శారీరక కారణాలను సాకుగా చూపుతూ సైన్యంలో అతివలపై కొనసాగుతున్న వివక్షకు తెరపడింది. ఇక సైనిక దళాల్లో పురుషులతో పాటు సమానంగా ‘ఆమె’ కూడా అందలమెక్కవచ్చు. ఈక్రమంలో మహిళా సాధికారతకు బాటలు పడేలా భారత సైన్యంలోని మహిళా అధికారులకు కూడా శాశ్వత కమిషన్ ఏర్పాటు కానుంది. తాజాగా దీనికి సంబంధించి భారత ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మహిళా సైనికాధికారులు పదవీ విరమణ వయసు వరకూ ఆర్మీలోని ఆయా విభాగాల్లో సేవలందించేందుకు వీలు కలుగుతుంది. సైన్యంలో ఉన్నత పదవులు చేపట్టేందుకు మార్గం సుగమమవుతుంది.
మొత్తం 10 విభాగాల్లో సేవలు!
సైనిక దళాల్లో లింగ వివక్షకు ముగింపు పలికే దిశగా మరో ముందడుగు పడింది. ప్రస్తుతం సైన్యంలో మహిళల నియామకానికి సంబంధించిన షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ) స్థానంలో ‘శాశ్వత కమిషన్’ రానుంది. దీంతో శారీరక కారణాలతో ఇన్ని రోజులు సైనిక సవాళ్లకు దూరమైన మహిళలు ఇక పురుషులతో సమానంగా పదవీ విరమణ వయసు వరకూ సేవలందించే అవకాశం ఉంది. ఈమేరకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సైన్యంలోని మొత్తం 10 విభాగాల్లో మహిళలు సేవలు అందించనున్నారు. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్(AAD), ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్ (EME), ఆర్మీ సర్వీసెస్ కాప్స్(ASC), ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్(AOC), జడ్జ్ అండ్ అడ్వొకేట్ జనరల్ (JAG), ఆర్మీ ఎడ్యుకేషనల్ కాప్స్ (AEC), సిగ్నల్స్, ఆర్మీ ఏవియేషన్, ఇంటెలిజెన్స్, ఇంజినీరింగ్ విభాగాల్లో మహిళలు ప్రవేశించవచ్చు.
షార్ట్ సర్వీస్ కమిషన్ కింద తొలుత మహిళలను ప్రాథమికంగా ఐదేళ్ల సమయానికి ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ఆ కాల వ్యవధిని 14 ఏళ్ల వరకు పొడిగిస్తున్నారు. ఇక శాశ్వత కమిషన్.. పదవీ విరమణ వయసు వరకూ ఆర్మీలోని ఆయా విభాగాల్లో సేవలందించేందుకు వీలు కల్పిస్తుంది.
17 ఏళ్ల న్యాయ పోరాటానికి తెర !
రక్షణ రంగానికి సంబంధించి ఎయిర్ఫోర్స్, నేవీల్లో పనిచేస్తున్న మహిళలకు ఇప్పటికే శాశ్వత కమిషన్ ఏర్పాటైంది. దీంతో అక్కడి మహిళలు పురుషులతో సమానంగా పదవీ విరమణ వయసు వరకూ సేవలందిస్తున్నారు. ఉన్నత పదవులు అలంకరిస్తున్నారు. అయితే సైన్యంలో మాత్రం సమాన హక్కులు సాధించుకోవడానికి 17 ఏళ్ల న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సైనిక దళాల్లో కూడా లింగ వివక్షకు ముగింపు పలికే దిశగా ఈ ఏడాది ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అతివల శారీరక పరమైన పరిమితుల కారణంగా కమాండ్ హోదా ఇవ్వడం లేదన్న వాదనలను తప్పుపట్టింది. మూడునెలల్లోగా మహిళలందరికీ శాశ్వత కమిషన్ ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా సైన్యంలోని పది విభాగాల్లో మహిళా ఎస్ఎస్సీ అధికారులకు పర్మనెంట్ కమిషన్ ఇస్తామంటూ గత ఏడాది ఫిబ్రవరి 25న కేంద్రం తెచ్చిన విధానానికి సర్వోన్నత న్యాయస్థానం ఆమోదముద్ర వేసింది.
ఇక సైన్యంలో కూడా సమానమే!
మెడికల్, డెంటల్, మిలిటరీ, నర్సింగ్ విభాగాలను పక్కన పెడితే ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో మహిళల ప్రాతినిథ్యం కేవలం 3.89 శాతం మాత్రమే. ఇదే క్రమంలో నేవీలో ఇది 6.7 శాతం ఉండగా, ఎయిర్ఫోర్్ాలో 13.28 శాతంగా ఉంది. ఇప్పటివరకు ఎస్ఎస్సీ కమిషన్ ద్వారానే ఆర్మీలోకి అడుగుపెట్టిన మహిళలు 14 ఏళ్లకు మించి సైన్యంలో సేవలందించలేకపోయారు. ఇదేక్రమంలో ‘సర్వీస్ ఎక్స్టెన్షన్’ కింద 14 ఏళ్లకు మించి సేవలందించిన మహిళలు పురుషుల్లా శాశ్వత కమిషన్ తరహా ప్రయోజనాలు పొందలేకపోయారు. ఈనేపథ్యంలో సుప్రీం ఆదేశాల మేరకు ఇప్పటివరకు ఎస్ఎస్సీ కింద ఉన్న మహిళా అధికారులందరినీ శాశ్వత కమిషన్ కిందకు తీసుకువచ్చేలా భారత ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో 14 ఏళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న మహిళాధికారులు మొత్తం 300మంది ఉన్నారు. తాజా ఉత్తర్వులతో ఈ 300మంది మహిళాధికారులు సైన్యంలో మరిన్ని ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది.