పర్యావరణ పరిరక్షణ.. ఏళ్లకేళ్లుగా ఇది మాటలకే పరిమితమవుతోందే తప్ప, చేతల దాకా రావట్లేదు. వాతావరణం విషయంలో మనం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చేస్తోన్న తప్పిదాలే ప్రస్తుతం కరోనా మహమ్మారి వంటి ఎన్నో అనర్థాలకు కారణమవుతున్నాయి. అయితే కొంతమంది పర్యావరణ ప్రియులు ప్రకృతితో మమేకమై వాతావరణాన్ని సంరక్షించడానికి నడుం బిగించినప్పటికీ.. ఈ బృహత్కార్యం ఏ ఒక్కరితోనో అయ్యేది కాదు.. ప్రతి ఒక్కరూ ఇందులో పాలుపంచుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. తద్వారా మనం ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా జీవించచ్చు.. అలాగే రాబోయే తరానికీ స్వచ్ఛమైన గాలిని అందించచ్చు. ఈ క్రమంలో - పర్యావరణ పరిరక్షణ కోసం తమ విలువైన సలహాలు, సూచనలు అందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఏడుగురు యువ కార్యకర్తల్ని ఎంపిక చేసింది ఐక్యరాజ్యసమితి. అందులో మన దేశం నుంచి ఒడిశా రూర్కెలాకు చెందిన అర్చనా సోరెంగ్ చోటు దక్కించుకోవడం విశేషం.
వయసుతో సంబంధం లేకుండా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నడుం బిగించారు. ప్రకృతి ప్రేమికులుగా అందరి మన్ననలు అందుకుంటున్నారు. అలాంటి వారిలో ఒడిశాలోని రూర్కెలాకు చెందిన అర్చనా సోరెంగ్ ఒకరు. చిన్న వయసు నుంచే ప్రకృతి, పర్యావరణం పట్ల ప్రేమ పెంచుకున్న ఈ యంగ్ లేడీ.. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పర్యావరణ పరిరక్షణ గురించి తన గళాన్ని వినిపించింది. పాట్నా మహిళల కళాశాలలో పొలిటికల్ సైన్స్ విభాగంలో బీఏ (ఆనర్స్) పూర్తి చేసిన అర్చన.. ముంబయిలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) నుంచి రెగ్యులేటరీ గవర్నెన్స్ విభాగంలో ఎంఏ పట్టా అందుకుంది. ఇక్కడ చదువుకునే రోజుల్లోనే విద్యార్థి సంఘం నాయకురాలిగా పని చేసింది.
రీసెర్చ్ ఆఫీసర్‌గా..!
గతంలో ఆదివాసీ యువ చేతనా మంచ్ (ఆలిండియా క్యాథలిక్ యూనివర్సిటీ ఫెడరేషన్ (ఏఐసీయూఎఫ్)కు చెందిన ఆదివాసీ కమిషన్)లోని ట్రైబల్ కమిషన్‌లో జాతీయ కన్వీనర్‌గా పనిచేసింది అర్చన. ప్రస్తుతం ఒడిశాలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్)కు చెందిన ఫారెస్ట్ రైట్స్ అండ్ గవర్నెన్స్ ప్రాజెక్ట్‌కి రీసెర్చ్ ఆఫీసర్‌గా కొనసాగుతోందీ యువతేజం. అంతేకాదు.. అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వెబినార్లు కూడా నిర్వహిస్తోందీ యంగ్ యాక్టివిస్ట్. తను పాల్గొనే వివిధ జాతీయ, అంతర్జాతీయ సమావేశాల్లో తమ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే ఆహార్యంతో ఆకట్టుకోవడం అర్చన ప్రత్యేకత. ఇక ఈ ప్రకృతి ప్రేమికురాలి సోషల్ మీడియా పేజీల్లో కూడా తాను పచ్చదనం మధ్యే దిగిన ఫొటోలు దర్శనమిస్తాయి.
ఏడుగురిలో ఒక్కరిగా..!
అడవులను నరకడం, బొగ్గు గనుల తవ్వకాలు చేపట్టడం.. వంటి పనుల వల్ల పర్యావరణానికి బోలెడంత నష్టం కలుగుతుందని వాదించే ఈ యంగ్ యాక్టివిస్ట్.. తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటుచేసిన అడ్వైజరీ గ్రూప్‌లో అర్చనకు స్థానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసున్న యువ పర్యావరణ వేత్తలకు చోటు దక్కే ఈ బృందంలో వివిధ దేశాల నుంచి ఏడుగురిని ఎంపిక చేశారు. అందులో మన దేశానికి చెందిన అర్చన ఒకరు. వీళ్లంతా ఈ బృందంలో సభ్యులుగా ఉంటూ.. పర్యావరణ పరిరక్షణ కోసం సరికొత్త ప్రణాళికలు రచించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించాలి. ఈ యూఎన్ బృందంలో అర్చనతో పాటు మరో ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు చోటు దక్కించుకున్నారు.
ఇప్పుడా బాధ్యత మనదే!
ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ.. ‘మన పూర్వీకులు వారికున్న అనుభవం, జ్ఞానాన్ని బట్టి ఏళ్లకేళ్లుగా అడవుల్ని, వాతావరణాన్ని సంరక్షించుకుంటూ వచ్చారు. వెలకట్టలేని, స్వచ్ఛమైన బహుమతిని మనకు అందించారు. ఇప్పుడు ఆ బాధ్యత మనపై పడింది. ప్రస్తుతం మనమే ముందుండి ఈ వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవాలి.. రాబోయే తరాల వారికి స్వచ్ఛమైన గాలిని అందించాలి..’ అని కోరుతోందీ పర్యావరణ ప్రేమికురాలు.
పర్యావరణ పరిరక్షణ అనేది అందరూ కలిసి కట్టుగా శ్రమిస్తేనే సాధ్యమవుతుంది.. కాబట్టి ఈ యువ పర్యావరణవేత్తలతో మనమూ చేయి కలుపుదాం.. తద్వారా ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడదాం.. ఇలాంటి విపత్తులు మరెన్నడూ రాకుండా జాగ్రత్తపడదాం.. రాబోయే తరాల వారికి స్వచ్ఛమైన వాతావరణాన్ని బహుమతిగా అందిద్దాం.. ఏమంటారు?!
Photo: Instagram