అది కాకులు దూరని కారడవి కన్నా, చీమలు దూరని చిట్టడవి కన్నా చిమ్మ చీకటితో కూడుకున్న ప్రాంతం.
ధ్రువ ప్రాంతాల్లోలా గడ్డకట్టుకుపోయే అసాధారణమైన ఉష్ణోగ్రతలు అక్కడ నమోదవుతాయి.
సూక్ష్మక్రిములు మాత్రమే తట్టుకొని జీవించడానికి అనువైన అస్థిరమైన వాతావరణం ఉంటుందక్కడ.
మరి, అలాంటి ప్రతికూల వాతావరణంలోకి వెళ్లడానికి కాదు.. కనీసం దాని గురించి ఆలోచించడానికి కూడా ఎవరూ సాహసించరు. కానీ ఇలాంటి దుస్సాహసానికి పూనుకొని.. చరిత్ర సృష్టించింది అమెరికాకు చెందిన 68 ఏళ్ల డాక్టర్ క్యాథ్రిన్ సులివాన్. ఇప్పటికే అంతరిక్షంలో నడిచిన తొలి అమెరికన్ మహిళగా 37 క్రితం చరిత్రను తన పేరిట లిఖించుకున్న క్యాతీ.. ఇప్పుడు సముద్ర గర్భాన్నీ ముద్దాడింది. పసిఫిక్ మహా సముద్రంలోని మెరియానా ట్రెంచ్ అగాథంలోని లోతైన ప్రదేశం ‘ఛాలెంజర్ డీప్’ (సముద్ర గర్భంలోని అతి లోతైన ప్రదేశంగా దీన్ని పేర్కొంటారు) వరకు వెళ్లిన తొలి మహిళగా అరుదైన ఘనత సాధించిందీ అమెరికన్ వ్యోమగామి. ఇలా తన సాహసంతో నాడు అంతరిక్షంలో, నేడు సముద్ర గర్భంలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న ఈ అసాధారణ మహిళ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..
పసిఫిక్ మహా సముద్రం.. ప్రపంచంలోని ఐదు మహా సముద్రాల్లో అతి పెద్దది. ఇందులోని మెరియానా ట్రెంచ్ అగాథంలో సముద్ర గర్భంలోనే అతి లోతైన ప్రదేశం ‘ఛాలెంజర్ డీప్’ ఉంది. సముద్ర ఉపరితలం నుంచి 6.9 మైళ్ల (సుమారు 11 వేల మీటర్ల) లోతులో ఉండే ఈ ప్రదేశంలో కడు ప్రతికూల వాతావరణం ఉంటుంది. సముద్ర ఉపరితలంపై కంటే ఇక్కడ నీటి పీడనం సుమారు వెయ్యి రెట్లు అధికంగా ఉంటుంది. చుట్టూ చిమ్మ చీకటి. గడ్డకట్టుకుపోయే చలి.. సూక్ష్మ క్రిములు మాత్రమే జీవించగలిగే ప్రతికూల వాతావరణ పరిస్థితులుంటాయీ ప్రదేశంలో. మరి, అలాంటి ప్రదేశానికి చేరుకునే దుస్సాహసమే చేశారు అమెరికాకు చెందిన వ్యోమగామి క్యాతీ సులివాన్. 37 ఏళ్ల క్రితం గగన తలాన్ని చీల్చుకుంటూ అంతరిక్షంలో నడిచిన తొలి మహిళగా కీర్తి గడించిన ఈ ఆస్ట్రొనాట్.. ఇప్పుడు సముద్ర గర్భంలోని అతి లోతైన ప్రదేశాన్ని ముద్దాడి మరో ఘనతను సాధించారు. తద్వారా సముద్ర గర్భంలోని అతి లోతైన ప్రదేశానికి చేరుకున్న తొలి మహిళగా చరిత్రలో తన పేరును శాశ్వతం చేసుకున్నారు క్యాతీ.
అంతా నాలుగ్గంటల్లోనే పూర్తయింది!
అమెరికాకు చెందిన రిటైర్డ్ నావికా అధికారి విక్టర్ వెస్కోవో ‘కలడన్ ఓషియానిక్’ అనే సముద్ర అన్వేషణ సంస్థ (డీప్ సీ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ)ను స్థాపించారు. దీని ద్వారా సముద్ర లోతుల్లో అన్వేషణ సాగించేందుకు సాహస యాత్రలు చేస్తుంటారాయన. ఇందులో భాగంగానే ఇటీవలే ‘రింగ్ ఆఫ్ ఫైర్ ఎక్స్‌పెడిషన్’ పేరుతో ‘ఛాలెంజర్ డీప్’ యాత్రను చేపట్టారు. ఈ యాత్రలో విక్టర్‌తో పాటు అమెరికాకు చెందిన మహిళా వ్యోమగామి క్యాతీ సులివాన్ కూడా పాల్గొన్నారు. లిమిటింగ్ ఫ్యాక్టర్ అనే డీప్ సీ సబ్‌మెరైన్ ద్వారా వీరిద్దరూ అక్కడికి చేరుకున్నారు. సముద్ర ఉపరితలం కంటే అక్కడ నీటిపీడనం దాదాపు వెయ్యి రెట్లు అధికంగా ఉంటుంది. అంటే బలంగా లేని జలాంతర్గత నౌకలైతే ఆ ఒత్తిడిని తట్టుకోలేక పేలిపోతాయి కూడా! చావో రేవో అన్న పరిస్థితులున్న అలాంటి ప్రతికూల వాతావరణంలోకి వెళ్లే సాహసం చేశారు క్యాతీ. జూన్ 7న వీరిద్దరూ కలిసి కేవలం నాలుగ్గంట్లోనే ఈ సాహస యాత్రను పూర్తిచేయడం విశేషం. ఈ యాత్ర ద్వారా ‘ఛాలెంజర్ డీప్’కి సంబంధించిన తొలి 4కే వీడియో (1080p HD క్వాలిటీ కంటే దీని వీడియో నాణ్యత నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది)ను విడుదల చేయనున్నారు.
నా జీవితంలో ఆ ‘ఒక్క’ రోజు ఇదే!
ఇలా ఈ సాహస యాత్రలో పాల్గొన్న తొలి మహిళగా చరిత్ర సృష్టించారు క్యాతీ. యాత్రను ముగించుకొని విజయవంతంగా తిరిగొచ్చిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ఒక సముద్ర శాస్త్రవేత్తగా, వ్యోమగామిగా.. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేను. ప్రతి ఒక్కరికీ తమ జీవితకాలంలో ఒకే ఒక్క ప్రత్యేకమైన రోజు ఉంటుంది. నా జీవితంలో అది ఇదే. అదో అద్భుతమైన అనుభూతి.. స్పేస్‌వాక్ చేసిన 36 ఏళ్ల తర్వాత ఈ సాహసం చేశాను..’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారామె. ఇక ఇంతటి సాహస యాత్రలో పాల్గొన్న క్యాతీపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అభినందనల వెల్లువలో తడిసి ముద్దవుతున్నారీ అమెరికన్ వ్యోమగామి.
ఆమే తొలి మహిళ!
మరోవైపు ఈ యాత్ర నిర్వాహకులు వెస్కోవో కూడా ఈ బ్రేవ్ లేడీపై ట్వీట్ రూపంలో ప్రశంసలు కురిపించారు. ‘మా ఛాలెంజర్ డీప్ యాత్ర ఇప్పుడే పూర్తయింది. నా సహ-పైలట్, అమెరికన్ మాజీ వ్యోమగామి, NOAA అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ క్యాతీ సులివాన్ ఈ యాత్రతో అరుదైన ఘనత సాధించారు. సముద్రగర్భంలోని లోతైన ప్రదేశాన్ని తాకిన తొలి మహిళగా తన పేరును చరిత్రలో లిఖించుకున్నారు. ఆమెకు నా అభినందనలు! ఇలా నేను సముద్రగర్భంలోకి వెళ్లడం ఇది మూడోసారి. ఈ తాజా యాత్రలో మాకు సహకరించిన నాసా సోలార్ సిస్టమ్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రిటాన్, EYOS yachts, charter కంపెనీలకు మా ధన్యవాదాలు..’ అంటూ రాసుకొచ్చారాయన.
అంతరిక్షంలో స్పేస్‌వాక్!
* ‘ఛాలెంజర్ డీప్’ యాత్ర ద్వారా సముద్ర గర్భంలోని లోతైన ప్రదేశాన్ని తాకిన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన క్యాతీ 1951, అక్టోబర్ 3న న్యూజెర్సీలోని ప్యాటర్సన్ సిటీలో జన్మించారు. * 1973లో క్యాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి ఎర్త్ సైన్సెస్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన క్యాతీ.. 1978లో డల్హౌసీ విశ్వవిద్యాలయం నుంచి భూగర్భశాస్త్రంలో పీహెచ్డీ పట్టా పొందారు. * అదే ఏడాది నాసాకు ఎంపికైన ఆమె.. మరుసటి ఏడాది వ్యోమగామిగా మారారు. * STS-41G (October 5-13, 1984), STS-31 (April 24-29, 1990) and STS-45 (March 24-April 2, 1992) అనే మూడు అంతరిక్ష నౌకలకు మిషన్ స్పెషలిస్ట్‌గా వ్యవహరించారు. * అంతేకాదు.. అంతరిక్షంలో నడిచిన తొలి అమెరికా మహిళా వ్యోమగామిగా కూడా చరిత్ర సృష్టించారు క్యాతీ. ఈ క్రమంలో 1984, అక్టోబర్ 11న మిషన్ స్పెషలిస్ట్ డేవిడ్ లీస్మాతో కలిసి మూడున్నర గంటల పాటు స్పేస్‌వాక్ చేశారామె. ఇందులో భాగంగా కక్ష్యలో ఉన్న ఉపగ్రహానికి ఇంధనం అందించవచ్చని వారు రూపొందించిన ఒక డిజైన్ ద్వారా నిరూపించారు. * దాదాపు పదిహేనేళ్ల పాటు నాసాలో పనిచేసిన క్యాతీ.. 2004లో ‘ఆస్ట్రొనాట్ హాల్ ఆఫ్ ఫేమ్’లో కూడా చోటు దక్కించుకున్నారు. * అంతరిక్షంలో నడిచిన తొలి అమెరికా మహిళా వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన క్యాతీని ‘సొసైటీ ఆఫ్ వుమన్ జియోగ్రాఫర్స్’ బంగారు పతకంతో సత్కరించింది. * 2014లో టైమ్ పత్రిక విడుదల చేసిన ‘వందమంది ప్రభావశీలురైన వ్యక్తుల’ జాబితాలో చోటు దక్కించుకున్నారీ అమెరికన్ మాజీ వ్యోమగామి.
|
Photo: Twitter