9 నెలల నిండు గర్భిణీ అంటే సాధారణ సమయంలోనే ఇంట్లో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అత్యవసరమైతే తప్ప వారిని అడుగుబయటపెట్టనివ్వకూడదు. ఇక కరోనా మహమ్మారి గర్భిణీలతో పాటు చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులపై అధిక ప్రభావం చూపుతుందని వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి ఈ గడ్డుకాలంలో గర్భిణీలు మరింత అప్రమత్తంగా ఉండాలని వారు చెబుతున్నారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కర్ణాటకకు చెందిన ఓ నర్సు 9 నెలల నిండు గర్భంతో రోగులకు వైద్య సేవలందిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న ఆమె తన ఆరోగ్యం కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమంటూ వృత్తి ధర్మాన్ని చాటుతోంది. మరి ఆపత్కాలంలోనూ వృత్తి పట్ల అంతటి అంకితభావం చూపుతున్న ఆ కరోనా యోధురాలి గురించి మనమూ తెలుసుకుందాం రండి.!
మరికొద్ది రోజుల్లో అమ్మగా ప్రమోషన్!
మనదేశానికి సంబంధించి కరోనా ప్రభావిత రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటి. రోజురోజుకీ కరోనా బాధితులు పెరుగుతుండడం, వారికి సరిపడా వైద్య సిబ్బంది లేకపోవడంతో ఉన్న వారిపై పనిభారం పెరుగుతోంది. ఈనేపథ్యంలో 9నెలల నిండు చూలాలైనప్పటికీ నర్సుగా రోగులకు వైద్య సేవలందిస్తోంది శివమొగ్గ జిల్లా గాజనూరుకు చెందిన రూపా ప్రవీణ్ రావ్. తీర్థనహల్లి జయచామ రాజేంద్రప్రసాద్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఆమె మరికొన్ని రోజుల్లో అమ్మగా ప్రమోషన్ పొందనుంది. ఈమేరకు సిజేరియన్ ప్రసవానికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ అయింది. కరోనా కారణంగా బయట అడుగుపెట్టేందుకు సామాన్యులే జంకుతున్నారు. అలాంటిది ఆమె మాత్రం రోజూ గాజనూరు నుంచి తీర్థనహల్లికి వెళ్లి మరీ రోగులకు సేవలందిస్తోంది.
విశ్రాంతి తీసుకోమని చెప్పినా!
తీర్థనహల్లి చుట్టుపక్కల ఉండే పలు గ్రామాల ప్రజలకు జయచామ రాజేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి ఒక్కటే ఆధారం. దీంతో ప్రసవ సమయం దగ్గరపడుతున్నప్పటికీ సెలవు తీసుకోకుండా వృత్తి ధర్మాన్ని చాటుతోంది రూప. ‘నిండు గర్భిణివి. ఈ సమయంలో నీకు విశ్రాంతి చాలా అవసరం. ఆస్పత్రికి సెలవు పెట్టచ్చు కదమ్మా’ అని ఆమె కుటుంబ సభ్యులు, ఆస్పత్రిలోని సీనియర్లు చెబుతున్నా తన వైద్య సేవలను మాత్రం విడిచిపెట్టలేదీ గ్రేట్ నర్స్.
నా బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది!
‘తొమ్మిది నెలల గర్భంతో వైద్య సేవలు అందించడం కొంచెం కష్టం. కానీ చుట్టుపక్కల ఉండే గ్రామాల ప్రజలన్నింటికీ ఈ ఆస్పత్రే ఆధారం. సెలవు తీసుకోమని నా సీనియర్లు కూడా సూచించారు. కానీ కరోనా సంక్షోభంలో వారికి మా సేవలు చాలా అవసరం. ఖాళీగా ఇంటిపట్టున ఉండే బదులు ఆస్పత్రికి వస్తే రోగులకైనా మేలు జరుగుతుంది. ప్రస్తుతం రోజుకు ఆరు గంటలు పనిచేస్తున్నా. నేను నా విధులను పూర్తి అంకిత భావంతో నిర్వర్తిస్తున్నాను. రాష్ర్ట ముఖ్యమంత్రి యడియూరప్ప నా గురించి తెలుసుకుని ఫోన్ చేసి స్వయంగా అభినందించారు. ఆయన కూడా నన్ను విశ్రాంతి తీసుకోమని సూచించారు. దీంతో నాకు చాలా సంతోషమేసింది. గర్భిణులు సంతోషంగా, మానసిక సంతృప్తితో ఉంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందట. నేను నా సేవలతో ఎంతో సంతోషంగా, సంతృప్తిగా ఉన్నా. ఇక నాకు విశ్రాంతి ఎందుకు?’ అని నవ్వుతూ చెబుతోంది రూప.
నిండు గర్భంతో ఉన్నా, రోగుల కారణంగా తనకు పుట్టబోయే బిడ్డకు ప్రమాదమని తెలిసినా కరోనా బాధితులకు సేవలందించడానికి ధైర్యంతో ముందడుగు వేసిన ఈ నర్సు సాహసానికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇలా ఎందరో వైద్యులు, వైద్య సిబ్బంది.. తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ కరోనాతో పోరాడుతున్నారు. మరి కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న ఇలాంటి నర్సులు, వైద్య సిబ్బందికి మనమూ ‘హ్యాట్సాఫ్’ చెబుదాం!