సాధారణంగా అరవై ఏళ్లు పైబడిన బామ్మలు ఏం చేస్తారు? అప్పటికే బాధ్యతలన్నీ తీరిపోయి ఉంటాయి కాబట్టి ఇంట్లోనే హాయిగా విశ్రాంతి తీసుకుంటూ కాలం గడుపుతుంటారు. ఇంట్లో ఉన్న మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. ఒంట్లో సత్తువ తగ్గి పోయిన వారు చిన్న చిన్న పనులు చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే పుణెకు చెందిన ఓ బామ్మ మాత్రం 75 ఏళ్ల వయసులోనూ కర్రసాము విన్యాసాలు చేస్తోంది. కరోనా కష్టకాలంలో రెండు కర్రలను చకాచకా తిప్పుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఈ నేపథ్యంలో రితేష్ దేశ్‌ముఖ్, రణ్దీప్హుడా, సోనూసూద్ తదితర బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు పలువురు నెటిజన్లు కూడా ఆమె అద్భుతమైన కర్రసాము ఫీట్లకు ఫిదా అవుతున్నారు. ఎలాగైనా ఆ వృద్ధురాలి జాడను కనుక్కుని సాయం చేస్తామంటూ ముందుకొస్తున్నారు.
75 ఏళ్ల వయసులో కర్ర తిప్పుతూ!
‘కూటి కోసం కోటి విద్యలు’ అన్నట్లు తన రెండు చేతి కర్రల సహాయంతోనే కడుపు నింపుకొంటోంది పుణెకు చెందిన ఆజీమా. ఎంతో నైపుణ్యం, అనుభవం ఉంటే తప్ప సాధ్యం కాని కర్రసాము విన్యాసాలు చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటోంది. వయసు పైబడినప్పటికీ రెండు కర్రలను చకాచకా తిప్పుతుంటే రోడ్లపై వెళుతున్న జనాలు కూడా నిలబడి కన్నార్పకుండా చూస్తున్నారు. ఈక్రమంలో ముఖానికి మాస్క్ వేసుకుని రోడ్లపై కర్రసాము చేస్తున్న ఈ బామ్మకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్లో షేర్ చేశాడు. దీంతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయిందీ సూపర్ బామ్మ.
ఆమెతో ఓ ట్రైనింగ్ స్కూల్‌ను ప్రారంభిస్తా!
ఈ నేపథ్యంలో కరోనా తెచ్చిన కష్టకాలంలోనూ ఆత్మాభిమానంతో ఎవరిపైనా ఆధారపడకుండా తనకు తెలిసిన విద్యతో కుటుంబాన్ని పోషించుకుంటోన్న ఈ వృద్ధురాలిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా బాలీవుడ్ నటులు రితేష్ దేశ్‌ముఖ్, రణ్దీప్హుడా, సోనూసూద్ తదితరులు ఈ వీడియోను చూసి ఈ వృద్ధురాలి గురించి అన్వేషించడం మొదలుపెట్టారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఆమె వివరాలు పంపాలని నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.
‘ఈ వృద్ధురాలి వివరాలు నాకు తెలియజేయండి. ఆమెతో ఒక ట్రైనింగ్ స్కూల్‌ను ప్రారంభిస్తాను. మహిళల ఆత్మరక్షణకు అవసరమైన శిక్షణ ఇచ్చేలా ఏర్పాటుచేయిస్తా..’ అని సోనూసూద్ ట్వీట్ చేశాడు. ఇక రితేష్ దేశ్‌ముఖ్ ‘యోధురాలైన ఈ బామ్మ వివరాలు ఇవ్వగలరా?’ అంటూ తన ఫాలోవర్లను కోరగా, పలువురు నెటిజన్లు ఆజీమాకు సంబంధించిన వివరాలను షేర్ చేశారు. అదేవిధంగా గతంలో తాము కూడా ఆమెకు సహాయం చేశామని వివరిస్తూ ఆమెతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. దీంతో ‘ఎంతో స్ఫూర్తిదాయకమైన ఈ యోధురాలి వివరాలు తెలిశాయి. ఆమెది చాలా గొప్పకథ’ అంటూ నెటిజన్లకు ధన్యవాదాలు తెలియజేశాడీ హీరో.
ఇదేవిధంగా ఆజీమా పరిస్థితి తెలుసుకున్న ఓ స్వచ్ఛంద సంస్థ ఆమెను ఆదుకోవడానికి ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఆమె మనవరాళ్ల చదువుకయ్యే ఖర్చంతటినీ భరిస్తామని ప్రకటించింది. కరోనా తెచ్చిన ఆపత్కాలంలోనూ ఎవరి మీదా ఆధారపడకుండా కర్రసాముతో కుటుంబాన్ని పోషించుకుంటోన్న ఈ వృద్ధురాలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇలాంటి వారికి చేతనైనంతలో మనమూ సాయపడదాం.