కరోనా ధాటికి ప్రపంచమంతా కకావికలమవుతోంది. అమెరికా, బ్రిటన్ లాంటి అగ్రదేశాల అధిపతులు సైతం ఈ వైరస్ విస్తృతిని అదుపు చేయలేక ఆపసోపాలు పడుతున్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న మరణాలు, పాజిటివ్ కేసులను కట్టడి చేయలేక చేతులెత్తేస్తున్న పరిస్థితి వారిది. అలాంటిది ఇంకా 40 ఏళ్లు కూడా నిండని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్ మాత్రం ఈ మహమ్మారి మెడలను పూర్తిగా వంచేశారు. ఓ మహిళ ముందుచూపు ఎంత మేలు చేస్తుందో మరోసారి నిరూపించిన ఆమె తన పాలనా దక్షతతో కరోనా కోరలు పూర్తిగా పీకేసింది. తాజాగా ఆ దేశంలో మిగిలి ఉన్న చివరి కరోనా బాధితురాలు కూడా పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లినట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఈ ప్రాణాంతక మహమ్మారిని పూర్తిగా నిర్మూలించిన అతి తక్కువ దేశాల జాబితాలో న్యూజిలాండ్ చేరింది.
17 రోజులుగా కొత్త కేసుల్లేవ్!
కేవలం 50లక్షల జనాభా ఉన్న న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని జయించింది. ప్రస్తుతం ఆ దేశంలో కొవిడ్ బాధితుల సంఖ్య సున్నాకు చేరుకుంది. చిట్టచివరి కరోనా బాధితురాలు కూడా పూర్తిగా కోలుకున్నట్లు ఆ దేశ వైద్యాధికారులు ప్రకటించారు. అదేవిధంగా ఆ దేశంలో 17 రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. ఈ 17 రోజుల్లో మొత్తం 40 వేలమందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందరికీ ‘నెగెటివ్’ రావడం విశేషం. దీంతో కరోనాను పూర్తిగా నిర్మూలించిన అతి తక్కువ దేశాల జాబితాలో న్యూజిలాండ్ చేరింది. ప్రత్యేకించి ఆ దేశ ప్రధాని జెసిండా ముందు చూపు, పాలనా దక్షత కివీస్ పౌరులకు కరోనా రక్షణ కవచాలుగా మారాయని చెప్పవచ్చు.
ఉపద్రవాన్ని ముందే పసిగట్టారు!
ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం కరోనాను అంచనా వేయడంలో తప్పటడుగులు వేశారు. ఫలితంగా ఆ అగ్రరాజ్యంలో పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోయాయి. బ్రిటన్, ఇటలీ దేశాలు కూడా కరోనాను సరిగా అంచనా వేయలేక చావు దెబ్బ తిన్నాయి. అయితే న్యూజిలాండ్ ప్రధాని జెసిండా మాత్రం ఆ తప్పు చేయలేదు. అందరికంటే ముందు మహమ్మారిని పసిగట్టారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 3నే చైనా నుంచి రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించారు. దీనికంటే ముందే కరోనా పుట్టిన చైనాలోని వుహాన్ నుంచి తమ దేశస్థులను తరలించారు. అదేవిధంగా వారికి 14 రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరి చేశారు. అక్కడ పూర్తిగా నెగెటివ్‌గా అని తేలిన అనంతరమే వారిని ఇళ్లకు పంపారు.
మొదటి కేసు అప్పుడే!
ఈక్రమంలో ఫిబ్రవరి 28న ఇరాన్ నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా వైరస్ సోకిందని తేలింది. ఆ దేశంలో ఇదే తొలి కరోనా కేసు కావడం గమనార్హం. దీంతో మరింత జాగ్రత్త పడిన జెసిండా విదేశాల నుంచి ఎవరొచ్చినా 14 రోజులు ఐసొలేషన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. వారితో సన్నిహితంగా మెలిగిన వారికి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. అలా కరోనా పూర్తిగా కోరలు విప్పకముందే తన అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
భారీ సంఖ్యలో పరీక్షలు!
అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కరోనా తన పని తాను చేసుకుపోయింది. అవకాశం ఉన్న చోటల్లా తన పంజా విసిరింది. దీంతో మరింత అప్రమత్తమయ్యారు జెసిండా. మార్చి 15 నుంచి పద్నాలుగు రోజుల పాటు ప్రజలంతా ఎవరి ఇళ్లకు వారు పరిమితం కావాలని ఆదేశించారు. కానీ కరోనా బాధితుల సంఖ్య ఒక్కసారిగా 400కు చేరడంతో ఆ గడువు ముగియకుండానే సంపూర్ణ లాక్‌డౌన్‌ను ప్రకటించారు. అయితే ఇందులో నుంచి నిత్యావసరాలు, వైద్య సర్వీసులను మినహాయించారు. మహమ్మారి మెడలు పూర్తిగా వంచేందుకు సిద్ధమైన ఆమె భారీ సంఖ్యలో కరోనా టెస్టులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఈక్రమంలో మొత్తం 3లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా వారిలో 1500మందికి కరోనా సోకినట్లు తేలింది. అదేవిధంగా అధునాతనమైన వైద్య సేవలతో సాధ్యమైనంతవరకు మరణాలను నియంత్రించగలిగారు. కరోనా కారణంగా ఆ దేశంలో మొత్తం 22 మంది మరణించారు.
ధైర్యం చెబుతూ... భరోసా ఇస్తూ!
కరోనాను తేలిగ్గా తీసుకోవడం వల్లనే అమెరికా, ఇటలీలో భారీగా మరణాలు సంభవించాయి. అయితే అలాంటి దీన పరిస్థితి తమ దేశంలో రాకుండా ముందుగానే జాగ్రత్తపడ్డారు జెసిండా. లాక్డౌన్ ఆంక్షలను పటిష్ఠంగా అమలయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా నిబంధనలను ఉల్లంఘించి తన కుటుంబాన్ని వెంట పెట్టుకుని విహారానికి వెళ్లిన ఆరోగ్య మంత్రి బాధ్యతల్లో కోత విధించి తన దేశ ప్రజలకు గట్టి సందేశం పంపించారు. అయితే చాలా దేశాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా తొలినాళ్లలోనే వందకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక్కడే ప్రధానిగా ప్రజలకు పూర్తి భరోసా ఇచ్చారు జెసిండా. తన మాటలు, చేతలతో వారిలో ధైర్యం నింపారు. ‘ కరోనా వల్ల కష్టాలు రాబోతున్నాయని తెలుసు. కానీ వాటిని అందరికంటే ముందే అధిగమిద్దాం. సుమారు 140 కోట్ల జనాభా ఉన్న చైనా తన ప్రజలందరికీ ఈ మహమ్మారి సోకకుండా నియంత్రించగలిగింది. అలాంటిది 50 లక్షల జనాభా గల మనం ఎందుకు ఈ పని చేయలేం’ అంటూ దేశ ప్రజలందరికీ సెల్ఫోన్ల ద్వారా సంక్షిప్త సందేశాలు పంపి వారిలో స్ఫూర్తి నింపారు.
అమ్మ మనసు చాటుకున్నారు!
గతంలో ఐక్యరాజ్యసమితి సమావేశానికి తన బిడ్డతో సహా హాజరై తల్లి మనసును చాటుకున్నారు జెసిండా. అయితే లాక్డౌన్ కాలంలోనూ ఓ అమ్మగా అదే పంథాను అనుసరించారామె. పటిష్టంగా లాక్డౌన్ అమలు చేసినా నిత్యావసర వస్తువులు, అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వీటిలో పిల్లల సాహిత్యానికీ చోటిచ్చారు. కామిక్ పుస్తకాలు, కథల పుస్తకాలు, పిల్లల మేధస్సును పెంచే పుస్తకాలను అందుబాటులో ఉంచి.. అందరి మన్ననలూ అందుకున్నారు.
|
ఫలించిన బుడగల ప్రయోగం!
లాక్డౌన్ కారణంగా నెలల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడంతో చాలామంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని ముందుగా వూహించిన జెసిండా బుడగల(బబుల్) ప్రయోగం చేశారు. ఇందులో భాగంగా బయటకు వెళ్లకుండా ఇళ్లలో ఉన్నవారిని ఓ బృందంగా (బబుల్)గా పరిగణించారు. కొద్దిరోజుల తర్వాత తమకు అతి సమీపంలోని బంధువులో, స్నేహితులో ఉంటే వారిని కలిసేందుకు అనుమతించారు. అయితే వారు కూడా ఎక్కడికీ వెళ్లని వారై...కరోనాకు దూరంగా ఉన్నవారై ఉండాలి. అలా..ఈ చిన్న బుడగల సమూహాలు కలుసుకోవడానికి అనుమతించడం ద్వారా ప్రజలలో ఎలాంటి మానసిక సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
|
నా కూతురి ఎదుట డ్యాన్స్ చేశాను!
వైరస్ నియంత్రణలో భాగంగా న్యూజిలాండ్‌లో సుమారు ఏడు వారాల పాటు కఠినంగా లాక్డౌన్ అమలు చేశారు జెసిండా. తద్వారా మహమ్మారి మెడను పూర్తిగా వంచిన ఆమె.. సోమవారం అర్ధరాత్రి నుంచే లాక్డౌన్ ఆంక్షలన్నింటినీ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ‘కరోనాను కట్టడి చేశామన్న వార్త వినగానే నేను నా కూతురు నేవ్ ఎదుట డ్యాన్స్ చేశాను. ప్రస్తుతానికైతే న్యూజిలాండ్ వైరస్ వ్యాప్తిని నియంత్రించగలిగింది. అయితే ఇది తాత్కాలికమే. దేశంలో మళ్లీ కేసులు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు జెసిండా.
|
కరోనాను కట్టడి చేయలేక అగ్రదేశాధి నేతలే తలలు పట్టుకొంటున్నారు. ఈ పరిస్థితుల్లో తన ముందుచూపు, పాలనా దక్షతతో వైరస్‌ను కట్టడి చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు జెసిండా. ఒక ప్రజా నేతగా నిత్యం ప్రజలతో మమేకమవుతూ అన్ని దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.