సునీతా యాదవ్... గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఈ కానిస్టేబుల్ పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి కుమారుడు, అతడి స్నేహితులను నడిరోడ్డుపై ఆపి ప్రశ్నించడమే ఇందుకు కారణం. నిక్కచ్చిగా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిన ఈ మహిళా పోలీస్ ఇంటర్వ్యూల కోసం పలు టీవీ ఛానళ్లు పోటీ పడుతున్నాయి. ఇక నెటిజన్లు అయితే ఆమె చర్యలను మెచ్చుకుంటూ ‘లేడీ సింగం’ అని పిలుస్తున్నారు. ఈక్రమంలో రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిపోయిన సునీత తాజాగా మరో సంచలనానికి తెరతీసింది. తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమె ఐపీఎస్ ఆఫీసర్‌గా తిరిగొస్తానంటూ ప్రకటించింది. తాజాగా పలు టీవీ ఛానళ్లతో మాట్లాడిన ఈ డేరింగ్ కానిస్టేబుల్ తన భవిష్యత్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
మంత్రి కుమారుడిని నిలదీసి!
గుజరాత్ పోలీస్ శాఖకు చెందిన సునీత ఇటీవల తన విధి నిర్వహణలో భాగంగా సూరత్‌లో పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తోంది. కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న ఆ ప్రాంతంలో లాక్డౌన్ ఆంక్షలను కఠినంగా అమలుచేయాలని ఆదేశాలున్నాయి. అయితే అదే సమయంలో మంత్రి కుమారుడు, అతని స్నేహితులు యథేచ్ఛగా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. అర్ధరాత్రి వేళ వాహనాల్లో చక్కర్లు కొడుతున్న వారిని రోడ్డుపైనే నిలబెట్టి ప్రశ్నించింది సునీత. వారెవ్వరూ మాస్కులు ధరించకపోవడం, అర్ధరాత్రి బయటికి రావడానికి సహేతుకు కారణం చెప్పకపోవడంతో వారిని అలాగే రోడ్డుపైనే నిలదీసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో ఈ మహిళా పోలీస్ చర్యను అందరూ ప్రశంసించారు. ‘లేడీ సింగం’ అంటూ ఆమె ధైర్యాన్ని కొనియాడారు. అయితే ఆ తర్వాత పెట్రోలింగ్ డ్యూటీ నుంచి ఆమెను తప్పించడం, ఆ తర్వాత వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయడంతో మనస్తాపానికి గురైన సునీత తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. 'నిబంధనలను ఉల్లంఘించిన మంత్రి కొడుక్కి క్షమాపణ చెప్పడం కంటే నా ఉద్యోగానికి రాజీనామా చేయడమే ఉత్తమం అనుకుంటున్నా.. మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు' - అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది సునీత. ఈక్రమంలో రాజకీయాలు, పోలీసుల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
నేను లేడీ సింగం కాదు!
‘అందరూ నన్ను లేడీ సింగం అని పిలుస్తున్నారు. కానీ నేను అలా అనుకోవడం లేదు. నేను ఓ సాధారణ లోక్రక్షక్ దళ్ (గుజరాత్ పోలీసు విభాగం) ఆఫీసర్ని. నా వృత్తి ధర్మాన్ని మాత్రమే నేను నిర్వర్తించాను. అయితే ప్రజలందరూ నన్ను ‘లేడీ సింగం’ అని పిలుస్తుంటే సంతోషంగా ఉంది. ఇంతకుముందు పోలీసు దుస్తుల్లో పవర్ (అధికారం) ఉందని అనుకునేదాన్ని. అయితే అది పోలీస్‌కు సంబంధించిన ర్యాంకులో (హోదా) ఉన్నదని ఈ ఘటన నిరూపించింది. అందుకే నేను ఐపీఎస్‌కు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. ఈ సమస్య తేలిగ్గానే పరిష్కారమయ్యేది. కానీ పోలీస్ ఉద్యోగంలో సరైన ర్యాంక్ లేకపోవడం వల్ల నన్ను ఇప్పుడు బబుల్‌గమ్‌లా నమిలిపారేస్తున్నారు’...
వారిని వీవీఐపీలుగా పరిగణించడమా?
‘ఇక నేను నా ఉద్యోగానికి రాజీనామా చేయడానికి చాలా కారణాలున్నాయి. మంత్రి కుమారుడి ఘటనలో ఉన్నతాధికారులెవరూ నాకు అండగా నిలబడలేకపోయారు. అయినా వారెవరినీ నేను తప్పుపట్టను. మంత్రిగారి కుమారుడంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అలాంటిది అతడే నిబంధనలు ఉల్లంఘించాడు. పైగా అతడిని VVIP గా పరిగణించాలని మన సిస్టం చెబుతోంది. ఇది ఎంతవరకు సమంజసం? ఈ విషయంలో ఇప్పటికీ నాకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. అయితే ఏదేమైనా తదనంతర పరిణామాలు ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా చిన్నప్పుడు ఆర్మీలో చేరాలనుకున్నా. కానీ కొన్ని కారణాల వల్ల సైన్యంలో చేరలేకపోయాను. అయితే ఐపీఎస్‌కు ఎంపికై తిరిగి పోలీస్ శాఖలోకి వస్తాను. ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. ఎల్ఎల్బీ చేస్తాను. లేదా జర్నలిస్ట్‌ను అవుతాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ డేరింగ్ వుమన్.
ఈక్రమంలో వృత్తి ధర్మాన్ని నిక్కచ్చిగా పాటించిన సునీతా యాదవ్‌కు నెటిజన్లు అండగా నిలుస్తున్నారు. #iSupportsuneetayadav, #Weareallwithyou అంటూ ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Photo: Twitter