Image for Representation
కరోనా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పేరు వింటేనే ఆమడ దూరం పరిగెడుతున్నాం. అలాంటిది మన పక్కింట్లో ఎవరికైనా వైరస్ సోకితే అసలు అటువైపు కన్నెత్తైనా చూడం.. వారిని పన్నెత్తైనా పలకరించం. ఇక వాళ్లింట్లో ఎవరైనా పసి పిల్లలుంటే వారిని అక్కున చేర్చుకోవడానికి మనలో ఎవరూ ముందుకు రారు అనేది కాదనలేని సత్యం. కారణం.. మనకూ ఆ మహమ్మారి సోకుతుందేమోనన్న భయం! కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకున్న వారే రియల్ హీరో అనిపించుకుంటారు. తాజాగా కేరళకు చెందిన ఓ డాక్టరమ్మకు నెటిజన్లు ఇదే బిరుదుతో జేజేలు పలుకుతున్నారు. అయితే కొవిడ్ రోగులకు సేవ చేస్తున్నందుకు కాదు! మరి దేనికి.. అని అడుగుతారా? దేనికో.. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి!
ఎల్విన్.. తల్లి పాలు తాగుతూ, ఆమె పొత్తిళ్లలో ఒదిగిపోయి ఆదమరిచి నిద్రపోయే ఆరు నెలల పసి బాబు. వీడి తల్లిదండ్రులిద్దరూ కేరళలోని ఎర్నాకుళానికి చెందిన వారు. అయితే ప్రస్తుతం వీరు హరియాణా గుడ్‌గావ్‌లోని ఓ ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో నర్సులుగా పనిచేస్తున్నారు. ఇటీవలే ఎల్విన్ తండ్రికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో తన కొడుకు ఎల్విన్‌ని తీసుకొని తన సొంతూరికి చేరుకుందా తల్లి. అక్కడ తల్లీ బిడ్డలిద్దరికీ పరీక్షలు నిర్వహించగా తల్లికి పాజిటివ్, కొడుక్కి నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. అయినా సరే.. ఆ బాబును చూసుకోవడానికి వాడి తల్లిదండ్రుల తరఫు బంధువులెవరూ ముందుకు రాలేదు. ఇక ఎల్విన్ బామ్మ-తాతయ్యలు ముసలి వాళ్లు కావడంతో వాడి ఆలనా పాలన చూసుకోవడం వారికీ ఇబ్బందే!
కొడుకు గురించే తల్లడిల్లింది!
వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్న ఆ తల్లి.. తన చిన్నారి గురించి తల్లడిల్లిపోయింది. ఈ క్రమంలోనే అక్కడి జిల్లా శిశు సంరక్షణ కేంద్రంలో సంప్రదించినా వారికి తన పిల్లాడి బాధ్యతను అప్పగించడానికి ఆమెకు మనసు రాలేదు. కారణం.. వైరస్ ముప్పు ఎటు నుంచి ముంచుకొస్తుందో తెలియని భయం! అయితే ఇలాంటి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ తల్లికి.. డాక్టర్ మేరీ అనితా రూపంలో సహాయం చేశాడా భగవంతుడు. ఎర్నాకుళానికి చెందిన డాక్టర్ మేరీ అనితా కొచ్చిలో క్లినికల్ సైకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల సంక్షేమం కోసం అక్కడే ఓ స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతున్నారామె. జిల్లా శిశు సంరక్షణ కేంద్రం తనకు అందించిన సమాచారం మేరకు ఎల్విన్ తల్లిని సంప్రదించారు మేరీ.
అందుకు సంతోషంగా ఉంది!
‘నీకు నయమయ్యే వరకు నీ కొడుకును నా దగ్గర ఉంచు.. పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా..’ అంటూ కష్టంలో ఉన్న ఆ తల్లికి భరోసా ఇచ్చారీ డాక్టరమ్మ. అందుకు తల్లి కూడా వెంటనే అంగీకరించడంతో ఎల్విన్‌ని ఓ అమ్మలా అక్కున చేర్చుకున్నారు మేరీ. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఎల్విన్ తల్లి.. తనను నమ్మి తన బిడ్డ సంరక్షణను నాకు అప్పగించడం చాలా సంతోషంగా ఉందంటున్నారు మేరీ.
‘నాకు ముగ్గురు పిల్లలు. నేను నా భర్త, పిల్లలతో కలిసి కొచ్చిలోనే ఓ అపార్ట్మెంట్లో నివసిస్తుంటాను. ఎల్విన్ బాధ్యతలు స్వీకరించే ముందు ఈ విషయం గురించి నా భర్త, పిల్లలతో చర్చించా. అందుకు వారు సరేనన్నారు.. చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే ఎల్విన్ తల్లి దగ్గరికి వెళ్లి ఆమెకు ధైర్యం చెప్పి బాబును నా వెంట తెచ్చుకున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో బిడ్డను కుటుంబ సభ్యులకు కాకుండా మరొకరికి అప్పగించడానికి ఏ తల్లీ సాహసించదు.. అలాంటిది నాపై నమ్మకముంచి బాబు బాధ్యతను నాకు అప్పగించిందా తల్లి.. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది..’ అంటూ చెప్పుకొచ్చారు మేరీ.
బిడ్డ కోసం ఫ్లాట్ అద్దెకు..
ఇలా ఎల్విన్ కోసం తన అపార్ట్మెంట్లోని ఓ ఖాళీ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు మేరీ. అందులోనే ఉంటూ నెల రోజుల పాటు ఆ చిన్నారిని కంటికి రెప్పలా కాచుకున్నారు. ఈ క్రమంలో తన పిల్లలు, భర్త తనకు ఎంతగానో సహాయపడ్డారని అంటున్నారు మేరీ. ‘ఎల్విన్‌ని తీసుకొని మా అపార్ట్మెంట్లోని ఖాళీ ఫ్లాట్‌కు వచ్చేశా. నెల రోజులు అందులోనే ఉన్నా. ఈ క్రమంలో నా పిల్లలే నాకు, బాబుకు ఆహారం తీసుకొచ్చి ఇచ్చేవారు.. నా భర్త కూడా నాకు చాలా సహాయపడ్డారు. ఇక రోజూ వీడియో కాల్ ద్వారా బాబు తల్లిదండ్రులకు వాడిని చూపించేదాన్ని.. ఇటీవలే ఎల్విన్ తల్లిదండ్రులు వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. అందుకే బాబును తిరిగి వాళ్లకు అప్పగించేశాను. అలా వాడు వాళ్ల తల్లిదండ్రులను చూడగానే నవ్వుల పువ్వులు పూయించాడు..’ అంటూ తన అనుభవాలను పంచుకున్నారీ లవ్లీ మదర్.
ఆమెను దేవుడే పంపించాడు!
ఎల్విన్‌ను తల్లిదండ్రులకు అందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు మేరీ. ఎంతైనా తల్లి ప్రేమ, ఆమెలో ఉన్న భావోద్వేగాలు తన బిడ్డలపైనే కాదు.. ఏ బిడ్డలపైనైనా సమానంగా చూపించడం ఓ అమ్మకే సాధ్యం! ఇక నెల రోజుల తర్వాత తన కొడుకును చూసుకున్న ఆ తల్లికి కన్నీళ్లు ఉప్పొంగాయి. కళ్ల నుంచి ఆనందభాష్పాలు రాలుతుండగా.. వాడిని గట్టిగా గుండెలకు హత్తుకొని ముద్దాడిందా తల్లి. నెల రోజులు తమ బిడ్డను కంటికి రెప్పలా కాచుకున్న ఆ డాక్టరమ్మకు రుణపడి ఉంటామంటూ ఎల్విన్ తల్లిదండ్రులిద్దరూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.
‘మా బిడ్డను ఆదుకోవడానికి ఈ డాక్టరమ్మను ఆ దేవుడే పంపించాడు. నిజానికి కొవిడ్ రోగి బిడ్డను చూసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు చెప్పండి? అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో తన గురించి ఏమాత్రం ఆలోచించకుండా ముందుకొచ్చి మా బిడ్డను అక్కున చేర్చుకున్నారామె. ఆమెకు మేం ఎంతో రుణపడి ఉన్నాం. డాక్టర్‌కి, తన నిర్ణయాన్ని అంగీకరించిన ఆమె కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం..’ అంటూ తమ మనసులోని మాటల్ని పంచుకున్నారు బాబు పేరెంట్స్.
|
ఆమె.. మానవత్వానికి ప్రతిరూపం!
ఇలా డాక్టర్‌కి, బాబు తల్లిదండ్రులకు మధ్య జరిగిన ఈ సంఘటన అక్కడున్న వారందరినీ కదిలించింది. వారి ఆప్యాయతకు అక్కడున్న వారి కళ్లు చెమర్చాయి. ఇక ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఈ డాక్టరమ్మ రూపంలో మానవత్వం మరోసారి పరిమళించింది’ అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక మరోవైపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఫేస్బుక్ వేదికగా డాక్టర్ మేరీపై ప్రశంసల వర్షం కురిపించారు. మేరీ బాబును తన తల్లిదండ్రులకు అప్పగిస్తున్న ఫొటోను పంచుకున్న ఆయన.. ‘ప్రస్తుత ప్రతికూల పరిస్థితులను జయించడానికి మానవత్వం అనేది అన్నింటికంటే బలమైన ఆయుధం. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ డాక్టర్ మేరీ. కొవిడ్ బారిన పడిన తల్లిదండ్రుల బిడ్డను అక్కున చేర్చుకొని ప్రేమకు ప్రతిరూపంగా నిలిచారామె. ఇలాంటి త్యాగం, ప్రేమ ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో మనలో ఆశ చిగురింపజేస్తుంది.. మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. డాక్టర్ మేరీకి, ఆమె కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ఇలా మానవత్వం పరిమళించినన్నాళ్లూ ఏ శక్తీ, ఏ విపత్తూ మనల్ని జయించలేదు. ఇకపై మనందరం కలిసి కట్టుగా, మరింత బలంతో ముందుకు సాగుదాం.. విజయం సాధిద్దాం..!’ అంటూ డాక్టరమ్మపై ప్రశంసల వర్షం కురిపించారాయన.
|
ఈ విపత్తు సమయంలో కరోనా సోకిన తల్లిదండ్రుల బిడ్డను అక్కున చేర్చుకోవడం అనేది ఎంతో ధైర్యం, మానవత్వం ఉన్న వారికి మాత్రమే సాధ్యమయ్యే పని! అలాంటి గొప్ప పని చేసి నలుగురిలో ‘ఒక్క’రి నిలిచారు మేరీ. అసలు సిసలైన అమ్మ మనసు చాటుకున్నారు.. మానవత్వానికి మరో రూపుగా మారారు.. ఇలా ఆ మాతృ హృదయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది!
హ్యాట్సాఫ్ డాక్టర్ మేరీ!