‘హవా హవాయి’, ‘ఏక్ దో తీన్’, ‘మెహెందీ లగా కే రఖ్నా’, ‘డోలారే డోలారే’.. ఇలాంటి జోష్‌ఫుల్ పాటలు మనం ఏ మూడ్‌లో ఉన్నా మనతో స్టెప్పులేయిస్తాయి. అంతేనా.. ఈ పాటల్లో నర్తించిన అందాల తారల అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులను కూడా జ్ఞప్తికి తెస్తాయి. మరి, అలాంటి సూపర్బ్ స్టెప్పులకు ఆన్‌స్క్రీన్ కేరాఫ్ అడ్రస్ మన ముద్దుగుమ్మలైతే.. తెరవెనుక ఆ నృత్య రీతుల్ని సమకూర్చిన ఘనత మాస్టర్ జీ సరోజ్ ఖాన్‌కే దక్కుతుంది. ఎన్నో బాలీవుడ్ హిట్ పాటలకు నృత్య దర్శకురాలిగా పనిచేసి, ఎందరో నటీనటులకు డ్యాన్స్ గురూగా మారిన సరోజ్.. సినీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. తన ఐకానిక్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ‘మదర్ ఆఫ్ డ్యాన్స్’గా కీర్తి గడించిన ఈ కొరియోగ్రాఫర్ నేడు గుండెపోటుతో మరణించారు. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె.. తన 71 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.. సినీ లోకాన్ని, ప్రేక్షకుల్ని, తన అభిమానుల్ని ఒంటరిని చేసి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈ లెజెండరీ డ్యాన్సర్ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!
పాటలకు సంగీతం ప్రాణమైతే, డ్యాన్స్ ఆరోప్రాణం అని చెప్పుకోవాలి. అలాంటి ఆరోప్రాణాన్ని తన ఊపిరిగా మలచుకున్నారు దిగ్గజ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్. 1948, నవంబర్ 22న మహారాష్ట్ర (అప్పటి ముంబయి స్టేట్)లో కిషన్‌చంద్ సాధు సింగ్, నోనీ సింగ్ దంపతులకు జన్మించారు సరోజ్. తన తల్లి సింధీ, తండ్రి పంజాబీ అని, విభజన తర్వాత తన తల్లిదండ్రులు పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చారని, ఆ తర్వాతే తాను పుట్టానని గతంలో ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చారు సరోజ్.
View this post on Instagram
🌹
A post shared by Saroj Khan (@sarojkhanofficial) on
పేరు మారిందలా!
నిర్మలా నాగ్పాల్గా జన్మించిన సరోజ్ ఖాన్ తన మూడేళ్ల వయసులోనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే తన తండ్రి తన పేరును సరోజ్‌గా మార్చారని ఓ సందర్భంలో పంచుకున్నారీ గ్రేట్ డ్యాన్సర్. ‘నా అసలైన పేరు నిర్మలా నాగ్‌పాల్. మాది చాలా సంప్రదాయబద్ధమైన కుటుంబం. అలాంటి కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలు సినిమాల్లోకి అడుగుపెట్టడం అంటే ఆ రోజుల్లో అందరూ అగౌరవంగా భావించేవారు. అందుకే నాన్న నా పేరును సరోజ్‌గా మార్చారు. అలా మూడేళ్ల వయసులోనే సరోజ్ పేరుతో వెండితెరపై కెరీర్ ప్రారంభించా..’ అంటూ చెప్పుకొచ్చారామె. ‘నజరానా’ సినిమాలో చిన్నారి శ్యామల పాత్రలో నటించి బాలనటిగా కెరీర్ ప్రారంభించిన సరోజ్.. ఆపై సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా మారారు. అప్పటికే సినీ కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు సంపాదించిన బి. సోహన్‌లాల్ దగ్గర డ్యాన్స్ మెలకువలు నేర్చుకున్నారు సరోజ్. అలా తనకు నృత్య పాఠాలు నేర్పిన డ్యాన్స్ మాస్టర్ సోహన్లాల్నే తన పదమూడో ఏట పెళ్లాడారీ మేటి డ్యాన్సర్.
వీగిపోయిన బంధం!
పెళ్లి నాటికి సరోజ్ వయసు 13 ఏళ్లయితే, సోహన్‌లాల్ వయసు 43 ఏళ్లు. అసలు పెళ్లంటే ఏంటో కూడా తెలియని వయసులోనే తన మెడలో మూడుముళ్లు పడిపోయాయని గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు సరోజ్. ‘అప్పుడు నాకు 13 ఏళ్లుంటాయనుకుంటా. స్కూలుకెళ్తున్నా.. ఆ సమయంలోనే మాస్టర్ సోహన్లాల్తో నాకు పెళ్లైంది. నిజానికి అప్పటికి నాకు పెళ్లి అనే మాటకు అర్థమే తెలియదు. ఆయన నా మెడలో నల్లపూసలు కట్టారన్న విషయం ఆ తర్వాత కొన్నాళ్లకు గానీ తెలుసుకోలేకపోయా. నాతో పెళ్లికి ముందే ఆయనకు పెళ్లైందని, నలుగురు పిల్లలు కూడా ఉన్నారని తెలుసుకునే లోపే నాకు నా కొడుకు రాజు ఖాన్ పుట్టాడు. అలా పద్నాలుగేళ్ల వయసులోనే తల్లిని కావడంతో ఇంత చిన్న వయసులో అంత పెద్ద బాధ్యతను మోయడం కష్టంగా మారింది. రెండేళ్ల తర్వాత కూతురు పుట్టినా ఎనిమిది నెలలకు మించి బతకలేదు. అదే సమయంలో నేను, మాస్టర్ విడిపోయాం. నాలుగేళ్ల తర్వాత ఆయనే నన్ను తన దగ్గర అసిస్టెంట్‌గా చేర్చుకున్నారు. అలా మళ్లీ ఆయనతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది.. ఈ క్రమంలోనే నా రెండో కూతురు కుకు పుట్టింది..’ అంటూ నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు సరోజ్. కూతురు పుట్టాక సోహన్‌లాల్ సరోజ్ నుంచి పూర్తిగా విడిపోయి మద్రాస్‌లో స్థిరపడ్డారు. ఆ తర్వాత సరోజ్ సర్దార్ రోషన్ ఖాన్‌ను 1975లో రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమెకు మొత్తం నలుగురు సంతానం.
‘హవా హవాయి’తో ఆగని జోరు!
మొదట తన భర్త దగ్గరే డ్యాన్స్ మెలకువలు నేర్చుకొని, కొన్ని చిత్రాలకు ఆయన వద్దే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన సరోజ్.. ఆపై పూర్తిస్థాయి నృత్య దర్శకురాలిగా అవతారమెత్తారు. ఈ క్రమంలోనే 1974లో ‘గీతా మేరా నామ్’ సినిమాకు కొరియోగ్రఫీ చేశారు. అయితే డ్యాన్స్ మాస్టర్‌గా తనకు బ్రేక్‌త్రూ ఇచ్చింది మాత్రం శ్రీదేవి నటించిన ‘మిస్టర్ ఇండియా (1987)’ చిత్రం అనే చెప్పుకోవాలి. ఈ సినిమాలోని ‘హవా హవాయి’ పాటకు నృత్య రీతుల్ని సమకూర్చిన సరోజ్.. సూపర్బ్ కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇక అప్పట్నుంచి వెనక్కి తిరిగి చూడలేదామె. ఆ తర్వాత ‘నగీనా (1986)’, ‘చాందినీ (1989)’.. వంటి సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇక మాధురి నటించిన ‘తేజాబ్’ సినిమాలోని ‘ఏక్ దో తీన్’ పాట నేటికీ సినీ ప్రేక్షకుల మనసుల్లో ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయిందంటే అందుకు సరోజ్ అందించిన అద్భుతమైన స్టెప్పులే కారణం అనడంలో అతిశయోక్తి లేదు. ఆ తర్వాత విడుదలైన ‘తానేదార్’ సినిమాలోని ‘తమ్మా తమ్మా లోగే’, ‘బేటా’ చిత్రంలోని ‘ధక్ ధక్ కర్నే లగా’, ‘ఖల్నాయక్’ చిత్రంలోని ‘ఛోలీ కే పీఛే క్యా హై’.. వంటి పాటలతో తన డ్యాన్స్ సత్తాను ప్రపంచానికి చాటుకున్న సరోజ్.. బాలీవుడ్లో సక్సెస్ఫుల్ కొరియోగ్రాఫర్‌గా పేరుతెచ్చుకున్నారు.
ఐదు దశాబ్దాలు.. రెండు వేల పాటలు..!
ఆ తర్వాత ‘బాజీగర్’, ‘మోహ్రా’, ‘దార్’, ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’, ‘తాళ్’, ‘వీర్-జారా’, ‘పర్దేశ్’, ‘లగాన్’, ‘తనూ వెడ్స్ మనూ’, ‘మణికర్ణిక’, ‘జబ్ వుయ్ మెట్’, ‘గురు’, ‘ఛాల్‌బాజ్’.. తదితర హిట్ చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించి ‘మదర్ ఆఫ్ డ్యాన్స్’, ‘మాస్టర్ జీ’.. వంటి కితాబులందుకున్నారు సరోజ్. ఇక చివరిసారిగా గతేడాది విడుదలైన ‘కళంక్’ సినిమాలో మాధురి నర్తించిన ‘తాబా హో గయే’ అనే పాటకు నృత్య రీతులు సమకూర్చి మరోసారి తన డ్యాన్స్ సత్తాను ప్రపంచానికి చాటుకున్నారీ మేటి డ్యాన్సర్. ఇలా మొత్తంగా దాదాపు యాభై ఏళ్ల పాటు సినీ పరిశ్రమలో కొనసాగిన సరోజ్.. సుమారు 2000లకు పైగా పాటలకు నృత్య దర్శకురాలిగా పనిచేశారు. అంతేకాదు.. పలు ఛానల్స్‌లో నిర్వహించిన ‘నచ్ బలియే’, ‘నచ్లే వే విత్ సరోజ్ ఖాన్’.. వంటి పలు డ్యాన్స్ రియాల్టీ షోలకు న్యాయ నిర్ణేతగా సైతం వ్యవహరించారీ డ్యాన్స్ మాస్టర్. ఇక తనలో ఓ డ్యాన్సరే కాదు.. మంచి కథా రచయిత్రి కూడా దాగుందంటూ ‘ఖిలాడీ’, ‘దిల్ తేరా దివానా’, ‘వీరూ దాదా’ ‘భాయ్ భాయ్’.. వంటి పలు చిత్రాల ద్వారా నిరూపించారు.
|
మూడు జాతీయ అవార్డులు..!
తన డ్యాన్స్ స్కిల్స్‌తో బాలీవుడ్లోనే అత్యుత్తమ కొరియోగ్రాఫర్‌గా పేరుతెచ్చుకున్న సరోజ్.. ఎన్నో అవార్డులు అందుకున్నారు. తాను కొరియోగ్రఫీ చేసిన ‘డోలారే డోలారే (దేవ్‌దాస్)’, ‘యే ఇష్క్ హాయే (జబ్ వుయ్ మెట్)’.. వంటి పాటలతో పాటు ‘శృంగారం’ సినిమాకు గాను మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు సరోజ్. ‘గురు’, ‘ఖల్నాయక్’, ‘హమ్ దిల్ దే చుకే సనమ్’, ‘బేటా’.. వంటి పలు చిత్రాలకు ఉత్తమ నృత్యకారిణిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. అంతేకాదు.. చిరంజీవి హీరోగా నటించిన ‘చూడాలని ఉంది’ సినిమాతో తెలుగువారినీ పలకరించారీ మేటి డ్యాన్సర్. ఈ సినిమాకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన సరోజ్.. నంది పురస్కారం చేజిక్కించుకున్నారు.
|
Also Read: డ్యాన్స్ మంచిది కాదని ఎవరన్నారు?
ఓ నృత్య దర్శకురాలిగా, కథా రచయిత్రిగా, డ్యాన్స్ గురువుగా.. బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న సరోజ్ ఖాన్.. జులై 3, 2020 ఉదయం 2 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె.. గుండెపోటుతో మనందరినీ ఒంటరిని చేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె మన మధ్య లేకపోవచ్చు.. కానీ ఎన్నో పాటలకు ఆమె అందించిన అద్భుతమైన నృత్యరీతులతో ఆమె రోజూ మనల్ని పలకరిస్తూనే ఉంటారు.. మన మధ్యే శాశ్వతంగా, సజీవంగా నిలిచిపోతారు. ఈ లెజెండరీ డ్యాన్సర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం..!