Photo: Shiv Nadar Foundation
పురుషాధిక్యత అధికంగా ఉండే ఐటీ రంగంలో తొలిసారిగా ఓ మహిళ దిగ్గజ ఐటీ కంపెనీ పగ్గాలు అందుకుంది. ఆమే హెచ్‌సీఎల్ ఛైర్‌పర్సన్‌గా నియమితురాలైన రోష్నీ నాడార్ మల్హోత్రా. హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్‌నాడార్ ముద్దుల కూతురైన ఆమె టెక్నాలజీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రి ఆలోచనల్ని అవపోసన పట్టి, సంస్థకు సంబంధించి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన ముద్రతో దూసుకుపోతున్నారు. మొదట ఓ సాధారణ ఉద్యోగిలా సంస్థలో చేరిన ఆమె అనతికాలంలోనే సంస్థను అభివృద్ధి పథంలో నడిపించి ఇప్పుడు ఆ దిగ్గజ సంస్థకు ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.
సాధారణ ఉద్యోగినిలా..!
శివ్‌నాడార్, కిరణ్ నాడార్ దంపతుల ఏకైక కూతురైన రోష్నీ నాడార్ దిల్లీలో పుట్టి పెరిగింది. అక్కడే వసంత్ వ్యాలీ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. మొదట అర్థశాస్త్రంలో డిగ్రీ చేయాలనుకున్న రోష్ని ఆ తర్వాత కమ్యూనికేషన్లో డిగ్రీ చదవాలనుకున్నారు. ఈ క్రమంలో దిల్లీలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసుకుని చికాగోలోని నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అనంతరం లండన్‌లోని స్కై న్యూస్ ఛానల్లో పని చేసిన ఆమె అంతకుముందు సీఎన్‌బీసీ, సీఎన్ఎన్ తదితర ఇంగ్లిష్ న్యూస్ ఛానళ్లలో ఇంటర్న్‌షిప్ చేశారు. అలాగే- అమెరికాలోని కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్’ నుంచి ఎంబీఏ పట్టాపుచ్చుకుంది రోష్ని.

తండ్రి అడుగుజాడల్లోనే నడవాలనుకుని నిర్ణయించుకున్న ఆమె మొదట ఓ సాధారణ ఉద్యోగినిలా హెచ్‌సీఎల్‌లో చేరారు. తనదైన ప్రతిభాపాటవాలతో కేవలం ఒక్క సంవత్సరంలోనే కంపెనీ సీఈఓ /ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికామె వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే.
సిసలైన వారసురాలు!
1976లో హెచ్‌సీఎల్ సంస్థను స్థాపించిన ప్రముఖ వ్యాపారవేత్త శివ్ నాడార్ భారతీయ ఐటీ రంగానికి తన సంస్థను ఒక మూలస్తంభంలా నిలబెట్టారు. అనతి కాలంలోనే వేల కోట్ల టర్నోవర్ కు ఎగబాకిన అటువంటి సంస్థకు సీఈఓగా బాధ్యతలు చేపట్టడం అంటే మామూలు విషయం కాదు. నాడార్ వారసురాలిగా ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహించారు రోష్నీ నాడార్. తనదైన వ్యూహ రచనతో హెచ్‌సీఎల్ సంస్థను లాభాల బాట పట్టించారు. ఇదేక్రమంలో హెచ్‌సీఎల్ కార్పొరేషన్ డైరెక్టర్ల బోర్డులో కూడా స్థానం సంపాదించారు.
సృజనాత్మక ఆలోచనలతో...
హెచ్‌సీఎల్‌లో చేరినప్పటి నుంచీ ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టి, తనదైన ముద్ర వేస్తున్నారు రోష్ని. వినూత్న ఆలోచనలతో యువతరానికి, మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యంగా యువతను నాయకులుగా తీర్చిదిద్దేందుకు ‘యంగ్ గ్లోబల్ లీడర్స్' కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిభకు పట్టం కడుతున్నారు. 'ఐడియా ప్రెన్యూర్' పేరుతో ఉద్యోగుల నుంచి సృజనాత్మక వ్యాపార ఆలోచనలను స్వీకరించి... వాటిని కార్యరూపంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఈక్రమంలో వ్యాపార విస్తరణకు సంబంధించి ఇప్పటి వరకు కొన్ని వేల సృజనాత్మక ఆలోచనలు ప్రాణం పోసుకోవడం విశేషం.

సామాజిక సేవలోనూ...
ఇలా ఓవైపు వ్యాపారంలో బిజీగా ఉండి కూడా మరోవైపు ‘శివ్ నాడార్ ఫౌండేషన్’ స్వచ్ఛంద సంస్థ బాధ్యతల్ని కూడా నిర్వర్తిస్తున్నారు రోష్ని. ఈ సంస్థ ద్వారా దేశంలో కొన్ని అగ్రశ్రేణి పాఠశాలలు, కళాశాలల్ని నెలకొల్పి.. అందులోని విద్యార్థులకు ఉన్నత విద్యాప్రమాణాలు అందిస్తున్నారు. ‘విద్యాజ్ఞాన్’ పేరిట గ్రామీణ ప్రాంతాల్లో వెనకబడిన పేద పిల్లలకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యనందిస్తున్నారు. ఇక వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక ఆసక్తి చూపే ఆమె ‘ది హ్యాబిటేట్స్’ పేరుతో ఓ ట్రస్ట్‌ని ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా మూగజీవాల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తన సేవలకు గుర్తింపుగా 2014లో 'ఎన్డీటీవీ యంగ్ ఫిలాంత్రోపిస్ట్ ఆఫ్ ది ఇయర్', 2017లో 'వోగ్ ఇండియా ఫిలాంత్రోపిస్ట్ ఆఫ్ ది ఇయర్' వంటి పురస్కారాల్ని సైతం అందుకున్నారు.
వర్క్‌లైఫ్ బ్యాలన్స్ చేస్తూ!
రోష్నీ నాడార్ 2010లో శిఖర్ మల్హోత్రాను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శిఖర్ హెచ్‌సీఎల్ అనుబంధ సంస్థ హెల్త్‌కేర్ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ దంపతులకు అర్మాన్, జహాన్ అని ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తన ఇద్దరు కొడుకుల ఆలనాపాలనా చూస్తూ వర్క్‌లైఫ్ బ్యాలన్స్ విషయంలో నేటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారీ సూపర్ వుమన్.
దేశంలోనే అత్యంత సంపన్నురాలిగా..!
హెచ్‌సీఎల్ లాంటి ఐటీ దిగ్గజ కంపెనీకి ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు తీసుకోనున్న రోష్ని భారతదేశంలో అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హ్యూరన్-2019 ర్యాంకింగ్‌ల ప్రకారం ఆమె సంపద సుమారు రూ.36,800 కోట్లు. ఇక వ్యాపార రంగంలో రోష్ని ప్రతిభను గుర్తించిన ఫోర్బ్స్ ప్రపంచంలోనే 100 మంది అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఆమెకు చోటు కల్పించింది. ఈక్రమంలో 2017-2019 వరకు వరసగా మూడేళ్ల పాటు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుందీ బిజినెస్ వుమన్. ఇక గతేడాది ఇన్ఫోలైన్ కంపెనీ ప్రకటించిన సంపన్నుల జాబితాలో కూడా రోష్నీ నాడార్ అత్యంత మహిళా సంపన్నురాలిగా కూడా నిలిచారు.
హెచ్‌సీఎల్ కంపెనీ ఛైర్‌పర్సన్‌గా రోష్ని నియామకం జులై 17 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. మరి బిజినెస్ టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ ఆమెకు అభినందనలు చెబుదాం.!