కరోనాపై పోరులో భాగంగా విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు కూడా వివిధ రూపాల్లో పోరాటం చేస్తున్నారు. ప్రధానంగా ఇండియాకు చెందిన వైద్యులు, నర్సులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా రోగులకు వైద్య సేవలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో సింగపూర్‌లో స్థిరపడ్డ భారతీయ నర్సు కళా నారాయణసామి కూడా ఆపత్కాలంలో కరోనా బాధితులకు సేవలందించింది. వైరస్‌కు వ్యతిరేకంగా ఆమె చేస్తోన్న సేవలకు గుర్తింపుగా అక్కడి ప్రభుత్వం ఆమెను ప్రతిష్ఠాత్మక ప్రెసిడెంట్స్ పురస్కారంతో గౌరవించింది.
నర్సింగ్‌లో 40 ఏళ్ల అనుభవం!
ప్రపంచంపై పగబట్టినట్లు అన్ని దేశాలపై విరుచుకుపడుతోంది కరోనా వైరస్. అయితే సింగపూర్‌లో మాత్రం ఈ మహమ్మారి ఆటలు సాగడం లేదు. ఇప్పటివరకు అక్కడ కేవలం 27 మంది మాత్రమే ఈ వైరస్‌కు బలయ్యారు. అందుకు కారణం అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ఠ చర్యలే కారణం. ప్రత్యేకించి అక్కడి ఆధునిక వైద్య విధానాలే కరోనాను కట్టడి చేస్తున్నాయని చెప్పవచ్చు. ఇక అక్కడి వైద్యులు, నర్సులు కూడా కొవిడ్ వైరస్‌పై అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఈక్రమంలో నర్సింగ్ వృత్తిలో 40 ఏళ్ల అనుభవమున్న కళా నారాయణసామి కూడా ఈ వైరస్ వ్యతిరేక పోరులో పాలుపంచుకుంటోంది. 2003లో ప్రపంచాన్ని పట్టి పీడించిన సార్స్ వైరస్ వ్యతిరేక పోరులోనూ భాగస్వామురాలైన ఆమె తన అనుభవంతో వీలైనంతమంది కరోనా రోగులను కాపాడుతోంది.
అత్యున్నత పురస్కారం!
సేవకు మారుపేరుగా నిలిచే నర్సింగ్ వృత్తిలో రాణిస్తోన్న వారి సేవలకు గుర్తింపుగా సింగపూర్ ప్రభుత్వం వారిని ‘ప్రెసిడెంట్స్’ పురస్కారంతో గౌరవిస్తోంది. నర్సింగ్కు సంబంధించి అత్యున్నత గౌరవ పురస్కారమైన ఈ అవార్డును గత 20 ఏళ్లలో కేవలం 77 మంది నర్సులు మాత్రమే అందుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడి వుడ్ ల్యాండ్ హెల్త్ క్యాంపస్‌లో నర్సింగ్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలందిస్తున్న కళా నారాయణసామి కూడా ఈ పురస్కారాన్ని అందుకుంది. ఈసారి ఆమెతో పాటు మొత్తం ఐదుగురు నర్సులు ఈ అవార్డు అందుకున్నారు. ఈ పురస్కారం కింద ట్రోఫీ, సింగపూర్ అధ్యక్షురాలు హలీమా యాకోబ్ సంతకం చేసిన సర్టిఫికెట్తో పాటు పదివేల సింగపూర్ డాలర్ల (ఇండియన్ కరెన్సీలో సుమారు 5.4 లక్షలు) నగదు బహుమతిని ఆమె అందుకుంది.
నర్సింగ్‌లో తనకున్న అనుభవంతో టెక్నాలజీ పరంగా ఈ వృత్తికి మరిన్ని ఆధునిక హంగులు అద్దేందుకు విశేషంగా కృషి చేస్తోంది కళా నారాయణసామి. ఈ క్రమంలో ‘సెల్ఫ్ చెకవుట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ వెండింగ్ మెషీన్ తో పాటు ఇమేజ్ క్యాప్చర్‌తో గాయం తీవ్రతను గుర్తించే పలు ప్రాజెక్టుల్లో భాగస్వామురాలైందీ సూపర్ నర్స్. ఇక కరోనాపై పోరులో భాగంగా ఈ వైరస్ తీవ్రతకు అనుగుణంగా రోగుల వార్డులను రడీ చేయడం, ఆధునిక వైద్య ప్రమాణాలతో రోగులకు చికిత్స అందేలా చేయడంలో సఫలీకృతమయ్యారామె. ఈ క్రమంలోనే నర్సింగ్ వృత్తిలో అత్యున్నత పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ‘2003లో ప్రపంచాన్ని పట్టి పీడించిన సార్స్ వైరస్ నుంచి నేను చాలా నేర్చుకున్నా. అప్పటి అనుభవంతోనే కరోనా రోగులకు సేవలందిస్తున్నా. నేను ఏమీ ఆశించకుండా ప్యాషన్‌తో మాత్రమే ఈ వృత్తిలోకి వచ్చాను. అయితే నా ప్రొఫెషన్ కారణంగానే నాకెంతో గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా నర్సింగ్ వృత్తిలోకి వచ్చే వారందరికీ ఒక విషయం చెబుదామనుకుంటున్నా...ఇష్టం, అభిరుచితో ఏ పనిచేసినా ఎప్పుడో ఒకసారి కచ్చితంగా మనకు అందాల్సిన గుర్తింపు, ప్రతిఫలం దక్కి తీరుతాయి’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ కరోనా వారియర్.
మరి కరోనాపై పోరులో భాగంగా అవిశ్రాంతంగా సేవలందిస్తున్న కళా నారాయణసామి లాంటి నర్సులు, వైద్య సిబ్బందికి మనం కూడా హ్యాట్సాప్ చెబుదాం.!
Photo: Facebook