సెక్స్ వర్కర్లు.. ఈ మాట వినగానే మనం మొహం చిట్లించుకుంటాం.. వారిని చాలా చీప్‌గా, అంటరాని వారిగా చూస్తాం. కానీ వారిలో చాలామంది పొట్టకూటి కోసం వేరే గత్యంతరం లేక, మానవ అక్రమ రవాణాకు గురై, కుటుంబ పోషణ కోసం.. ఇలా వివిధ కారణాల రీత్యా ఈ రొంపిలోకి దిగుతుంటారు. ఏ కూటి కోసమైతే వారు ఈ మురికి కూపంలోకి దిగారో ఆ కూటినే లాగేసుకుంది మాయదారి కరోనా మహమ్మారి. గత మూడున్నర నెలలుగా తినడానికి తిండి లేక వాళ్లు, వాళ్ల పిల్లలు అల్లాడుతున్నారు. మరి, అలాంటి వారి గురించి తెలిసినా ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రారు. కానీ ‘నేను మీకు అండగా ఉన్నా’నంటూ ముందుకొచ్చారు కోల్‌కతాకు చెందిన రుచిరా గుప్తా. వృత్తిరీత్యా జర్నలిస్ట్ అయిన ఆమె.. మహిళా హక్కులపై పోరాటం చేయడానికి, మానవ అక్రమ రవాణాను నిర్మూలించడానికి నాడు ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. నేడు అదే స్వచ్ఛంద సంస్థ ద్వారా కరోనాతో కుదేలై ఆకలితో అలమటిస్తోన్న సెక్స్ వర్కర్లకు, వారి పిల్లలకు మూడుపూటలా అన్నం పెడుతూ అన్నపూర్ణగా మారారు. మరి, ఈ కరోనా కష్టకాలంలో దేశవ్యాప్తంగా ఎందరో సెక్స్ వర్కర్ల కుటుంబాలకు బాసటగా నిలుస్తోన్న ఈ సూపర్ వుమన్ స్టోరీ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..
ఆకలని అడగందే అమ్మయినా అన్నం పెట్టదంటారు. కానీ కరోనా కాటుతో కుదేలైన సెక్స్ వర్కర్ల జీవితాలను, వారి ఆకలిని ఓ దేవతలా అర్థం చేసుకున్నారు కోల్‌కతాకు చెందిన రుచిరా గుప్తా. వృత్తిరీత్యా జర్నలిస్ట్ అయిన ఆమె.. ప్రముఖ సంస్థల్లో పనిచేశారు. ఈ క్రమంలో మహిళా హక్కులు, ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన సాయుధ పోరాటాలు, కుల వైషమ్యాలు, మైనార్టీ సమస్యలు.. వంటి అంశాలపై వార్తలు రాసేవారు. అలాగే మహిళా సమస్యలు, మానవ అక్రమ రవాణా.. వంటి సున్నితమైన అంశాలపై పలు ప్రముఖ పత్రికలకు వ్యాసాలు కూడా రాశారు.
అక్రమ రవాణాకు వ్యతిరేకంగా..!
తాను వృత్తిలో ఉండగానే గతంలో ఓసారి నేపాల్ వెళ్లారు రుచిర. అక్కడ యుక్తవయసులో ఉన్న ఎందరో అమ్మాయిలు మానవ అక్రమ రవాణాకు గురవడం గమనించారు. ఇలా ఈ మురికి కూపంలో మగ్గుతోన్న మహిళల జీవితాలను ‘ది సెల్లింగ్ ఆఫ్ ఇన్నొసెంట్స్’ పేరుతో ఓ డాక్యుమెంటరీగా రూపొందించారు. ఈ డాక్యుమెంటరీకి ఎమ్మీ పురస్కారం వరించడం విశేషం. ఇక అదే సమయంలో మానవ అక్రమ రవాణాను నిర్మూలించాలని, ఇందుకోసం కొత్త చట్టాలు రూపొందించాలని యునైటెడ్ నేషన్స్‌తో చేతులు కలిపారామె. ఈ క్రమంలో తాను రూపొందించిన డాక్యుమెంటరీని యూఎన్‌లో, యూఎస్ సెనేట్‌లో ప్రదర్శించారు. తద్వారా యూఎస్‌లో మానవ అక్రమ రవాణాపై మొదటి చట్టాన్ని తీసుకురావడంలో కృషి చేశారు. అంతేకాదు.. తనకున్న పరిజ్ఞానంతో మానవ అక్రమ రవాణా బాధితులను చైతన్యపరిచారు. అలాగే మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జాతీయ ప్రణాళికలు రూపొందించడంలో వివిధ దేశాలకు తన సహాయసహకారాలు కూడా అందించారు రుచిర.
ఆలోచనను మార్చిన డాక్యుమెంటరీ!
ఇష్టం లేకుండా ఈ మురికి కూపంలో మగ్గుతోన్న ఎంతోమంది మహిళల బతుకుల్ని దగ్గర్నుంచి గమనించానంటున్న రుచిర.. ఈ నేపథ్యంలో తాను రూపొందించిన డాక్యుమెంటరీ తన ఆలోచనా విధానాన్నే మార్చేసిందంటున్నారు. ‘సెక్స్ వర్కర్ల జీవితాలపై నేను రూపొందించిన ఈ డాక్యుమెంటరీ నా జీవితాన్నే మార్చేసింది. నా ఆలోచనా విధానాన్ని మార్చింది. ఒక జర్నలిస్టుగా నా కెరీర్లో యుద్ధాలు, ఆకలి కేకలు, ఎన్నో మహిళా సమస్యల్ని చూశాను. కానీ మహిళలు ఈ విధంగా హింసకు గురవడం నేనెప్పుడూ చూడలేదు. బిహార్, కోల్‌కతా, ముంబయిల్లోని వేశ్యా గృహాలకు వెళ్లాను. అక్కడి సెక్స్ వర్కర్లు వాళ్ల కథల్ని, కష్టాల్ని నాతో పంచుకున్నారు. కొందరైతే పట్టుమని 13 ఏళ్లైనా నిండకముందే ఈ రొంపిలోకి దిగడం నన్ను మరింతగా కలచివేసింది..’ అంటూ తన పూర్వపు అనుభవాలను గుర్తు తెచ్చుకున్నారు రుచిర. ఇదే కాదు.. మానవ అక్రమ రవాణాపై మరికొన్ని డాక్యుమెంటరీలు కూడా రూపొందించారీ సూపర్ వుమన్.
ఆ నాలుగు కలలతో..!
ఈ సమస్యను ఇలాగే వదిలేయడం కాకుండా దీనికో పరిష్కారం కనుక్కోవాలని, ఇలాంటి మహిళల జీవితాలు బాగుపడడానికి మరింత చొరవ చూపాలని నిర్ణయించుకున్నారు రుచిర. ఈ క్రమంలోనే 2002లో ‘అప్నే ఆప్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. మహిళల హక్కులు, మానవ అక్రమ రవాణా నిర్మూలనే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతోందీ ఎన్జీవో. ఇందులో భాగంగా సెక్స్ వర్కర్ల పిల్లలకు విద్యనందించడం, ఆ కుటుంబాలు స్వతంత్రంగా-సురక్షితంగా నివసించడానికి గృహ వసతి కల్పించడం, ఆ మహిళలకు ఉద్యోగం కల్పించడం, న్యాయం చేకూర్చడం.. వంటి నాలుగు లక్ష్యాలను నెరవేర్చడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందీ సంస్థ. ఇక ఆయా మహిళలు సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించే దిశగా ఈ సంస్థ వలంటీర్లు వారిని చైతన్యపరుస్తున్నారు.
కరోనా కష్టకాలంలో ‘అన్నపూర్ణ’గా..!
మహిళల హక్కులు, మానవ అక్రమ రవాణాను నిర్మూలించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోన్న రుచిర.. ఈ కరోనా కష్టకాలంలో కూడు లేక అలమటిస్తోన్న సెక్స్ వర్కర్లను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. ఈ క్రమంలో ‘1 మిలియన్ మీల్స్’ పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన దేశంలో లాక్డౌన్ ప్రారంభమైన తొలి వారం నుంచే ఈ కార్యక్రమం ద్వారా సెక్స్ వర్కర్ల కుటుంబాలకు ఆహారం పంపిణీ చేస్తున్నారు రుచిర. మొదట తన వలంటీర్ల సహాయంతో ఆహారం వండి ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేసిన ఆమె.. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచాక ముడిసరుకులనే నేరుగా వారిళ్లకు చేరవేసే గొప్ప బాధ్యతను భుజాలపై వేసుకున్నారు. ఇందులో భాగంగా బియ్యం, ఉల్లిపాయలు, పప్పులు, బంగాళాదుంపలు, మసాలాలు, సబ్బులు, వంటనూనె, మాస్కులు.. తదితర నిత్యావసర వస్తువుల్ని బ్యాగుల్లో నింపి తన సంస్థ వలంటీర్ల సహకారంతో ఆయా రాష్ట్రాల్లోని కుటుంబాలకు చేరవేస్తున్నారు. అలా ఆ మహిళల పాలిట అన్నపూర్ణగా మారారు రుచిర. అంతేకాదు.. ప్రస్తుతం పిల్లలందరికీ స్కూల్స్ మూతపడడంతో వారు ఇంట్లోనే చదువుకునేందుకు వీలుగా ఆయా కుటుంబాల్లోని పిల్లలకు ఉచితంగా పుస్తకాలు కూడా పంపిణీ చేస్తోందీ సంస్థ.
వారందరి సహకారంతో..!
ఇలా తాను ఈ కరోనా కష్టకాలంలో చేపట్టిన ఈ బృహత్కార్యానికి దేశవిదేశాల నుంచి ఎందరి నుంచో మద్దతు లభిస్తోందని అంటున్నారీ సూపర్ వుమన్. ‘1 మిలియన్ మీల్స్ ఇనీషియేటివ్‌కు దేశవిదేశాల నుంచి ఎందరో వ్యాపారవేత్తలు, సంస్థలు తమ విలువైన సహకారాన్ని అందిస్తున్నారు. బియ్యం, ఇతర నిత్యావసరాలు, శ్యానిటరీ న్యాప్కిన్లు.. ఇలా ఎవరికి తోచిన సహాయం వారు చేస్తున్నారు. మరికొందరు డబ్బు రూపేణా ఈ గొప్ప కార్యక్రమంలో భాగమవుతున్నారు. ఇంకొందరు వలస కార్మికుల కోసం చెప్పులు, ఇతర వస్తువులను పంపించడానికి తాము సిద్ధమంటూ ఫోన్లు చేస్తున్నారు. ఇక పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి సోషల్ మీడియాను వేదికగా ఎంచుకున్నారు.. ఇలా ఈ సేవలో పాలుపంచుకున్న వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా..’ అంటున్నారీ కొవిడ్ వారియర్. ఇక కరోనా పోరులో భాగంగా తాను ప్రారంభించిన ఈ కార్యక్రమం కరోనా ఉన్నన్నాళ్లూ కొనసాగుతుందని చెబుతున్నారు రుచిర.
కారణమేదైనా మానవ అక్రమ రవాణాకు గురై.. ఈ రొంపిలో కూరుకుపోయిన మహిళలకు అండగా నిలబడుతూ వారి హక్కుల కోసం పోరాటం చేస్తోన్న రుచిర.. వారి పిల్లలకు ఈ గతి పట్టకుండా ఉండేందుకే వారికి తన సంస్థ సహకారంతో విద్యాబుద్ధులు నేర్పిస్తున్నానంటున్నారు. మరి, మనమంతా చీదరించుకునే పడుపు వృత్తిలో మగ్గుతోన్న మహిళల్ని ఈ కరోనా ప్రతికూల పరిస్థితుల్లో అక్కున చేర్చుకొని అసలైన కరోనా వారియర్‌గా నిలిచారు రుచిర.