, గుంజన్ అన్నయ్యగా అంగద్ బేడీ.. తదితరులు నటించారు. ఈ సినిమా ఆగస్టు 12న ఓటీటీలో విడుదల కానుంది.
Photo: Screengrab
Also Read:
గుంజన్ సక్సేనా నుంచి 'కార్గిల్ గర్ల్'గా!
ఆ జ్ఞాపకాలు మళ్లీ కళ్ల ముందుకొస్తున్నాయ్!